Karimnagar: పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు
ABN , Publish Date - Mar 20 , 2026 | 12:33 AM
తిమ్మాపూర్, మార్చి 18(ఆంధ్రజ్యోతి): రైతులకు పంటలు ఎంత ముఖ్యమో పశువుల రక్షణకు అంతే ప్రాదాన్యం ఇస్తుంటారు.
- గ్రామాల్లో వైద్య శిబిరాలు
- ఏప్రిల్ 9 వరకు కార్యక్రమాలు
తిమ్మాపూర్, మార్చి 18(ఆంధ్రజ్యోతి): రైతులకు పంటలు ఎంత ముఖ్యమో పశువుల రక్షణకు అంతే ప్రాదాన్యం ఇస్తుంటారు. వ్యవసాయంతో పాటు పాడి పశువుల పెంపకం ద్వారా రైతులు అదనంగా ఆదాయం పొందుతున్నారు. ఆర్థికాభివృద్ధికి మూలమైన పశు సంపదను కాపాడటానికి ప్రభుత్వం గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు పంపిణీ చేస్తున్నది. పశువులు రోగాల బారిన పడకుండా ముందుస్తుగా ఏడాదికి రెండు పర్యాయాలు పశువులకు గాలికుంటు వ్యాది నివారణ టీకాల పంపిణీ చేపడుతున్నారు. ఆవులు, గేదెలు మూడు సంవత్సరాల పైబడిన దూడలకు టీకాలను వేస్తున్నారు.
- గాలికుంటు వ్యాధి లక్షణాలు
దేశవాళి పశువుల్లో కంటే సంకర జాతి పశువుల్లో ఈ గాలికుంటు వ్యాధి తీవ్రత అధికంగా ఉంటుంది. ఈ వ్యాది ఎక్కువగా మార్చి, ఏప్రిల్, సెప్టెంబర్ నెలల్లో పశువులకు వస్తుంది. ఈ వ్యాది సోకిన పశువులకు శరీర ఉష్నోగ్రత 104 డిగ్రీల నుంచి 106 డిగ్రీల వరకు జ్వరం వచ్చి బక్కచిక్కి బలహీన పడుతాయి. దాంతోపాటు పశువులకు నాలుక, పెదాలు, నోరు, కాళ్ల గిట్టల మద్య పుండ్లు ఏర్పడుతాయి. వ్యాధి సోకడంతో పశువులలో వ్యాధి నిరోధక శక్తి తగ్గి పశువులు, దూడలు చనిపోయో ప్రమాదం పొంచి ఉంటుంది.
ఫ నెలరోజుల పాటు టీకాల కార్యక్రమం :
గాలికుంటు నివారణ కోసం పశుసంవర్థక శాఖ అధికారులు ముందస్తు ప్రణాళికతో నెల రోజుల పాటు టీకాల కార్యక్రమం చేపట్టారు. గ్రామాల్లోకి వచ్చి పశువైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తూ టీకాలను ఇస్తున్నారు. ఈ టీకాల కార్యక్రమం ఈ నెల 10వ తేదీన ప్రారంభం కాగా ఏప్రిల్ 9వ తేదీ వరకు నెల రోజలు పాటు కొనసాగనుంది. పశువులకు వచ్చే ప్రాణాంతక వ్యాధుల నివారణకు ఈ టీకాలు ఎంతో అవసరమని, పాడి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియెగం చేసుకోవాలని పశు వైద్యులు సూచిస్తున్నారు.
ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి
మౌనిక, పశు వైద్యాధికారి, తిమ్మాపూర్ మండలం
పశువులకు ఉచిత గాలికుంటు వ్యాది నివారణ టీకాల కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. ఈ నెల 10వ తేదీన కార్యక్రమం ప్రారంభమైంది. పశు వైద్య శిబ్బంది ముందుగా నిర్ణయించిన తేదీల వారీగా గ్రామాలకు వచ్చి ఉచితంగా టీకాలు ఇస్తున్నాం. ఇప్పటికీ ఆరు గ్రామాల్లో 1800 పశువులకు టీకాలు ఇచ్చాం. ఈ టీకాల కార్యక్రమం వచ్చే నెల ఏప్రిల్ 9వ తేదీ వరకు జరుగుతుంది.