Karimnagar: కొలువుదీరిన పాలకవర్గం...
ABN , Publish Date - Feb 17 , 2026 | 12:26 AM
కరీంనగర్ టౌన్, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): రెండురోజుల క్రితం జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపొందిన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం ప్రశాంతంగా జరిగింది.
- సజావుగా మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక
- పార్టీ కండువాలతో కార్పొరేటర్ల హాజరు
- బల్దియాలో రాజకీయ సందడి
కరీంనగర్ టౌన్, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): రెండురోజుల క్రితం జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపొందిన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం ప్రశాంతంగా జరిగింది. మున్సిపల్ సమావేశ మందిరంలో కమిషనర్ ప్రపుల్‌దేశాయ్ ఆధ్వర్యంలో 66వ డివిజన్లలో గెలుపొందిన 66 మంది కార్పొరేటర్లతో ఆథరైజ్డ్ ఆఫీసర్, ఆర్డీవో మహేశ్వర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఎన్నికల పరిశీలకులు జితేందర్‌రెడ్డి, మనోహర్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమానికి కలెక్టర్, కార్పొరేషన్ ప్రత్యేకాధికారి పమేలాసత్పతి హాజరయ్యారు. ఉదయం 11.30 నుంచి అక్షర క్రమంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్, ఎంఐఎం, ఇండిపెండెంట్, ఫార్వర్డ్‌బ్లాక్‌కు చెందిన సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు.అనంతరం నిర్వహించిన మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియకు కేంద్రహోంశాఖ సహాయమంత్రి, ఎంపీ బండి సంజయ్‌కుమార్ ఎక్స్ ఆఫీషియో సభ్యుడిగా హాజరై తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నుంచి మేయర్ అభ్యర్థిగా కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా యాదగిరి సునీల్‌రావుకు బీ-ఫారం అందించి పోటీలో ఉంచారు. కాంగ్రెస్ నుంచి మేయర్ అభ్యర్థిగా ఆకుల నర్మద, డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా హీనా ఆఫ్రీన్ బరిలో నిలిచారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు అక్షరమాల ఆర్డర్‌లో మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థుల ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు.
ఫ కాంగ్రెస్ మేయర్‌కు 21 ఓట్లు
కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిగా ఆకుల నర్మద పేరును వైద్యుల అంజన్‌కుమార్ ప్రతిపాదించగా గుమ్మడి రాజ్‌కుమార్ బలపరిచారు. ఓటింగ్‌లో కాంగ్రెస్ పార్టీకి చెందిన 14 మంది సభ్యులు, ముగ్గురు ఇండిపెండెంట్లు, ముగ్గురు ఎంఐఎం, ఒక ఫార్వర్డ్‌బ్లాక్ సభ్యుడు ఫ్లకార్డులతో నర్మదకు ఓటు వేస్తున్నట్లు ప్రకటించారు. మొత్తం 21 మంది నర్మదకు ఓటు వేశారు.
ఫ బీజేపీ మేయర్ అభ్యర్థికి 34 ఓట్లు
అనంతరం బీజేపీ మేయర్ అభ్యర్థి కొలగాని శ్రీనివాస్ పేరును మాసం గణేశ్ ప్రతిపాదించగా పెద్దపల్లి శ్రీలేఖ ఆయనను బలపరిచారు. శ్రీనివాస్‌కు 30 మంది బీజేపీ, ముగ్గురు ఇండిపెండెంట్లు ఓటు వేయగా, కేంద్రమంత్రి బండి సంజయ్ ఎక్స్ ఆఫీషియో సభ్యుడిగా ఓటు వేశారు. మొత్తం 34 ఓట్లు రావడంతో కొలగాని శ్రీనివాస్ గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు.
