Karimnagar : ప్రభుత్వ పాఠశాలల బలోపేతం
ABN , Publish Date - Mar 23 , 2026 | 01:09 AM
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్) రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించింది.
- వచ్చే విద్యాసంవత్సరం నుంచి 10+2 అమలు
- కేజీ నుంచి ఇంటర్ విద్యార్థుల వరకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం
- బడ్జెట్‌లో నిధుల కేటాయింపు
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించింది. విద్యారంగంలో సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ కొత్తగా విద్యార్థులకు అల్పాహారాన్ని అందిస్తూ మరికొంత మందికి మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరిస్తున్నది. ఇప్పటికే ప్రాథమిక స్థాయి నుంచి హైస్కూల్ విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని ఇంటర్మీడియట్ విద్యార్థులకూ ఇవ్వాలని నిర్ణయించింది. కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులందరికీఅల్పాహారాన్ని కూడా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ప్రభుత్వం ఈ మేరకు బడ్జెట్‌లో నిధులు కేటాయించింది.
ఫ జిల్లాలో 53,187 విద్యార్థులకు లబ్ధి
ప్రభుత్వం అమలు చేయనున్న ఈ రెండు పథకాల ద్వారా జిల్లాలో 35,187 మంది విద్యార్థులకు ఉదయం పూట అల్పాహారం అందుబాటులోకి రానున్నది. 18 వేల మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందనున్నది. జిల్లాలో 387 ప్రభుత్వ ప్రాథమిక, 72 ప్రాథమికోన్నత, 146 ఉన్నత పాఠశాలల్లో గత విద్యాసంవత్సరంలో 35 వేల మంది చదువుకున్నారు. 14 కేజీబీవీల్లో 2,748 , 11 మోడల్ స్కూల్స్‌లో 6,205, ఒక యూఆర్‌ఎస్‌లో 63 మంది ఉన్నారు. 29 బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ పాఠశాలల్లో 12,250 మంది విద్యార్థులు, ఇతర రాష్ట్రాలకు చెందిన మూడు పాఠశాలల్లో 415 మంది విద్యార్థులు ఉన్నారు. వీరందరికి మధ్యాహ్నం భోజనం అందించారు. మోడల్ స్కూల్, కేజీబీవీల్లో ఇంటర్ చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించలేదు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి వీరందరికి ప్రభుత్వం ఉదయం అల్పాహారంతోపాటు మధ్యాహ్నం భోజనం అందించనున్నది. పాలు, రాగి జావ కూడా అందిస్తామని ప్రకటించింది. జిల్లాలోని 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో తొమ్మిది వేల మంది ఫస్ట్ ఇయర్, సెకండర్ ఇయర్, వొకేషనల్ కోర్సుల్లో విద్యనభ్యసించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి వీరితోపాటు మోడల్ స్కూల్స్, కేజీబీవీల్లో చదివే తొమ్మిది వేల పైచిలుకు ఇంటర్ విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకం అమలుకానున్నది.
ఫ హైస్కూల్స్ అప్‌గ్రేడ్
వచ్చే విద్యాసంవత్సరం నుంచి హైస్కూల్స్‌ను పదో తరగతి తర్వాత +2తో అప్‌గ్రేడ్ చేయడంతోపాటు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వాటిని విలీనం చేస్తామని ప్రకటించింది. దీంతో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలలకు దీటుగా రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ వరకు మోడల్ స్కూల్, కేజీబీవీ పాఠశాలలను, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాలను నిర్వహిస్తోంది. ప్రభుత్వం పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్కులు, యూనిఫామ్స్, షూస్, మధ్యాహ్న భోజనాన్ని అందిస్తోంది. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహించడంతోపాటు వారికి సాయంత్రం వేళల్లో అల్పాహారం అందించి విద్యార్థులకు ప్రోత్సాహాన్ని అందిస్తోంది. మరోవైపు పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించడం, విద్యా సంవత్సరం ప్రారంభంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించి బడీడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం, బడిమానేసిన వారిని చేర్పించడం వంటి వాటితో విద్యార్థుల సంఖ్యను పెంచి పాఠశాలల బలోపేతానికి చర్యలు చేపట్టింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థులందరికీ అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందిస్తే ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ నిర్ణయంతో పేద, మధ్యతరగతి పిల్లలకు ప్రయోజనం చేకూరుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లోని సమస్యలను పరిష్కరించడం, మౌలిక వసతులను మరింత మెరుగుపరచడం, ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడడం, నాణ్యమైన విద్యతోపాటు మధ్యాహ్న భోజనం అందించాల్సిన అవసరముంది.