Share News

Karimnagar: పనులు పూర్తయినా.. బిల్లులు ఇవ్వరా

ABN , Publish Date - Aug 23 , 2026 | 12:07 AM

రామడుగు, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): మండలంలో అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టిన మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు

Karimnagar:   పనులు పూర్తయినా.. బిల్లులు ఇవ్వరా

- ఇబ్బందుల్లో మాజీ ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు

రామడుగు, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): మండలంలో అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టిన మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో అమలైన మన ఊరి మనబడి పథకం కింద రామడుగు మండలంలోని 11 పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, డైనింగ్‌హాల్లు, తాగునీటి వసతి, విద్యుత్‌, మరుగుదొడ్లు వంటి పనులు పూర్తి చేశారు. గోపాల్‌రావుపేట జిల్లా పరిషత్‌ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో లక్షలాది రూపాయలు వెచ్చించి పనులు చేసిన వారికి 50 శాతం మాత్రమే చెల్లింపులు జరిగాయి. అప్పులు తెచ్చి పనులు పూర్తిచేయగా బిల్లులు చెల్లించకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని పాఠశాలల్లో పనులు పూర్తి చేయగా చెల్లింపులు లేక కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు గ్రామ పంచాయతీ అభివృద్ధిలో భాగంగా పలు పనులు పూర్తి చేసిన అప్పటి ప్రజాప్రతినిధులకు బిల్లులు చెల్లించడంలో అలసత్వం ప్రదర్శించడంతో వారు అధికారులు చుట్టూ తిరుగుతూ డబ్బులు చెల్లించాలని కోరుతున్నారు.వెంటనే బిల్లులు చెల్లించి తమను ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఫ ఇప్పటికీ బిల్లులు రాలేదు...

- పంజాల ప్రమీల జగన్మోహన్‌గౌడ్‌, మాజీ సర్పంచ్‌, రామడుగు

పాఠశాల అభివృద్ధి కోసం ఐదు లక్షల రూపాయలతో పనులు చేపట్టాం. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రాలేదు. అలాగే గ్రామంలో 65 లక్షల రూపాయలను పనులు చేపడితే ఇప్పటి వరకు 35 లక్షలు మాత్రమే వచ్చాయి. ప్రభుత్వం బిల్లులు చెల్లించి ఆదుకోవాలి.

ఫ పనులు పూర్తయినా డబ్బులు రాలేదు...

- కొలిపాక మల్లేశం, గోపాల్‌రావుపేట

పాఠశాలల్లో మౌలిక వసతులకు 10.30 లక్షలు ఖర్చు చేశాము. ఇప్పటి వరకు 5.70 లక్షలు మాత్రమే వచ్చాయి. ఇంకా ఆరు లక్షలకుపైగా రావాల్సి ఉంది. పద్మశాలి సంఘ భవనాన్ని మూడు లక్షల రూపాయలతో నిర్మించాము. అయితే దానికి సంబంధించి డబ్బులు ఇంకా రాలేదు. దాదాపు 10 లక్షల రూపాయలు బిల్లులు నిలిచిపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. అధికారులు వెంటనే బిల్లులు చెల్లించి ఆదుకోవాలి.

Updated Date - Aug 23 , 2026 | 12:07 AM