Share News

Karimnagar: నిఘా కళ్లు చూస్తున్నాయ్‌.. జాగ్రత్త

ABN , Publish Date - Jan 09 , 2026 | 11:10 PM

ఎవరూ చూడడం లేదు.. అంత దూరం వెళ్లి తిప్పుకుని రావాలా.. రాంగ్‌రూట్‌లో వెళ్లిపోదాం అనుకుంటున్నారా.. నిఘా కళ్లు చూస్తున్నాయ్‌.. జాగ్రత్త..

 Karimnagar:   నిఘా కళ్లు చూస్తున్నాయ్‌.. జాగ్రత్త

- ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై పోలీసుల కొరడా

- ఏడాదిలో 1,93,780 కేసులు నమోదు

- 70 శాతం జరిమానాలు ట్రిపుల్‌ రైడ్‌, హెల్మెట్‌ ఉల్లంఘనలపైనే..

- రోజుకు సరాసరి 530 కేసులు

ఎవరూ చూడడం లేదు.. అంత దూరం వెళ్లి తిప్పుకుని రావాలా.. రాంగ్‌రూట్‌లో వెళ్లిపోదాం అనుకుంటున్నారా.. నిఘా కళ్లు చూస్తున్నాయ్‌.. జాగ్రత్త.. నగరవ్యాప్తంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు మిమ్మల్ని పట్టేస్తాయి.. ఏ చిన్న ట్రాఫిక్‌ ఉల్లంఘన జరిగినా క్లిక్‌మనిపించి కమాండ్‌ కంట్రోల్‌కు పంపిస్తాయి.. వెంటనే ఫోన్‌కు చలాన్‌ సందేశం వస్తుంది.. ఇలా గత ఏడాది కరీంనగర్‌లోనే 1,93,780 ట్రాఫిక్‌ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. వీటిలో ఎక్కువగా టిపుల్‌ రైడ్‌, హెల్మెట్‌ ధరించనివే ఎక్కువగా ఉన్నాయి. రోజుకు సరాసరి 530 కేసుల నమోదయ్యాయి. రోడ్డు ప్రమాదాల నివారణకు, ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు ఈ చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు అంటున్నారు. వాహనదారులారా.. నిబంధనలు పాటించి క్షేమంగా గమ్యం చేరండి.. చలాన్ల బారిన పడకుండా ఉండండి..

- ఆంధ్రజ్యోతి, కరీంనగర్‌ క్రైం

కరీంనగర్‌లో వాహనదారుల ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనలు రోజుకు 530 దాటిపోతున్నాయి. ఉల్లంఘనలకు సంబంధించిన చలాన్లు వాహనదారుడి సెల్‌ఫోన్లకు మెస్సేజ్‌ రూపంలో పంపిస్తున్నప్పటికీ కొందరు పట్టించుకోకుండా మళ్లీ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని ట్రాఫిక్‌ పోలీసులు అంటున్నారు. వాహనదారులను కట్టడి చేసేందుకు ట్రాఫిక్‌ పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి పెండింగ్‌ చలాన్లు అప్పటికప్పుడు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నారు.

ఫ రోడ్డు ప్రమాదాల నియంత్రణ, ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ

రోడ్డు ప్రమాదాల నియంత్రణ, ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణపై కరీంనగర్‌ పోలీసులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై కొరడా ఝలిపిస్తున్నారు. కరీంనగరమంతటా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఆధారంగా ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వాహనదారులపై చర్యలు తీసుకుంటున్నారు. స్మార్ట్‌సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన 769 సీసీటీవీ కెమెరాలు 2025 జూన్‌ 27 నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఈ కెమెరాల ద్వారా ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనలను కమాండ్‌ కంట్రోల్‌ రూం ద్వారా పర్యవేక్షిస్తూ చలాన్లు జారీ చేస్తున్నారు. కరీంనగర్‌లో నాలుగు చోట్ల ట్రాఫిక్‌ సిగ్నల్‌ వ్యవస్థను ప్రారంభించారు. కొన్ని రోజులపాటు ఉల్లంఘనలపై ఎలాంటి జరిమానాలు విధించకపోవడంతో చాలా మంది వాహనదారులు ఇంకా అలాగే నడుస్తుందనే భావనలో నిర్లక్ష్యంగా నడుపుతూ జరిమానాల బారిన పడుతున్నారు. ఎనిమిది నెలలుగా వాహనదారుల సెల్‌ఫోన్‌లకు జరిమానా చలాన్ల సందేశాలు వస్తుండడంతో కంగుతింటున్నారు.

