Karimnagar : వేసవి క్రీడా శిబిరాల జాడేది?
ABN , Publish Date - Apr 27 , 2026 | 01:02 AM
కరీంనగర్ స్పోర్ట్స్, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): ప్రతి సంవత్సరం వేసవిలో నగరపాలక సంస్థ ఉచిత వేసవి క్రీడా శిక్షణా శిబిరాలను జిల్లా కేంద్రంలో నిర్వహిస్తుంది.
- స్పందించని నగరపాలక సంస్థ
- ఎదురుచూస్తున్న విద్యార్థులు, క్రీడాకారులు
- వేసవి సెలవులు ప్రారంభం
కరీంనగర్ స్పోర్ట్స్, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): ప్రతి సంవత్సరం వేసవిలో నగరపాలక సంస్థ ఉచిత వేసవి క్రీడా శిక్షణా శిబిరాలను జిల్లా కేంద్రంలో నిర్వహిస్తుంది. 2017 నుంచి ఆరుసార్లు వేసవి శిక్షణ శిబిరాలను నగరపాలక సంస్థ నిర్వహించింది. ఈ సంవత్సరం విద్యార్థులకు వేసవి సెలవులు ప్రారంభమైనప్పటికీ నగరపాలక సంస్థ నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో క్రీడా శిక్షణ శిబిరాలు ఉన్నట్టా... లేనట్టా.. అనే సందేహం కలుగుతోంది. ఇంతవరకు పాలకవర్గం నుంచి ఎలాంటి సమాచారాన్ని జిల్లా క్రీడా శాఖకు గాని, జిల్లా ఒలంపిక్ అసోసియేషన్‌కుగాని ఇవ్వలేదు. ఈసారి క్రీడా శిబిరాల నిర్వహణ విషయం చేతులెత్తేశారా అన్నట్టుగానే సందేహం కలగుతోంది. గత సంవత్సరం కొంత ఆలస్యంగా నగరపాలక సంస్థ వేసవి క్రీడా శిబిరాలను మే 23 నుంచి నిర్వహించింది. ఈ సంవత్సరం నూతన పాలకవర్గం ఏ నిర్ణయం తీసుకుంటుందోనని విద్యార్థులు, క్రీడాకారులు ఎదురుచూస్తున్నారు.
ఫ 2017లో మొదటిసారిగా..
నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 2017 నుంచి ఉచిత క్రీడా శిక్షణ శిబిరాలను జిల్లా క్రీడా శాఖ సహకారంతో నిర్వహిస్తోంది. వేసవి సెలవుల్లో ఇంటిపట్టునే ఉంటున్న చిన్నారులకు జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో ఉచిత శిక్షణను ఇచ్చారు. నగరపాలక సంస్థ ఇంతవరకు ఈ సంవత్సరం ఎలాంటి ఉచిత క్రీడా శిబిరాల నిర్వహణ ప్రకటన చేయలేదు. 2015లో క్రీడాంశాల్లో శిక్షణ శిబిరాల నిర్వహించగా 1,500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. 2018లో 20 క్రీడాంశాల్లో 2,500, 2019లో 22 క్రీడాంశాల్లో 3,000, 2022లో 27 క్రీడాంశాల్లో 3,200, 2023లో 28 క్రీడాంశాల్లో 3,000 మంది విద్యార్థులు శిక్షణ శిబిరాలలో పాల్గొన్నారు. గత సంవత్సరం నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరాల్లో 27 క్రీడాంశాలలో 3,200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. గత సంవత్సరం జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో శిక్షణ శిబిరాలను నిర్వహించారు. ప్రతిరోజు అనేక మంది విద్యార్థులు అంబేద్కర్ స్టేడియానికి క్రీడా శిబిరాల కోసం వచ్చి అధికారులను అడుగుతున్నారు.
ఫ బల్దియాకు ఆర్థిక భారమా..
కొన్ని సంవత్సరాలుగా శిక్షణ శిబిరాలను విజయవంతంగా నిర్వహించిన బల్దియ ఈ సంవత్సరం ఉచిత వేసవి క్రీడా శిక్షణా శిబిరాలను విద్యార్థులకు నిర్వహించకపోవడం తో అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ శిబిరాల నిర్వహణకు వెచ్చించాల్సిన వ్యయం పెరుగుతుండడంతో నగరపాలక సంస్థ వెనకడుగు వేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత సంవత్సరం నిర్వహించిన వేసవి క్రీడా శిక్షణా శిబిరాల కోచులకు ఇంతవరకు గౌరవ వేతనం అందలేదు. వేసవి క్రీడా శిబిరాలు నిర్వహిస్తే వివిధ క్రీడాంశాల్లో కనీసం 50 మంది కోచ్‌లను నియమించాల్సి ఉంటుంది. వారికి కూడా గౌరవ వేతనం అందించాల్సి వస్తుంది. నగరపాలక సంస్థ ఈ విషయాలను ఆలోచించి ఆర్థిక భారం కన్నా, శిబిరాల నిర్వహించకుండా ఉంటే ఎలాంటి సమస్య ఉండదు అన్న ధోరణిలో ఉందని పలువురు కోచ్‌లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఫ వేసవి క్రీడా శిబిరాలు నిర్వహించాలి
- వై మహేందర్‌రావు, జిల్లా ఖో-ఖో అసోసియేషన్ కార్యదర్శి
వేసవి సెలవులు వస్తే పిల్లలు ఏదో ఒక క్రీడాశిక్షణలో పాల్గొనేవారు. గతంలో నగరపాలక సంస్థ వారు వేసవి క్రీడా శిబిరాలు నిర్వహించేవారు. ఈ సంవత్సరం ఇంతవరకు నగరపాలక సంస్థ నుంచి ఎలాంటి సమాచారం లేదు. గతంలో శిక్షణ పొందిన విద్యార్థులు ఉత్తమ క్రీడాకారులుగా ఎదిగారు. నగరపాలక సంస్థ వేసవి క్రీడా శిబిరాలు నిర్వహిస్తే బాగుంటుంది.