Karimnagar: బాలల రక్షణలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం
ABN , Publish Date - Aug 01 , 2026 | 11:41 PM
కరీంనగర్ క్రైం, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): పాఠశాల స్థాయిలో బాలల హక్కుల పరిరక్షణ, వారి భద్రత, సంక్షేమాన్ని నిర్ధారించడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమైనదని
- జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శివకుమార్
కరీంనగర్ క్రైం, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): పాఠశాల స్థాయిలో బాలల హక్కుల పరిరక్షణ, వారి భద్రత, సంక్షేమాన్ని నిర్ధారించడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమైనదని కరీంనగర్ జిల్లా ప్రధాన, సెషన్స్ న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్ ఎస్ శివకుమార్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ(హైదరాబాద్) ఆదేశాల మేరకు మిషన్ బాల సురక్ష, శిక్షా, న్యాయ-2026 కార్యక్రమంలో భాగంగా జిల్లా కోర్టు ఆవరణలోని ‘న్యాయ సేవా సదన్’లో పాఠశాలల చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులుగా నియామక మైన ఉపాధ్యాయులకు ఒకరోజు ప్రత్యేక అవగాహన(సెన్సిటైజేషన్) శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శివకుమార్ జ్యోతిప్రజ్వలన చేసి శిక్షణ ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులకు నిరంతరం అందుబాటులో ఉండే ఉపాధ్యాయులు, పిల్లల్లో వచ్చే మార్పులను, వారు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించగలరని అన్నారు. బాలలపై వేధింపులు, లైంగిక దాడులు (పోక్సో చట్టం), బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ వంటి సామాజిక అన్యాయా ల నివారణకు ఉపాధ్యాయులు చట్టపరమైన అవగాహన కలిగి ఉండాలన్నారు. పాఠశాలల్లో భయరహిత, సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఇన్‌చార్జి కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కే.రాణి ఆధ్వర్యంలో, జిల్లా విద్యాశాఖ సమన్వయంతో జరిగిన ఈ శిక్షణలో వివిధ రకాల చట్టాలపై న్యాయమూర్తులు, నిపుణులు సమగ్ర అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మొదటి అద నపు జిల్లా, సెషన్స్ న్యాయమూర్తి డి వెంకటేష్, ఏసీబీ కోర్టు న్యాయమూర్తి నామ సంతోష్ కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు గడ్డం లక్ష్మణ్, రిసోర్స్ పర్సన్‌లు, డిప్యూటీ, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ కే ప్రసాద్, రఫీ, గాలిపల్లి నాగేశ్వర్, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి హాజరైన చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు (ఉపాధ్యాయులు), న్యాయాధికారులు, న్యాయవాదులు, పారా లీగల్ వలంటీర్లు పాల్గొన్నారు.