Karimnagar: కాల్పుల ఘటన దుర్మార్గం
ABN , Publish Date - May 04 , 2026 | 11:56 PM
కరీంనగర్ టౌన్, మే 4 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్‌లో ఆదివారం జరిగిన కాల్పుల ఘటనను దురదృష్టకర ఘటన అని చెప్పి ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని,
- 32 గంటలైనా నిందితులను పట్టుకోకపోవడం పోలీసుల, ప్రభుత్వ వైఫల్యం
- బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు
కరీంనగర్ టౌన్, మే 4 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్‌లో ఆదివారం జరిగిన కాల్పుల ఘటనను దురదృష్టకర ఘటన అని చెప్పి ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని, ఇది దుర్మార్గమని బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు విమర్శించారు. కాల్పుల్లో గాయపడి చికిత్స పొందుతున్న పీఎంజే జ్యువెలరీస్ సిబ్బందిని ఆయన సోమవారం పరామర్శించారు. పీఎంజే జ్యువెలరీస్‌కు వెళ్లి ఘటన వివరాలను తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చివరికి కాల్పులు జరిపి పడిపోయిన వారు చనిపోయారని పారిపోయారే తప్ప పోలీసులు రావడం వల్లనో లేదా ప్రభుత్వ స్పందన వల్ల కాదని అన్నారు. 32 గంటలు గడిచినా నిందుతులను పట్టుకోలేపోయారని, ఇంత హీనస్థితిలో జిల్లా పోలీసు యంత్రాంగం ఉందని కేటీఆర్ విమర్శించారు. బీఆర్‌ఎస్ పాలనలో కరీంనగర్‌ను స్మార్ట్‌సిటీతోపాటు సేఫ్ సిటీగా మార్చేందుకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వెయ్యికిపైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించారని, కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. పోలీసులు నేరాలను అరికట్టడంలో ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. ప్రజలే సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకొని గస్తీ తిరిగే పరిస్థితి ఎదురైందన్నారు. ప్రభుత్వం పోలీసులను సరిగా పనిచేయనివ్వడం లేదని విమర్శించారు. ముగ్గురు మంత్రులున్న జిల్లాలో బాధితులను పరామర్శించడానికి ఎవరికి టైం దొరకడం లేదా అని ప్రశ్నించారు. మొన్ననే బండి సంజయ్ కోట్లు కుమ్మరించి మున్సిపల్ ఎన్నికల్లో గెలిచారని, కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా కరీంనగర్‌లో జరిగిన ప్రభుత్వ వైఫల్యంపై సీఎం రేవంత్‌రెడ్డిని ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్‌రెడ్డి, డాక్టర్ సంజయ్‌కుమార్, బీఆర్‌ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి టి జీవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మన్‌రావు, జడ్పీ మాజీ చైర్‌పర్సన్ తుల ఉమ, మాజీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణ, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ పాల్గొన్నారు.