Share News

karimnagar : నిబంధనలకు విరుద్ధంగా ‘సుడా’ టెండర్లు

ABN , Publish Date - Jan 05 , 2026 | 01:45 AM

కరీంనగర్‌ టౌన, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): శాతవాహన అర్బన డెవలప్‌మెంట్‌ అథారిటీ (సుడా) నిధులతో చేపట్టనున్న పనులకు ఇటీవల నిర్వహించిన టెండర్లలో గోల్‌మాల్‌ జరిగిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

karimnagar :  నిబంధనలకు విరుద్ధంగా ‘సుడా’ టెండర్లు

- కాంట్రాక్టర్లతో ఇంజనీరింగ్‌ అధికారుల మిలాఖత !

- ఈఎండీ లేకుండా పనుల అప్పగింత

కరీంనగర్‌ టౌన, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): శాతవాహన అర్బన డెవలప్‌మెంట్‌ అథారిటీ (సుడా) నిధులతో చేపట్టనున్న పనులకు ఇటీవల నిర్వహించిన టెండర్లలో గోల్‌మాల్‌ జరిగిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నవంబరు 15న 5.63 కోట్ల అంచనా విలువలతో 57 అభివృద్ధి పనులకు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్‌ అధికారులు ఈ1/డిబి/ఎంసికె/8201/241/25-26/15.11.2025 టెండర్లు పిలిచారు. అదేనెల 27 వరకు టెండర్ల స్వీకరణకు గడువు విధించారు. ఆయా పనులను చేజిక్కించుకునేందుకు కాంట్రాక్టర్లు పోటీపడ్డారు. నిబంధనల మేరకు సీటీఎనలోని మొత్తం పనుల్లో 15 శాతం ఎస్సీ, ఆరు శాతం ఎస్టీలకు, మూడు శాతం పనులను ఒడ్డెర సంఘాల కాంట్రాక్టర్లకు రిజర్వ్‌ చేశారు. మిగిలిన పనులను జనరల్‌ కేటగిరీలో చేర్చి బిడ్స్‌ను ఆహ్వానించారు.

ఫ జనరల్‌ కేటగిరీలో సిండికేట్‌

జనరల్‌ కేటగిరీలోని కొన్ని పనులకు టెండర్లు వేసిన కాంట్రాక్టర్లు సిండికేట్‌ అయి పగిడీలు, పనులను పంచుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. మరికొన్ని పనులకు పోటీపడడంతో నిబంధనల మేరకు అంచనా రేట్ల కంటే తక్కువతో కోట్‌ చేసిన కాంట్రాక్టర్‌కు ఎల్‌వో ఇచ్చారు.

ఫ తక్కువ లెస్‌తో కోట్‌ చేసిన కాంట్రాక్టర్లకు వర్క్‌ ఆర్డర్లు

సీటీఎనలో తొమ్మిది పనులను ఎస్సీ కేటగిరీలకు రిజర్వు చేయగా ఎనిమిది పనులకు సంబంధించిన బిడ్స్‌ను ఓపెన చేసి వర్క్‌ఆర్డర్‌ ఇచ్చారు. మరో పనికి సంబంధించిన బిడ్‌లో నలుగురు కాంట్రాక్టర్లు పాల్గొనగా ముగ్గురి బిడ్స్‌ను మాత్రమే ఓపెన చేసి ఒకరిది పక్కన బెట్టారు. ఆయన వేసిన బిడ్‌ను కనీసం ఓపెన చేయకుండానే మిగిలిన ముగ్గురిలో 13.1శాతం లెస్‌తో వేసిన కాంట్రాక్టర్‌కు ఎల్‌వో ఇచ్చారు. బిడ్‌ ఓపెన చేయని కాంట్రాక్టర్‌ 50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేయాల్సిన రోడ్డు పనులకు 31 శాతం అంచనా రేట్ల కంటే లెస్‌తో పని చేసేందుకు బిడ్‌ వేశారు. ఈ కాంట్రాక్టర్‌కు పని అప్పగిస్తే దాదాపు 18 శాతం అంటే ఏడు లక్షల రూపాయల మేరకు ప్రజాధనం ఆదా అయ్యేది. అలా కాకుండా 13.1 శాతం లెస్‌తో వేసిన వారికి పనులు అప్పగించి ఇంజనీరింగ్‌ అధికారి కాంట్రాక్టర్‌తో కుమ్మక్కై నిబంధనలకు తిలోదకాలిచ్చారనే విమర్శలు వస్తునావి.

