Karimnagar : పంతం నీదా నాదా సై..
ABN , Publish Date - Apr 20 , 2026 | 01:19 AM
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్) ఉత్తర తెలంగాణ రాజకీయ కేంద్రమైన ఉమ్మడి జిల్లాలో మండే ఎండలను మించిన రాజకీయ వేడి రగిలింది. తమ రాజకీయాలకు మరోసారి ఈ జిల్లాను వేదికగా చేసుకొని కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాలను అమలు చేస్తున్నాయి.
- అటు ముఖ్యమంత్రి... ఇటు మాజీ ముఖ్యమంత్రి
- ఉమ్మడి జిల్లాలో రాజుకున్న రాజకీయవేడి
- జగిత్యాలలో బీఆర్‌ఎస్ బహిరంగ సభ.. కేసీఆర్ రాక
- నస్తుర్‌పల్లి సభకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
- పోటాపోటీగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ సభలు
- ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రజలు
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
ఉత్తర తెలంగాణ రాజకీయ కేంద్రమైన ఉమ్మడి జిల్లాలో మండే ఎండలను మించిన రాజకీయ వేడి రగిలింది. తమ రాజకీయాలకు మరోసారి ఈ జిల్లాను వేదికగా చేసుకొని కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాలను అమలు చేస్తున్నాయి. మాజీ మంత్రి జీవన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరుతున్న సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించి పూర్వవైభవాన్ని తిరిగి పొందాలని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సోమవారం జగిత్యాలలో పర్యటించనున్నారు. బీఆర్‌ఎస్ రాజకీయాలకు చెక్‌పెట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి కాటారం మండలంలో బహిరంగ సభలో పాల్గొననున్నారు. అటు ముఖ్యమంత్రి, ఇటు మాజీ ముఖ్యమంత్రి ఎత్తుకుపైఎత్తులు వేస్తూ స్వయంగా ప్రత్యేక కార్యాచరణతో ఉమ్మడి జిల్లా కేంద్రంగా పావులను కదుపుతుండడంతో రాజకీయాలు ఎండలను మించి వేడెక్కిపోయాయి. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ కాలంలో, టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర రాజకీయాల్లో పలు కీలక సందర్భాల్లో కరీంనగర్ వేదికగా మారింది. ప్రస్తుత రాజకీయాలతో రసవత్తరంగా మారి రాష్ట్రవ్యాప్తంగా పతాకచర్చలకు ఎక్కింది.
ఫ బీఆర్‌ఎస్‌లో జోష్ తెచ్చేందుకు..
ఒకప్పుడు ఈ జిల్లాలో వెలుగువెలిగిన బీఆర్‌ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు స్థానాలకు పరిమితమైపోయింది. అందులో ఒకరు కాంగ్రెస్‌లో చేరడంతో జగిత్యాలలో రాజుకున్న విబేధాలు జీవన్‌రెడ్డిని రాజీనామాకు పురికొల్పి ఆయన బీఆర్‌ఎస్‌లో చేరేందుకు దారితీశాయి. కాంగ్రెస్ అధికారం చేపట్టిన రెండున్నర సంవత్సరాలలో జరిగిన గ్రామపంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ అనుకున్న విజయాలను సాధించలేక చతికిలపడిపోయింది. జీవన్‌రెడ్డి చేరిక సందర్భాన్ని వినియోగించుకొని ఉమ్మడి జిల్లా రాజకీయాలతోపాటు రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనం సృష్టించాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పొందిన తర్వాత కేసీఆర్ ప్రజలకు దూరంగా ఉడడంతో బీఆర్‌ఎస్ పెద్దగా ఫలితాలు సాధించలేక పోయిందని, ఆయన మళ్లీ ప్రజల్లోకి వస్తే బీఆర్‌ఎస్ తిరిగి ఉపిరి పోసుకునే అవకాశముంటుందని ఆ పార్టీ నేతలే పలు సందర్భాల్లో బహిరంగంగానే వాఖ్యానించారు. ఆ ఆలోచనలకు అనుగుణంగానే కేసీఆర్ మరోసారి ప్రజల్లోకి రావాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. సమయం కోసం వేచిచూస్తున్న ఆయన జీవన్‌రెడ్డి పార్టీలో చేరడాన్ని సరైన సమయంగా భావించి జగిత్యాలలో ప్రజా ఆశీర్వాద సభ పేరిట బహిరంగ సభను నిర్వహించాలని స్వయంగా కార్యాచరణను రూపొందించి కేటీఆర్, హరీష్‌రావులతో ఆచరణలో పెట్టిస్తున్నారని తెలిసింది. తొలుత సింహగర్జన సభలాగా భారీ జనసమీకరణతో సభను నిర్వహించాలని ఆ పార్టీ నాయకత్వం భావించినా చివరకు జగిత్యాల జిల్లాకు పరిమితం చేసి జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి నియోజకవర్గాలలోని ప్రజలను వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాల్లో ఉన్న జగిత్యాల జిల్లాకు చెందిన మండలాల ప్రజలను జగిత్యాల సభకు హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. అయిదు