Karimnagar: నిబద్ధతతో ఉన్నవారికి టికెట్లు ఇచ్చాం
ABN , Publish Date - Feb 05 , 2026 | 12:02 AM
కరీంనగర్ అర్బన్, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీ పట్ల నిబద్ధతతో ఉన్నవారికి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అభ్యర్థులుగా టికెట్లు కేటాయించామని ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
- కరీంనగర్‌లో గెలుపే లక్ష్యంగా శ్రమించాలి
- ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
కరీంనగర్ అర్బన్, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీ పట్ల నిబద్ధతతో ఉన్నవారికి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అభ్యర్థులుగా టికెట్లు కేటాయించామని ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో కాంగ్రెస్ కార్పొరేషన్ అధ్యక్షుడు వైద్యులు అంజన్‌కుమార్ అధ్యక్షతన మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులతో అత్యవసర సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మాజరైన ఇన్‌చార్జి మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ కార్పొరేషన్‌లో గెలుపే లక్ష్యంగా సమష్టిగా శ్రమించాలన్నారు. అభ్యర్థుల ఎంపికలో ఎవరి ప్రమేయం లేదనిస్పష్టం చేశారు. టికెట్లు రానివారికి పార్టీ తప్పకుండా న్యాయం చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. ప్రతి డివిజన్ నుంచి 500 మంది కార్యకర్తలను తరలించి ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతం చేయాలని, రేపటి ముఖ్యమంత్రి సభ విజయవంతమే మీ విజయానికి పునాది అవుతుందని మంత్రి అన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిశీలకులు, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధి నుంచి దాదాపు పదివేల మందిని రేపటి బహిరంగ సభకు తరలించేందుకు నేతలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇంటెలిజన్స్ రిపోర్టు ప్రకారం కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోబోతుందని చెప్పారు. కరీంనగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు మాట్లాడుతూ అభ్యర్థులంతా సఎం బహిరంగ సభకు డివిజన్ల నుంచి పెద్ద ఎత్తున జనాలను తరలించాలన్నారు. ఎమ్మెల్యే కవ్వం పల్లి సత్యనారాయణ మాట్లాడుతూ కార్పొరేషన్‌లో కాంగ్రెస్ పార్టీకి గత వైభవం తీసుకురావడానికి నాయకులు కృషి చేయాలన్నారు. అభ్యర్థులు తమ విజయం కోసం తీవ్రంగా శ్రమించాలన్నారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ కార్పొరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. కార్పొరేషన్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ మాట్లాడుతూ... ముఖ్యమంత్రి ఇచ్చే సందేశంతో డివిజన్ ఓటర్లలో మార్పు వస్తుందని, వారి ఆలోచన విధానం మారుతుందన్నారు. సమావేశంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, నాయకులు అల్ఫోర్స్ నరేందర్‌రెడ్డి, బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి పాల్గొన్నారు.