Share News

Karimnagar : యుద్ధ నీడలు

ABN , Publish Date - Mar 08 , 2026 | 01:11 AM

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌) ఇరాన్‌, ఇజ్రాయెల్‌, అమెరికా యుద్ధం ప్రభావం ఉమ్మడి జిల్లాపై పడుతోంది.

Karimnagar :  యుద్ధ నీడలు

- పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధరలు

- వంట గ్యాస్‌పై రూ. 60 అదనపు భారం

- వాణిజ్య గ్యాస్‌పై రూ. 115 భారం

- యూరియా ఉత్పత్తికి అందని గ్యాస్‌

- ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో 50 శాతం తగ్గిన ఉత్పత్తి

- పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగే ప్రమాదం

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

ఇరాన్‌, ఇజ్రాయెల్‌, అమెరికా యుద్ధం ప్రభావం ఉమ్మడి జిల్లాపై పడుతోంది. ఉమ్మడి జిల్లా పరిధిలోని వివిధ గ్రామాల నుంచి సౌదీ అరేబియా, దుబాయ్‌, అబుదాబీ, షార్జా, ఒమన్‌, కువైట్‌, ఖతార్‌, బ్రహెయిన్‌లో 2.5 లక్షల మంది ఉన్నారు. మరికొద్ది నెలలపాటు యుద్ధం జరిగే అవకాశముందని తెలియడంతో ఆయా కుటుంబాలవారు ఆందోళన చెందుతుతున్నారు. వలస జీవుల కుటుంబాల్లో యుద్ధం నిద్రలేని రాత్రులను మిగిల్చుతోందిజ యుద్ధ ప్రభావం పరోక్షంగా ప్రజల నిత్యం జీవితంపై కూడా పడుతున్నది.

ఫ యూరియాకు తిప్పలు తప్పవా..

త్వరలోనే పెట్రోల్‌ ధరలు పెరుగుతాయని ప్రచారం జరుగుతుండగా గ్యాస్‌ సిలిండర్ల ధరలు ఇప్పటికే పెరిగిపోయాయి. ఖతార్‌ నుంచి గ్యాస్‌ సరఫరా సక్రమంగా జరగక ఉమ్మడి జిల్లా పరిధిలోని రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి తగ్గిపోయింది. గడిచిన 24 గంటల్లో రోజుకు 3,850 మెట్రిక్‌ టన్నుల యూరియా ఉత్పత్తి కావలసి ఉండగా 1700 నుంచి 1900 మెట్రిక్‌ టన్నులకు ఉత్పత్తి పడిపోయింది. ఖతార్‌ నుంచి రెండు మిలియన్‌ మెట్రిక్‌ క్యూబిక్‌ మీటర్ల గ్యాస్‌ సరఫరా కావలసి ఉండగా అక్కడి యుద్ధం కారణంగా 1 ఎంఎంసీడీకి తగ్గించారు. దీనితో 50 శాతం యూరియా ఉత్పత్తి తగ్గిపోయింది. గ్యాస్‌ కోటా మరింత తగ్గితే ఉత్పత్తి నిలిచిపోయే ప్రమాదముందని ఆర్‌ఎఫ్‌పీఎల్‌ వర్గాలు ఆందోళన పడుతున్నాయని సమాచారం. రామగుండం ఎరువుల కంపెనీలో ఉత్పత్తి అయ్యే యూరియాలో 40 నుంచి 45 శాతం రాష్ట్రానికే కేటాయిస్తున్నారు. ఇక్కడి ఉత్పత్తి తగ్గినా, నిలిచిపోయినా ఆ మేరకు ఉత్పన్నమయ్యే కష్టనష్టాలను ఇక్కడి ప్రజలే భరించాల్సి ఉంటుంది. బయటి దేశాల నుంచి వచ్చే యూరియా రాకుండా పోవడం, ఇక్కడ ఉత్పత్తి తగ్గిపోవడంతో యూరియా ధరలు పెరిగి రబీ సీజన్‌కు ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న యూరియాను బ్లాక్‌ మార్కెట్‌కు తరలించే ప్రమాదం ఏర్పడింది.

ఫ సామాన్యుడిపై గ్యాస్‌ బండ

మరోవైపు గ్యాస్‌ సిలిండర్ల ధరలు పెరిగిపోయాయి. గృహావసరాలకు వినియోగించుకునే గ్యాస్‌ సిలిండర్‌పై 60 రూపాయలు, వాణిజ్య అవసరాలకు వినియోగించుకునే సిలిండర్‌పై 115 రూపాయలు పెంచారు. త్వరలోనే ఈ ధరలు మరింత పెరగడంతోపాటు సరఫరా కూడా తగ్గిపోయే ప్రమాదముందని తెలుస్తున్నది. కరీంనగర్‌ జిల్లాలో 4.3 లక్షల గ్యాస్‌ కనెక్షన్లు ఉండగా ఇందులో 3.5 లక్షల గృహ అవసరాల కనెక్షన్లు ఉన్నాయి. సబ్సిడీపై ప్రభుత్వం సరఫరా చేసే గ్యాస్‌ కనెక్షన్లు 1,43,899 ఉన్నాయి. వీటికి ధరలు పెరుగక పోయినా 2,06,101 గ్యాస్‌ కనెక్షన్లకు ఒక్కో సిలిండర్‌పై 60 రూపాయల అదనపు భారం పడుతున్నది. ఈ కనెక్షన్ల వారు నెలల్లో ఒక సిలిండర్‌ను వినియోగించుకున్నా 1.23 కోట్ల భారాన్ని మోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 80,000 వాణిజ్య కనెక్షన్లపై సుమారు రెండు లక్షల సిలిండర్లు వినియోగిస్తారు. ఈ సిలిండర్‌ ధర 115 రూపాయలు పెరుగడంతో 2.3 కోట్ల రూపాయల భారం వాణిజ్య వినియోగదారులపై పడనున్నది. పెట్రోల్‌ ధరల్లో ప్రస్తుతానికైతే తేడా ఏమి లేకున్నా త్వరలోనే ధరలు పెరిగే అవకాశముందని, కొరత తప్పదని ఆయిల్‌ వ్యాపారంలో ఉన్నవారు అంటున్నారు. పెట్రోల్‌, డిజీల్‌, గ్యాస్‌ ధరలు పెరగడం, కొరత ఏర్పడటం పరోక్షంగా మరికొన్ని రంగాలపై ప్రభావం పడి అందుకు ఉత్పన్నమయ్యే భారాలను ప్రజలు మోయాల్సి వచ్చే పరిస్థితులు త్వరలోనే ఎదురుకానున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగితే రవాణా చార్జీలు పెరుగడంతో ఽనిత్యావసర వస్తువుల ధరలు పెంచే అవకాశమున్నది.

Updated Date - Mar 08 , 2026 | 01:11 AM