Share News

Karimnagar: పదో తరగతి పరీక్షలు ప్రారంభం

ABN , Publish Date - Mar 14 , 2026 | 11:55 PM

కరీంనగర్‌ టౌన్‌, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి.

Karimnagar:   పదో తరగతి పరీక్షలు ప్రారంభం

- మొదటి రోజు 13,122 మంది విద్యార్థులు హాజరు

- 9 గంటల నుంచి కేంద్రాల్లోకి అనుమతి

- 36 పరీక్షా కేంద్రాలను తనిఖీచేసిన అధికారులు

కరీంనగర్‌ టౌన్‌, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. శనివారం మొదటి రోజు జరిగిన తెలుగు పరీక్షకు 15 మంది విద్యార్థులు గైర్హాజరు కాగా 13,122 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. పరీక్షలకు జిల్లా అధికారయంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేయడంతో ఎక్కడా కాపీయింగ్‌, ఇతర అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. విద్యార్థులు పరీక్షా సమయానికి గంట ముందు నుంచే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు పరీక్షలు జరుగగా, 9 గంటల నుంచే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. ఐదు నిమిషాల వరకు ఇవ్వడంతో చివరి నిమిషం వరకు వచ్చిన విద్యార్థులను పరీక్షకు అనుమతించారు. జిల్లావ్యాప్తంగా 73 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున పరీక్షా కేంద్రంలో వైద్య ఆర్యోగ సిబ్బందిని అందుబాటులో ఉంచారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను అమలు చేయడంతోపాటు సమీపంలోని జిరాక్సు సెంటర్లను పరీక్ష పూర్తయ్యే వరకు బంద్‌ చేయించారు. అధికారులు 36 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు.

ఫ విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా పరీక్షలు నిర్వహించాలి

విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు), ఇన్‌చార్జి డీఈవో అశ్విని తానాజీ వాఖడే అధికారులకు సూచించారు. శనివారం పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కాగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (ఓల్డ్‌), ప్రభుత్వ ఉన్నత పాఠశాల (ధన్గర్‌వాడీ) పరీక్షా కేంద్రాలను అదనపు కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన మంచినీరు, ప్రథమ చికిత్స మందులు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, తరగతి గదిలో వెంటిలేషన్‌ ఉండేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. పరీక్షా సమయంలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మున్సిపల్‌ కమిషనర్‌ ప్రపుల్‌దేశాయ్‌ ఎస్‌ఆర్‌ డిజి స్కూల్‌ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు.

Updated Date - Mar 14 , 2026 | 11:55 PM