Karimnagar: మహిళా సాధికారత లక్ష్యంగా సంక్షేమ పథకాలు
ABN , Publish Date - May 25 , 2026 | 11:30 PM
కరీంనగర్ టౌన్, మే 25 (ఆంధ్రజ్యోతి): మహిళా సాధికారతే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ
- ప్లాస్టిక్ రహిత కరీంనగర్‌గా తీర్చిదిద్దాలి
- నగర మేయర్ కొలగాని శ్రీనివాస్
- ఘనంగా మహిళా వారోత్సవాలు
కరీంనగర్ టౌన్, మే 25 (ఆంధ్రజ్యోతి): మహిళా సాధికారతే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని అన్నిరంగాల్లో ఎదగాలని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ప్రజాపాలన -ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సోమవారం స్థానిక కళాభారతి ఆడిటోరియంలో మహిళా శిశు సంక్షేమశాఖ, మెప్మా నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి పేరిట మహిళా వారోత్సవాలను ఘనంగా ప్రారంభించారు. అనంతరం న్యూట్రిషన్ మిషన్ థీమ్‌లో భాగంగా పోషకాహార నియమాలపై మహిళలతో ప్రతిజ్ఞ చేయించారు. రేవంతన్నకానుకగా మహిళా సమాఖ్య సభ్యులకు చీరలను పంపిణీ చేశారు. మహిళా సమాఖ్య సంఘాల సభ్యులకు బ్యాంకు లింకేజీకి సంబంధించిన రూ.14.20 కోట్లు, 19.24 లక్షల రుణాల రెండు జంబో చెక్కులను అందజేశారు. బాల్య వివాహాల నిర్మూలన, చైల్డ్ కేరింగ్‌కు సంబం ధించిన 1098, 181 టోల్‌ఫ్రీ నెంబరు పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని, ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించి ప్లాస్టిక్ రహిత కరీంనగర్ మార్చేందుకు కృషిచేయాలని కోరారు. కార్యక్రమంలో మేయర్ శ్రీనివాస్, సుడా చైర్మన్ కోమటిరెడ్డినరేందర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్‌రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య, మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, కార్పొరేటర్ వైద్యుల అంజన్‌కుమార్, కార్పొరేటర్లు, మహిళా సమాఖ్య సంఘాల సభ్యులు, ఆర్పీలు పాల్గొన్నారు.