Share News

Karimnagar : మోగింది బడిగంట

ABN , Publish Date - Jun 15 , 2026 | 01:51 AM

కరీంనగర్‌ టౌన్‌, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): వేసవి సెలవులు ముగిశాయి. సోమవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.

Karimnagar :  మోగింది బడిగంట

- నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం

- 19 వరకు ‘బడిబాట’

- పాఠ్య పుస్తకాలు, నోటుబుక్కుల పంపిణీకి ఏర్పాట్లు

కరీంనగర్‌ టౌన్‌, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): వేసవి సెలవులు ముగిశాయి. సోమవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఇన్నాళ్లు ఆటపాటలతో ఉత్సాహంగా గడిపిన విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4,.15 వరకు, ప్రీ ప్రైమరీ పాఠశాలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఉంటాయి. జిల్లాలో ఈయేడు కొత్తగా 58 ప్రీప్రైమరీ స్కూల్స్‌కు విద్యాశాఖ గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో జిల్లాలో ప్రీప్రైమరీ స్కూల్స్‌ సంఖ్య 70కి చేరింది.

ఫ మధ్యాహ్న భోజనంతోపాటు అల్పాహారం

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్నభోజనంతోపాటు ప్రతిరోజు ఉదయం పౌష్టికాహారంతో కూడిన అల్పాహారం ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని కొన్ని ఎంపిక చేసిన స్కూల్స్‌లో మాత్రమే సోమవారం నుంచి విద్యార్థులకు అల్పాహారం అందిస్తారు. జిల్లాలో మొదటి విడతలో ఒక్క పాఠశాలను కూడా ఎంపిక చేయలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు మే 14 నుంచి బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించి ఈనెల 19 నిర్వహించనున్నారు. ఒక్కో పాఠశాలలో గత ఏడాది కంటే కనీసం 10 శాతం అడ్మిషన్లు పెంచాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఉపాధ్యాయులు ఆ కార్యక్రమంలో నిమగ్నమయ్యారు.

ఫ నేడు వెల్‌కమింగ్‌ డే..

వేసవి సెలవుల తర్వాత పాఠశాలల పునఃప్రారంభ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి రోజు సోమవారం విద్యార్థులకు స్వాగతం చెబుతూ వెల్‌కమింగ్‌ డే.. స్కూల్‌ రెడీనెస్‌ డే నిర్వహిస్తారు. నెలరోజులుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే కార్యక్రమాలను చేపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఆదర్శ కమిటీలను ఏర్పాటు చేసి మిగిలిన ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఫర్నీచర్‌, మంచినీటి సౌకర్యం, విద్యుద్దీకరణ, భవనాల మరమ్మతులు, రంగులు వేసి నూతన హంగులతో భవనాలను తీర్చిదిద్దారు. పాఠ్య పుస్తకాలు, నోటుబుక్కులు ఇప్పటికే పాఠశాలలకు చేరాయి. వాటిని సోమవారం పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు యూనిఫామ్‌, షూ, ఇతర సామాగ్రి కిట్‌ పాఠశాలలకు చేరలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో మంగళవారం సామూహిక అక్షరాభాస్య కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈమేరకు విద్యాశాఖ అధికారులు మండల విద్యాధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు.

ఫ స్కావెంజర్ల సమస్య యధాతథం

పాఠశాలల్లోని మరుగుదొడ్లను శుభ్రం చేసే స్కావెంజర్లను తొలగించిన ప్రభుత్వం తిరిగి నియమించలేదు. దీంతో మరుగుదొడ్ల శుభ్రం చేసే సమస్య ఉపాధ్యాయులను వేధిస్తోంది. గతంలో మాదిరిగా మున్సిపల్‌, గ్రామపంచాయతీ కార్మికులతో శుభ్రం చేయిస్తారా లేక ఉపాధ్యాయులే సొంతడబ్బులతో శుభ్రం చేయించుకోవాలా తెలియని అయోమయస్థితి ఉంది.

Updated Date - Jun 15 , 2026 | 01:51 AM