నియోజకవర్గాలకు చెందిన ఓటర్లు ఈ సభకు పెద్ద ఎత్తున హాజరయ్యేలా చూసి ఆయా నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ రాజకీయాల్లో ఒక ఊపును తీసుకురావాలని భావిస్తున్నారని సమాచారం. ఈ నియోజకవర్గాల పరిధిలో కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గం ఇప్పటికే బీఆర్‌ఎస్ ప్రాతినిధ్యంలో ఉండగా జగిత్యాల గెలిచి పార్టీ చేజారి పోయింది. జీవన్‌రెడ్డి చేరికతో జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల, చొప్పదండి, వేములవాడ నియోజకవర్గాల్లో పరిస్థితి మెరుగుపరుచుకోవచ్చని, ఆయన ద్వారా రెడ్డీ సామాజికవర్గాన్ని కూడా ఆకర్షించవచ్చని బీఆర్‌ఎస్ భావిస్తోంది. ఆయన చేరికకు అత్యంత ప్రాధాన్యమిస్తూ స్వయంగా కేసీఆర్ ఆయనను ఆహ్వానించడానికి బహిరంగ సభలో పాల్గొంటున్నారు. జీవన్‌రెడ్డిని బీఆర్‌ఎస్ సెక్రెటరీ జనరల్‌గా ప్రకటించి సముచిత ప్రాధాన్యంతో రాష్ట్రస్థాయిలో ఆయన సేవలను వినియోగించుకోవాలని ఆపార్టీ అధిష్ఠానం భావిస్తోంది. ఉమ్మడి జిల్లా రాజకీయాలను తిరిగి తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని బీఆర్‌ఎస్ అధినేత వ్యూహాత్మకంగా ఈ సందర్భాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారని విశ్లేషకులు అంటున్నారు.
ఫ కాళేశ్వరం వైపు.. కాంగ్రెస్ చూపు..
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జగిత్యాల సభ ద్వారా మళ్లీ ప్రజల్లోకి రావాలని నిర్ణయించుకున్న ముహూర్తానికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉమ్మడి జిల్లాలో బహిరంగ సభలో పాల్గొననుండడం రాజకీయంగా ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. బీఆర్‌ఎస్ పాలకుల అవినీతి కారణంగానే లక్ష కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీకి గండిపడి నిరుపయోగంగా మారిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇప్పుడు దాని మరమ్మతులు, ఇతర చర్యలపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి కాటారం మండలంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననన్నారు. ఈ బహిరంగ సభలో రెండో విడత రైతుభరోసా సహాయాన్ని ముఖ్యమంత్రి విడుదల చేస్తారని, 45,11,947 మంది రైతుల ఖాతాల్లో 2,063 కోట్లు సోమవారం జమకానున్నాయని కాంగ్రెస్ పార్టీ చెబుతున్నది. బహిరంగ సభలో ప్రధాన ఎజెండా అంశం రైతు భరోసా అని కాంగ్రెస్ నేతలు చెబుతున్నా జగిత్యాల సభ ద్వారా బీఆర్‌ఎస్ లబ్ధి పొందాలనే ఆలోచనకు గండి కొట్టడమేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. బీఆర్‌ఎస్‌లో చేరుతున్న జీవన్‌రెడ్డిని కేంద్రంగా చేసుకొని కేసీఆర్ కాంగ్రెస్ శ్రేణులను ఆకర్షించే ప్రయత్నం చేస్తారని, ఆయన ఆలోచనలు ఫలించకుండా చేయడానికి రేవంత్‌రెడ్డి కాళేశ్వరం సందర్శన, ఆ తర్వాత బహిరంగ సభ నిర్వహిస్తున్నారని భావిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని మరోసారి ఎండగట్టి బీఆర్‌ఎస్‌ను, ఆ పార్టీ అగ్రనేతలను దోషులుగా ప్రజల ముందు నిలపడానికి ఈ బహిరంగ సభను ముఖ్యమంత్రి ఉపయోగించుకునే అవకాశం ఉంది. జీవన్‌రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిన అవకాశాలు, ఇచ్చిన ప్రాధాన్యాన్ని ప్రజల ముందుంచి ఆయన పార్టీ మారిన తీరును ఎండగట్టడానికి, జగిత్యాల సభ ద్వారా రాజకీయ లబ్దిపొందాలనే ఆలోచనకు బ్రేక్ వేయడానికే ఆయన ఈ రాజకీయ ఎత్తుగడను వేశారని ఉమ్మడి జిల్లా ప్రజలు అనుకుంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, రైతుల సంక్షేమ కోసం చేపడుతున్న కార్యక్రమాలు ఇతర అంశాలను ప్రజల ముందుంచి కాంగ్రెస్ గ్రాఫ్‌ను మరింత పెంచేందుకు ముఖ్యమంత్రి ఈ సభను వేదికగా చేసుకోనున్నారని అనుకుంటున్నారు. జగిత్యాల సభకు ధీటుగా మంథని, భూపాలపల్లి నియోజకవర్గాలోని మండలాల నుంచి ఈ సభకు జనాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి ల్లా కేంద్రంగా ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి రెండు వేర్వేరు బహిరంగ సభలను నిర్వహించడం ద్వారా ఏ పార్టీకి ప్రయోజనం చేకూరుతుందో, ఎవరిది పై చేయి అవుతుందోనని రాజకీయవర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.