Karimnagar : వడ్డీ మాఫీ చేయరా..?
ABN , Publish Date - Mar 27 , 2026 | 01:06 AM
కరీంనగర్ టౌన్, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): ఆర్థిక సంవత్సరం ముగింపు సమయం దగ్గర పడుతున్నా కొద్దీ బల్దియా అధికారులు ఆస్తిపన్ను, నల్లాబిల్లులు, ట్రేడ్ లైసెన్సు ఫీజులపై దృష్టి సారించారు.
- వడ్డీతో సహా ఆస్తిపన్ను వసూలు చేస్తున్న బల్దియా అధికారులు
- ఎర్లీబర్డ్ స్కీమ్‌పైనా అనుమానాలు
కరీంనగర్ టౌన్, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): ఆర్థిక సంవత్సరం ముగింపు సమయం దగ్గర పడుతున్నా కొద్దీ బల్దియా అధికారులు ఆస్తిపన్ను, నల్లాబిల్లులు, ట్రేడ్ లైసెన్సు ఫీజులపై దృష్టి సారించారు. అయినా ఇప్పటి వరకు 62 శాతం మాత్రమే వసూలయ్యాయి. వందశాతం పన్నులను వసూలు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో అధికారులు వడ్డీతో సహా చట్టపరమైన చర్యలు తీసుకుంటు వసూలు చేస్తున్నారు. అసలుతోపాటు వడ్డీ భారాన్ని మోసేదెలా అంటూ ఇళ్ల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో మాదిరిగా 90 శాతం వడ్డీ మాఫీ వస్తుందని ఆశించామని, అసలు పన్నులను చెల్లించడమే కష్టంగా ఉండగా వడ్డీతో సహా చెల్లించడం కష్టంగా మారిందంన్నారు. ఈ సంవత్సరం వడ్డీ మాఫీ పథకం వన్‌టైమ్ సెటిల్‌మెంట్ స్కీమ్‌ను గ్రేటర్ హైదరాబాద్‌లోనే అమలు చేస్తున్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గత ఏడాది వరకు పట్టణాలు, నగరాల్లో ఆస్తిపన్ను చెల్లింపుదారులు మార్చి 31వ తేదీ వరకు ఆస్తిపన్ను బకాయిలను ఏకమొత్తంగా చెల్లిస్తే వన్‌టైం సెటిల్‌మెంట్ స్కీం కింద 90 శాతం వడ్డీ మాఫీ చేసింది. ఈసారి రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్‌లోనే వడ్డీ మాఫీకి ప్రభుత్వం అనుమతిచ్చి మిగిలిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వడ్డీ వసూలు చేస్తోంది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోనూ వడ్డీ మాఫీ చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
బకాయిదారులపై కొరడా
కరీంనగర్ కార్పొరేషన్‌లో ఇటీవల ఐదు గ్రామాలను విలీనం చేశారని, దీంతో విలీన గ్రామాల ప్రజలపై పన్నుల భారం పడిందని, వడ్డీ మాఫీ పథకాన్ని ఇక్కడా అమలుచేయాలంటూ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ప్రభుత్వానికి లేఖ రాశారు. అయినా ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. ఆస్తిపన్ను బకాయిదారులకు ముందుగా నోటీసు జారీ చేసి వారం రోజుల్లో చెల్లించకుంటే ఆస్తులను జప్తుచేయడం, దుకాణాలను సీజ్ చేయడం వంటి చర్యలతో కొరడా ఝళిపిస్తున్నారు. మార్చి31కి ఐదురోజులు మాత్రమే మిగిలి ఉండగా ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు.
గత సంవత్సరం ఐదు శాతం రిబేట్
గత సంవత్సరం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గృహ, వాణిజ్య, వ్యాపార, ఇతర ఇళ్లకు సంబంధించిన ఆస్తిపన్నులు ఏప్రిల్ 30వ తేదీ వరకు ఒకేసారి చెల్లిస్తే పన్నుపై ఐదు శాతం రిబేట్ వర్తింపజేశారు. ఓ వైపు వన్ టైం సెటిల్‌మెంట్ స్కీమ్ ద్వారా మున్సిపాలిటీలకు బకాయిలు వసూలు కాగా, ఎర్లీబర్డ్ స్కీం కింద ఐదు శాతం రిబేట్ ఇవ్వడంతో మున్సిపాలిటీలకు పెద్ద మొత్తంలో పన్నులు వసూలయ్యాయి. ప్రజలకు కూడా వడ్డీ భారంతోపాటు ముందుగా చెల్లించిన వారికి రిబేట్ కూడా వచ్చింది. ఈసారి ఎర్లీబర్డ్ స్కీమ్ కింద ఐదు శాతం రిబేట్ కాకుండా 10శాతం రిబేట్ ఇవ్వాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.