Karimnagar: విచ్చలవిడిగా ప్లాస్టిక్ వినియోగం
ABN , Publish Date - Nov 22 , 2026 | 11:51 PM
జమ్మికుంట, నవంబర్ 22 (ఆంధ్రజ్యోతి): ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత కలిగిన జమ్మికుంట మున్సిపల్ యంత్రాంగం ఆ దిశగా ఆశించిన స్థాయిలో చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
- నిబంధనలు కాగితాలకే పరిమితం
జమ్మికుంట, నవంబర్ 22 (ఆంధ్రజ్యోతి): ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత కలిగిన జమ్మికుంట మున్సిపల్ యంత్రాంగం ఆ దిశగా ఆశించిన స్థాయిలో చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పట్టణంలోని చిన్న దుకాణాల నుంచి పెద్ద పెద్ద వ్యాపార సంస్థల వరకు ప్లాస్టిక్ కవర్ల వినియోగం యథేచ్ఛగా కొనసాగుతోంది. అప్పుడప్పుడు అధికారులు తనిఖీలు నిర్వహించడం, కొన్ని దుకాణాలకు జరిమానాలు విధించడం మినహా శాశ్వత పరిష్కారం కనిపించడం లేదు.
- 120 మైక్రాన్ల కంటే తక్కువైతే నిషేధమే!
ప్లాస్టిక్ వినియోగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన నిబంధనలు విధించాయి. 2022 డిసెంబరు 31 నుంచి 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల తయారీ, నిల్వ, పంపిణీ, విక్రయాలు, వినియోగంపై నిషేధం ఉంది. ప్లాస్టిక్ నిబంధనలు ఉల్లంఘించే వ్యాపార సంస్థలపై జరిమానాల విషయంలో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఏప్రిల్‌లో పర్యావరణ పరిరక్షణ మార్గదర్శకాలను జారీ చేసింది. వాణిజ్య సంస్థలు మొదటిసారి నిబంధనలు ఉల్లంఘిస్తే రెండు వేలు, రెండోసారి ఐదు వేలు, మూడోసారి 10 వేల కనీస పర్యావరణ పరిహారం విధించే విధానం ఉంది. నిషేధిత ప్లాస్టిక్ వస్తువులను స్వాధీనం చేసుకోవడంతోపాటు, నిబంధనల ప్రకారం ట్రేడ్ లైసెన్స్‌లు రద్దు చేయవచ్చు. జమ్మికుంటలో పదేపదే ప్లాస్టిక్ కవర్లతో పట్టుబడుతున్న వ్యాపారులపై వరుసగా నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటేనే ప్లాస్టిక్ వినియోగానికి అడ్డుకట్ట పడే అవకాశం ఉంది.
- అధికారులకే అడ్డంకులైతే నియంత్రణ ఎలా?
ప్లాస్టిక్ నియంత్రణలో మున్సిపల్ అధికారుల పాత్ర కీలకం. వ్యాపార సంస్థల్లో తనిఖీలు నిర్వహించడం, నిషేధిత కవర్లను స్వాధీనం చేసుకోవడం, జరిమానాలు విధించడం, ప్లాస్టిక్ వ్యర్థాలను వేరు చేసి సేకరించడం వంటి బాధ్యతలు స్థానిక సంస్థలపై ఉన్నాయి. తనిఖీల సమయంలో రాజకీయ ఒత్తిళ్లు ఎదురవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. తనిఖీలను అడ్డుకునే వారెవరైనా సరే చట్ట ప్రకారం చర్యలు చేపట్టాల్సిందే. చిన్న దుకాణాలపై మాత్రమే చర్యలు తీసుకుని, పెద్ద వ్యాపార సంస్థలను వదిలేయడం సరికాదని చిరువ్యాపారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
- ఇప్పటికైనా ప్రత్యేక కార్యాచరణ అవసరం
జమ్మికుంట మున్సిపల్ పాలకవర్గం, అధికారులు సంయుక్తంగా ప్రత్యేక ప్లాస్టిక్ నియంత్రణ కార్యాచరణ చేపట్టాల్సిన అవసరం ఉంది. పట్టణంలోని అన్ని దుకాణాల్లో ఒకేసారి తనిఖీలు నిర్వహించి, నిషేధిత ప్లాస్టిక్ కవర్లు, వస్తువులను స్వాధీనం చేసుకోవాలి. తనిఖీల వివరాలు, జరిమానాలు, స్వాధీనం చేసుకున్న ప్లాస్టిక్ పరిమాణాన్ని బహిరంగంగా ప్రకటించాలి. మళ్లీ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.