ఫ నిబంధనలకు నీళ్లు

సీటీఎనలో మూడు పనులను ఎస్టీలకు రిజర్వు చేశారు. ఎస్టీ రిజర్వుడ్‌ కాంట్రాక్టర్లు నిబంధనల మేరకు ఒక పనికి ఈఎండీ లేకుండా బిడ్‌ వేసే అవకాశముంటుంది. ఒకటి కంటే ఎక్కువ పనుల్లో పాల్గొనాలనే వారు మాత్రం ఈఎండీతో బిడ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. ఇక్కడ మొత్తం మూడు పనులను ఈఎండీ లేకుండా టెండర్లలో పాల్గొన్న కాంట్రాక్టర్‌కు ఎల్‌వో ఇచ్చి నిబంధనలను తుంగలో తొక్కినట్లు చెబుతున్నారు.

ఫ నగర పాలక సంస్థ టెండర్లలోనూ..

సుడా టెండర్లలోనే కాకుండా నగరపాలక సంస్థ టెండర్లలోనూ ఇంజనీరింగ్‌ అధికారులు వారికి నచ్చిన కాంట్రాక్టర్లతో మిలాఖత అయి నిబంధనలను పాటించకుండా బల్దియా, సుడా నిధులను దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండు, మూడు రోజుల క్రితమే ఇందుకు సంబంధించిన ఎల్‌వోలు జారీ చేశారని, టెండర్లు ఖరారు చేయడంలోనూ జాప్యం జరిగిందని చర్చించుకుంటున్నారు. నగరపాలక సంస్థ ఇంజనీరింగ్‌ అధికారులు నిర్వహిస్తున్న టెండర్లపై విచారణ జరిపించి, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

ఫ సీఎం, కలెక్టర్‌, విజిలెన్సు అధికారులకు ఫిర్యాదు

- కాంట్రాక్టర్‌ రొడ్డ భరద్వాజ్‌

సుడా నిధులతో ఇటీవల నిర్వహించిన అభివృద్ధి పనుల టెండర్లలో ఎస్సీ రిజర్వుడ్‌ పనులకు నేడు బిడ్‌ వేశాను. అధికారులు ఆ బిడ్‌ను ఓపెన కూడా చేయలేదు. 50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో కొత్తపల్లి-కొక్కెరకుంట గ్రావెల్‌ రోడ్‌ పనులను చేసేందుకు 31శాతం లెస్‌తో టెండర్‌ వేశా. నా బిడ్‌ను ఓపెన చేయకుండా నాతోపాటు వేసిన మరో ముగ్గురు కాంట్రాక్టర్ల బిడ్స్‌ను ఓపెన చేసి 13.1 శాతం లెస్‌కు వేసిన కాంట్రాక్టర్‌కు ఎల్‌వో ఇచ్చారు. నిబంధనల మేరకు ఎవరు ఎక్కువ లెస్‌తో టెండర్‌ వేసే వారికే పని అప్పగించాల్సి ఉంటుంది. నాకంటే తక్కువ లెస్‌తో వేసిన వారికి పనులు అప్పగించారు. మున్సిపల్‌ ఈఈ, కాంట్రాక్టర్లతో కుమ్మక్కై అర్హులైన నాలాంటి వారికి నష్టం కలిగించడంతోపాటు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ డబ్బులు దండుకుంటున్నారు. సుడా నిధుల టెండర్లలో జరిగిన గోల్‌మాల్‌పై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలంటూ ముఖ్యమంత్రి రేవంతరెడ్డికి, కలెక్టర్‌కు, విజిలెన్సు అధికారులకు, ఈఎనసి, ఎస్సీ, ఎస్టీ కమిషనకు ఫిర్యాదు చేశాను.

Updated Date - Jan 05 , 2026 | 01:45 AM