Share News

Karimnagar: మెమోలు ఇవ్వరా..?

ABN , Publish Date - Sep 03 , 2026 | 11:46 PM

గణేష్‌నగర్‌, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని ఎల్‌ఎల్‌బీ ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులు ప్రొవిజనల్‌ మెమోలు చేతికందక ఆందోళన చెందుతున్నారు.

 Karimnagar:   మెమోలు ఇవ్వరా..?

- ఎస్‌యూ న్యాయ శాస్త్ర విద్యార్థుల ఆందోళన

గణేష్‌నగర్‌, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని ఎల్‌ఎల్‌బీ ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులు ప్రొవిజనల్‌ మెమోలు చేతికందక ఆందోళన చెందుతున్నారు. ఫలితాలు వెల్లడించి మూడు వారాలు గడుస్తున్నా యూనివర్సిటీ పరిధిలోని న్యాయ కళాశాలలకు ప్రొవిజినల్‌ మెమోలు చేరలేదు. న్యాయ కోర్సుల అనంతరం శాతవాహన యూనివర్సిటీ పరిధిలో మెమోల జారీలో ప్రతి సంవత్సరం ఇదే తంతు కొనసాగుతుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- బార్‌ కౌన్సిల్‌లో నమోదుకు బ్రేకులు

మెమోలు రాక పోవడంతో విద్యార్థులు బార్‌ కౌన్సిల్‌లో తమ పేర్లు నమోదు చేసుకోలేక పోతున్నారు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ఈ నెల నుంచి బార్‌ కౌన్సిల్‌ ప్రారంబించింది. ఎల్‌ఎల్‌బీ ఫైనల్‌ ఇయర్‌ ఉత్తీర్ణులైన విద్యార్థులకు మెమోలు ఇవ్వకపోవడంతో రిజిస్ట్రేషన్‌ చేసుకోలేకపోతున్నారు. శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని న్యాయశాస్త్రం ఫైనల్‌ ఇయర్‌ పరీక్షలను ఆదరబాదరగా నిర్వహించారు. ఎల్‌ఎల్‌ఎం అడ్మిషన్‌ ప్రక్రియంలో జాప్యం కారాదనే ఉద్దేశ్యంతో ఎల్‌ఎల్‌బీ పరీక్షల షెడ్యుల్‌ను ప్రకటించి వారం రోజుల్లోనే ఫలితాలు వెల్లడించారు. ప్రొవిజినల్‌ మెమోలు జారీచేయడంలో నిర్లక్ష్యం వహిస్తుండడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందదింంచి ప్రొవిజినల్‌ మెమోలను అందించాలని విద్యార్థులు కోరుతున్నారు.

- మెమోలు రావడానికి సమయం పడుతుంది

మెమోల విషయమై శాతవాహన యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్‌ డి సురేష్‌కుమార్‌ను వివరణకోరగా ఫలితాలు ఇటీవలనే వచ్చాయన్నారు. మెమోలు రావడానికి కొంత సమయం పడుతుందని తెలిపారు.

Updated Date - Sep 03 , 2026 | 11:46 PM