- డిప్యూటీ మేయర్ బీజేపీ అభ్యర్థి యాదగిరి సునీల్‌రావు పేరును సోమిడి వేణు ప్రతిపాదించగా బండారి వేణు బలపరిచారు. సునీల్‌రావుకు 30 మంది బీజేపీ, ముగ్గురు స్వతంత్రులు, ఎక్స్‌ఆఫీషియో సభ్యుడిగా కేంద్రమంత్రి బండి సంజయ్‌కుమార్ ఓటు వేశారు. కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా హీనా ఆఫ్రీన్ పేరును గంట శ్రీనివాస్ ప్రతిపాదించగా కల్లెపల్లి శారద బలపరిచారు. ఆఫ్రీన్‌కు 14 మంది కాంగ్రెస్ సభ్యులు, ముగ్గురు ఇండిపెండెంట్లు, ముగ్గురు ఎంఐఎం, ఇద్దరు ఫార్వర్డ్‌బ్లాక్ సభ్యులు ఓటు వేశారు. ఆమెకు మొత్తం 22 మంది సభ్యుల మద్దతు లభించింది. దీంతో బీజేపీ అభ్యర్థి యాదగిరి సునీల్‌రావు డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైనట్లు ప్రకటించారు.
ఫ హాజరు కాని ఎమ్మెల్యే గంగుల
కార్పొరేషన్‌లో ఎక్స్ ఆఫీషియో సభ్యులుగా ఉన్న కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హాజరుకాలేదు. మరో సభ్యుడు, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మున్సిపల్ కార్యాలయానికి వచ్చినప్పటికి ఎన్నికల ప్రక్రియలో పాల్గొని ఓటు వేయకుండానే వెళ్లిపోయారు. బీఆర్‌ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన తొమ్మిది మంది కార్పొరేటర్లు ప్రమాణస్వీకారం చేసి, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలో ఓటు వేయకుండా తటస్తంగా ఉండి వెళ్లిపోయారు.
ఫ మేయర్, డిప్యూటీ మేయర్ల ప్రమాణ స్వీకారం
మేయర్‌గా ఎన్నికైన కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన యాదగిరి సునీల్‌రావుతో ఆర్డీవో మహే శ్ ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం మేయర్ కొలగాని శ్రీనివాస్ కౌన్సిల్ హాల్‌లో యాఫ్రాన్ ధరించి మేయర్ కుర్చీలో కూర్చున్నారు. మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్‌రావుకు కేంద్రమంతి బండి సంజయ్‌కుమార్ శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. అధికారులు, కార్పొరేటర్లు వారిని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
ఫ పార్టీ కండువాలతో హాజరైన కార్పొరేటర్లు :
బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం, ఆల్ ఇండియా ఫార్వర్డ్‌బ్లాక్ కార్పొరేటర్లు వారి పార్టీ కండువాలను ధరించి జట్లుజట్లుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. ముందుగా ఉదయం 11 గంటల ప్రాంతంలో కేంద్రమంత్రి బండి సంజయ్‌కుమార్ నేతృత్వంలో 30 మంది బీజేపీ కార్పొరేటర్లు కాషాయపు కండువాలను ధరించి నినాదాలు చేస్తూ ప్రత్యేక వాహనంలో మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. వారితోపాటు ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన కార్పొరేటర్లు కౌన్సిల్ హాల్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత 14 మంది కాంగ్రెస్ కార్పొరేటర్లు, ముగ్గురు ఇండిపెండెంట్లను వెంట బెట్టుకొని ప్రైవేట్ బస్సులో చేరుకున్నారు. ముగ్గురు ఎంఐఎం కార్పొరేటర్లు, ఇద్దరు ఫార్వర్డ్‌బ్లాక్ కార్పొరేటర్లు ఆయా పార్టీల కండువాలను ధరించి కార్యాలయానికి నినాదాలు చేసుకుంటూ వచ్చారు. చివరగా బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ బీఆర్‌ఎస్ నుంచి గెలుపొందిన తొమ్మిది కార్పొరేటర్లతోనినాదాలు చేస్తూ కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో వివిధ పార్టీల కండువాలతో బల్దియా కలర్‌ఫుల్‌గానే కనిపించింది. చాలా రోజుల తర్వాత నగరపాలక సంస్థలో రాజకీయ సందడి కనిపించింది.