Share News

Karimnagar: పాఠశాలల్లో పకడ్బందీగా ఫిర్యాదుల పెట్టె నిర్వహణ

ABN , Publish Date - Jan 07 , 2026 | 11:28 PM

కరీంనగర్‌ క్రైం, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఫిర్యాదుల పెట్టెలను సమర్థవంతంగా, పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు.

Karimnagar:   పాఠశాలల్లో పకడ్బందీగా ఫిర్యాదుల పెట్టె నిర్వహణ

- మహిళా కానిస్టేబుల్‌ చేతికి తాళాలు

- కలెక్టర్‌ పమేలా సత్పతి

కరీంనగర్‌ క్రైం, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఫిర్యాదుల పెట్టెలను సమర్థవంతంగా, పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. స్నేహిత కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో ఫిర్యాదులు పెట్టెల నిర్వహణపై స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లు, మహిళా కానిస్టేబుళ్లు, సీడీపీవోలు, ఎంఈవోలు, హెడ్మాస్టర్లు, చైల్డ్‌ఫ్రెండ్లీ టీచర్లతో కలెక్టర్‌ పమేలా సత్పతి, సీపీ గౌస్‌ ఆలం బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ మాట్లాడుతూ.. పాఠశాలల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ధైర్యంగా తెలియజేసేందుకు ఫిర్యాదుల పెట్టె విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు. లైంగిక వేధింపుల నుంచి విద్యార్థులను కాపాడేందుకు ఈ ఫిర్యాదుల పెట్టెలు ఉపకరిస్తాయని తెలిపారు. జిల్లా యంత్రాంగం నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం ప్రతి పాఠశాలలో ఫిర్యాదుల పెట్టెలు నిర్వహించాలని ఆదేశించారు. ఫిర్యాదులు పెట్టెలపై విధిగా హెల్ప్‌లైన్‌ నంబర్లు ఉండాలన్నారు. పోలీస్‌, మహిళాభివృద్ధి శిశు సంక్షేమ, విద్య శాఖలు సమన్వయంతో ఈ ఫిర్యాదుల పెట్టెలు నిర్వహించాలని అన్నారు. వీటికి సంబంధించిన తాళాలు మహిళా పోలీసుల చేతిలో ఉంటాయని తెలిపారు. మహిళా పోలీసులు పాఠశాలలను సందర్శించి ఫిర్యాదులను సేకరించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. చైల్డ్‌ఫ్రెండ్లీ టీచర్లు పిల్లలతో మమేకమై వారి ఫిర్యాదులను ధైర్యంగా తెలియజేసేలా ప్రోత్సహించాలన్నారు. స్నేహిత క్లబ్‌ మెంబర్లు ఉత్సాహంగా పనిచేసేలా చూడాలని తెలిపారు. పాఠశాల పరిధిలో తప్పిదాలు, నేరాలు, లైంగికపరమైన వేధింపులు జరిగినట్లు తమ దృష్టికి వస్తే ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు వెంటనే అధికారులకు తెలియజేయాలన్నారు. లేకపోతే అక్కడ జరిగే సంఘటనలకు వారు బాధ్యులై శిక్షార్హులవుతారని తెలిపారు. సీపీ గౌస్‌ ఆలం మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రతి పాఠశాలలో ఫిర్యాదుల పెట్టె నిర్వహణకు మహిళా పోలీసును కేటాయించామని తెలిపారు. వారానికి ఒకసారి ఫిర్యాదులను సేకరించి మహిళా పోలీసులు నివేదిక పంపుతారన్నారు. సంబంధిత పాఠశాలలో విద్యార్థులకు వివిధ రకాల అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారని అన్నారు. సోషల్‌ మీడియా ద్వారా లైంగిక వేధింపులు, రక్షణ చట్టాలు, హెల్ప్‌ లైన్‌ నంబర్లు వంటి వాటిపై అవగాహన కల్పిస్తారని తెలిపారు. విద్యార్థులు తమపై జరుగుతున్న వేధింపుల గురించి ధైర్యంగా ఫిర్యాదు చేయవచ్చని, వారి వివరాలు గోప్యంగా ఉంటాయన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా పరిష్కరించేందుకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ అశ్విని తానాజీ వాఖడే, విద్యాశాఖ క్వాలిటీ కోఆర్డినేటర్‌ అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jan 07 , 2026 | 11:29 PM