Karimnagar: కరీంనగర్‌లో కట్టుదిట్టమైన భద్రత...
ABN , Publish Date - Jun 19 , 2026 | 12:22 AM
కరీంనగర్ క్రైం, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): పోలీస్ కమీషనరేట్ వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశామని సీపీ గౌస్ ఆలం తెలిపారు.
- సీపీ గౌస్ ఆలం
కరీంనగర్ క్రైం, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): పోలీస్ కమీషనరేట్ వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశామని సీపీ గౌస్ ఆలం తెలిపారు. దీనిలో భాగంగా, నగరంలోని రద్దీ ప్రాంతాల్లో విస్తృతస్థాయిలో, పోలీసు జగిలాలతో తనిఖీలు, ప్రధాన కూడళ్లలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాలను అరికట్టడానికి, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువుల కదలికలను గుర్తించడానికి ఈ తనిఖీలు ఉపయోగపడతాయని సీపీ తెలిపారు. ఈ భద్రతా చర్యలకు వాహనదారులు, ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే డయల్ 100కు లేదా పోలీసు కంట్రోల్ రూమ్ మొబైల్ నంబర్ 8712670744కు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.
- మహిళలు, చిన్నారుల కేసుల దర్యాప్తులో వేగం పెంచాలి
కమిషనరేట్ పరిధిలో పెండింగ్ కేసులను పరిష్కరించాలని సీపీ గౌస్ ఆలం ఆదేశించారు. కమిషనరేట్ కేంద్రంలోని కాన్ఫరెన్స్ హాలులో సీపీ అధ్యక్షతన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ... మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలు, పోక్సో, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ, తీవ్రమైన నేరాల దర్యాప్తును వేగవంతం చేయాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే రౌడీ షీటర్ల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని, చట్టవ్యతిరేక పనులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో ఏసీపీలు శ్రీనివాస్ జి విజయకుమార్, వెంకటస్వామి, యాదగిరిస్వామి, మాధవి, వేణుగోపాల్, వాసాల సతీష్, ప్రతాప్ పాల్గొన్నారు.