Share News

Karimnagar: నిన్న స్కూల్‌ టీచర్‌... నేడు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌

ABN , Publish Date - Feb 17 , 2026 | 12:31 AM

చొప్పదండి, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): ఆమె ఎమ్మెస్సీ బీఈడీ చేసిన విద్యావంతురాలు.. ప్రైవేట్‌ స్కూల్‌లో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు.

Karimnagar:  నిన్న స్కూల్‌ టీచర్‌... నేడు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌

- చొప్పదండి పుర పీఠం రెండోసారి మహిళలకే..

చొప్పదండి, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): ఆమె ఎమ్మెస్సీ బీఈడీ చేసిన విద్యావంతురాలు.. ప్రైవేట్‌ స్కూల్‌లో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. రాజకీయ అనుభవం లేని కుటంబం నుంచి వచ్చినప్పటికి అనూహ్యంగా రిజర్వేషన్‌ అనుకూలించడంతో ఉపాధ్యాయరంగాన్ని వదిలిపెట్టి రాజకీయరంగంలోకి వచ్చారు. మొదటి ప్రయత్నంలోనే కౌన్సిలర్‌గా విజయం సాధించడమే కాకుండా ఏకంగా మున్సిపాలిటీకి చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు వడ్లూరి సరిత..

- విద్యావంతురాలికే పట్టం...

చొప్పదండి మున్సిపాలిటీ ఎస్సీ మహిళకు రిజర్వ్‌ కావడంతో విద్యావంతురాలిరి బరిలోకి దింపాలని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రయత్నాలు ప్రారంభించారు. ఎమ్మెస్సీ బీఈడీ చేసి ప్రైవేట్‌ టీచర్‌గా పనిచేస్తున్న వడ్లూరి సరితను కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానించి చైర్‌ పర్సన్‌ చేస్తామని హామీ ఇచ్చి ఒకటో వార్డు కౌన్సిలర్‌ అభ్యర్థిగా ప్రకటించారు. ఒకటో వార్డులో 300లకుపైగా భారీ మెజార్టీతో సరిత గెలుపొందారు. ఈ నేపథ్యంలో చైర్‌పర్సన్‌ ఎన్నిక లాంఛనమైపోయింది. కాంగ్రెస్‌ పార్టీకి మెజార్టీ స్థానాలు రాగా వడ్లూరి సరిత చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయింది.

- చొప్పదండి పురపీఠం రెండోసారి మహిళలకే...

మేజర్‌ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారిన చొప్పదండికి రెండుసార్లు ఎన్నికలు జరుగగా రెండుసార్లు చైర్‌పర్సన్ల అవకాశం మహిళలకే దక్కింది. గతంలో జనరల్‌ మహిళకు రిజర్వ్‌ కాగా చైర్‌పర్సన్‌గా గుర్రం నీరజ, వైస్‌ చైర్‌పర్సన్‌గా విజయలక్ష్మి ఎన్నికయ్యారు. తాజాగా చైర్‌పర్సన్‌ ఎస్సీ మహిళకు రిజర్వ్‌ కాగా చైర్‌పర్సన్‌గా వడ్లూరి సరిత ఎన్నిక కాగా వైస్‌ చైర్‌పర్సన్‌ పదవి కూడా మహిళకే కట్టబెట్టారు. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడైన పెరుమాండ్ల గంగయ్యగౌడ్‌ సతీమణి, 14వ వార్డు కౌన్సిలర్‌ పెరుమాండ్ల మానసను వైస్‌ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. వరుసుగా రెండుసార్లు చైర్‌పర్సన్లు, వైస్‌ చైర్‌పర్సన్లు మహిళలకే కట్టబెట్టడం విశేషం.

- వైస్‌ చైర్‌పర్సన్‌గా పెరుమాండ్ల మానస

చొప్పదండి మున్సిపాలిటీ చైర్‌ పర్సన్‌గా ఒకటో వార్డు సభ్యురాలు వడ్లూరి సరిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం చొప్పదండి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో నూతన కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నిక నిర్వహించారు. చైర్‌పర్సన్‌గా వడ్లూరి సరిత, వైస్‌ చైర్‌ పర్సన్‌గా పెరుమాండ్ల మానసను కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థులు ప్రకటించింది. మొత్తం 14 వార్డులు ఉండగా కాంగ్రెస్‌ పార్టీ 10 స్థానాలు, బీజేపీ 3, బీఆర్‌ఎస్‌ 1 స్థానంలో గెలుపొందింది. మెజార్టీ సభ్యులు కాంగ్రెస్‌ పార్టీ వారు ఉండగా ఎన్నిక ఏకగ్రీవమయింది. కాంగ్రెస్‌ పార్టీ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా వడ్లూరి సరిత, వైస్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా పెరుమాండ్ల మానస ఇద్దరే బరిలో ఉండగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు.

Updated Date - Feb 17 , 2026 | 12:31 AM