2025 జనవరి నుంచి డిసెంబరు 31 వరకు 1,93,780 వాహనదారులు వివిధ రకాల ఉల్లంఘనలకు పాల్పడగా వారందరికి చలాన్లు పంపించారు. ఇందులో ట్రిపుల్‌ రైడింగ్‌ జరిమానాలు 68,484, హెల్మెట్‌ ధరించని వారు 59,426 ఉండడం గమనార్హం. 70 శాతానికిపైగా ట్రిపుల్‌ రైడింగ్‌, హెల్మెట్‌ ఉల్లంఘనలే ఉన్నాయి. సీసీ కెమెరాల ద్వారా పోలీసులు జరిమానాలు విధిస్తున్నట్లు తెలిసినా వాహనదారులు నిర్లక్ష్యం చేస్తున్నారా? లేక జరిమానాలు ఇంకా ప్రారంభం కాలదని భావిస్తున్నారా? అనేది తెలియడంలేదు.

ఫ నాలుగు కూడళ్లలో ఆటోమేటెడ్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ సిస్టమ్‌

నగరంలోని నాలుగు కూడళ్ళలో ఆటోమేటెడ్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేశారు. ఈ నాలుగు సిగ్నల్స్‌ వద్ద కెమెరాలతోపాటుగా మిగతా అన్ని నగరరోడ్లపై ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించి కమాండ్‌ కంట్రోల్‌రూంకు ఫొటోలతో సహా సందేశాలను పంపిస్తున్నాయి. వీటి ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేసి కోట్ల రూపాయల జరిమానాలు విధిస్తూ సంబంధిత వాహనదారులకు చలాన్లు పంపించారు. సరాసరి రోజుకు 530 వాహనాలు ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించినట్లుగా గుర్తించగా, రోజుకు లక్షల రూపాయలు జరిమానా రూపంలో వాహనదారుల జేబులు ఖాళీ అవుతున్నాయి. ఇకనైనా వాహనదారులు రోడ్డుపై డ్రైవింగ్‌ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుని ట్రాఫిక్‌ నియమ నిబంధనలు పాటించాలి.

ఫ ట్రాఫిక్‌ ఉల్లంఘనల వివరాలు

ఫ 2025 జనవరి నుంచి డిసెంబరు 31 వరకు కరీంనగర్‌లో 1,93,780 మంది ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించారు. ఇందులో ట్రిపుల్‌ రైడింగ్‌ 68,484, హెల్మెట్‌ ధరంచనివి 59426, రాంగ్‌సైడ్‌ డ్రైవింగ్‌ 36,211, సెల్‌ ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ 6,662, ఆన్‌ రోడ్‌ పార్కింగ్‌ 16,607, డ్రంకెన్‌ డ్రైవ్‌ 3,242, నంబర్‌ప్లేట్‌ లేకుండా డ్రైవింగ్‌ 3,148 కేసులు నమోదయ్యాయి.

ఫ మూడు చలాన్లు దాటితే..

ఏ వాహనంపైనైనా మూడుకుపైగా చలాన్లు ఉంటే పోలీసులు తనిఖీల్లో పట్టుకుని పూర్తిగా చెల్లిస్తేనే వదిలిపెడుతున్నారు. ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడుతూ చలాన్ల నుంచి తప్పించుకునేందుకు వాహనాలకు నంబర్‌ప్లేట్లు బిగించకపోవడం, నంబర్లపై స్టిక్కర్లు అతికించడం, నంబర్‌ప్లేట్లను వంకరగా మలచడం వంటివి చేస్తున్నట్లు ట్రాఫిక్‌ పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో ప్రతి రోజు నగరంలో ఎక్కడో ఒక చోట అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించి ఇటువంటి ఉల్లంఘనలపై చర్యలు తీసుకుంటున్నారు. సరైన విధంగా వాహనానికి ముందు, వెనుక భాగాల్లో నంబర్‌ప్లేట్లను బిగించిన తరువాతనే విడుదల చేస్తున్నారు.

ఫ నగర ప్రజల భద్రతే లక్ష్యం

-కరీముల్లాఖాన్‌, కరీంనగర్‌ ట్రాఫిక్‌ సీఐ

జరిమానాల కోసం కాకుండా, ప్రతి ఒక్కరూ క్షేమంగా ఇంటికి చేరాలనే ఉద్దేశంతో ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరిస్తున్నాం. నగరంలో వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలి. అతివేగం, రాంగ్‌సైడ్‌ డ్రైవింగ్‌ మానుకోవాలి. ముఖ్యంగా యువత ట్రిపుల్‌ రైడింగ్‌కు దూరంగా ఉండాలి. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే సీసీ కెమెరాల ద్వారా నేరుగా చలాన్లు ఫోక్‌కు వస్తాయి. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి పోలీసులకు సహకరించాలి. నగరంలోని వివిధ కూడళ్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా ఆన్‌లైన్‌ పద్ధతిలో చలాన్లు నమోదు అవుతున్నాయి.

Updated Date - Jan 09 , 2026 | 11:10 PM