karimnagar : సన్‌డే
ABN , Publish Date - May 18 , 2026 | 01:26 AM
కరీంనగర్ టౌన్, మే 17 (ఆంధ్రజ్యోతి): ఇవేమి ఎండలు బాబోయ్ భరించలేక పోతున్నామంటూ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
- దంచికొడుతున్న ఎండలు
- మరింత పెరిగే అవకాశాలు
కరీంనగర్ టౌన్, మే 17 (ఆంధ్రజ్యోతి): ఇవేమి ఎండలు బాబోయ్ భరించలేక పోతున్నామంటూ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈసారి మార్చి రెంయు భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండగా, మే మాసంలో మరింత పెరిగి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈనెల 25న రోహిణి కార్తె ప్రారంభమవుతుండగా 15 రోజుల నుంచే 40 డిగ్రీలకుపైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భరించలేని వేడిమితోనే తెల్లవారుతోంది. ఇక 10 గంటల నుంచే ఎండల తీవ్రత మరింత పెరిగి రాత్రి 7 గంటల వరకు కూడా వేడిమి తగ్గడం లేదు. ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తప్పనిసరి అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని, వేడిమి, వడగాల్పులతో ప్రాణాలకు ముప్పు ఉంటుందని డాక్టర్లు, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ఫ గంగాధర మండలంలో అత్యధిక ఉష్ణోగ్రతలు
గంగాధర మండలం బూరుగుపల్లిలో ఆదివారం అత్యధికంగా 42.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కొత్తపల్లి మండలం ఆసిఫ్‌నగర్, గంగాధర మండల కేంద్రం, చొప్పదండి మండలం ఆర్నకొండ, మానకొండూరు మండలం ఈదురుగట్టెపల్లిలో 42.2, రామడుగు మండలం గుండి, జమ్మికుంట మండలం కొత్తపల్లి-ధర్మారం 42.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో జనం ఇంట్లో ఉండలేక, బయటకు వెళ్లలేక వేడిమి నుంచి తట్టుకునేందుకు నానా యాతన పడుతున్నారు. ఫ్యాన్లు, కూలర్లు పనిచేయడం లేదని, కొద్ది సేపటి తర్వాత ఫ్యాన్లు, కూలర్ల నుంచి వేడిగాలులు వస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. ఏసీలు కూడా కొద్దిసేపు ఆఫ్ చేస్తే ఉండలేని పరిస్థితి ఉంది. ఏప్రిల్ 30 నుంచి ఎలినోనా ప్రభావం తీవ్రంగా ఉంటుందని, ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైన నమోదవుతాయని, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ వేత్తలు హెచ్చరించారు.
ఫ ఎండల ప్రభావంతో తగ్గిన వ్యాపారాలు
ఎండల ప్రభావంతో వ్యాపారాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు భరించరాని వేడి ఉండడంతో ఆ తర్వాతనే ప్రజలు రోడ్లపైకి వస్తున్నారని, ఉదయం 9 గంటలకు దుకాణాలను తెరిస్తే రాత్రి 2, 3 గంటలు మాత్రమే వ్యాపారాలు సాగుతున్నాయని వ్యాపారులు వాపోతున్నారు. మిగతా సమయంలో గిరాకీలు ఉండడం లేదని అంటున్నారు. కొందరు మధ్యాహ్న వేళల్లో దుకాణాలు మూసివేసి సాయంత్రం ఓపెన్ చేస్తున్నారు. దినసరికూలీలు, కార్మికులు, హమాలీలు, ఆటోడ్రైవర్లు పనులు దొరకడం లేదని, పూటగడవడమే కష్టంగా మారుతోందని వాపోతున్నారు. పక్షులు, జంతువులు, మూగజీవాలువిలవిలలాడుతున్నాయి. ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో ఉపశమనం కోసం బయటకు వచ్చే వారు కొబ్బరి నీళ్లు, చెరకు రసాలు, పండ్ల రసాలు, మజ్జిగ, లస్సీ, కూల్ డ్రింక్స్ వంటి శీతలపానీయాలను తీసుకుంటున్నారు. ఎండల తీవ్రతను తట్టుకునేందుకు తలకు హెల్మెట్లు, టవల్స్, టోపీలు ధరించడం, మహిళలు, బాలికలు చున్నీలు చుట్టుకుంటున్నారు. ప్రతియేడాది మే చివరివారంలో వచ్చే నైరుతి రుతుపవనాలు ఈసారి మరింత ఆలస్యమవుతాయని, ఎండల తీవ్రత కూడా అధికంగానే ఉంటుందని, మరో నెలరోజులపాటు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ వేత్తలు, డాక్టర్లు సూచిస్తున్నారు.