Share News

Karimnagar: ఇసుక తోడేస్తున్నారు..

ABN , Publish Date - May 21 , 2026 | 11:19 PM

చిగురుమామిడి, మే 21 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మోయతుమ్మెద వాగు నుంచి నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా ఇసుకను తోడేస్తున్నారు.

 Karimnagar:   ఇసుక తోడేస్తున్నారు..

- ఎల్‌ఎండీ పూడికతీత పేరుతో తవ్వకాలు

- ఎఫ్‌టీఎల్‌ పరిధి దాటి ఇసుక తరలింపు

- అడుగంటుతున్న భూగర్భ జలాలు..

- ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు

చిగురుమామిడి, మే 21 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మోయతుమ్మెద వాగు నుంచి నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా ఇసుకను తోడేస్తున్నారు. వాగు నుంచి ఇసుకను తోడవద్దని రామంచ గ్రామస్తులు అందోళన చేస్తున్నా పట్టించుకోవడం లేదు. లోయర్‌ మానేరు డ్యామ్‌ నుంచి సిల్ట్‌ తీయడానికి ప్రభుత్వం ఓ వ్యక్తికి కాంట్రాక్టు ఇచ్చింది. నిబంధనల ప్రకారం 920 ఎఫ్‌టీఎల్‌ (ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌) వరకు పూడిక తీయాల్సి ఉంటుంది. వాటిని అతిక్రమించి డ్యామ్‌ పరిధి దాటి రామంచ గ్రామ పరిధిలోని మోయుతుమ్మెద వాగులోకి చొరబడి ఇసుక తోడేస్తున్నారు. వాగులో ఇసుక తరలింపుతో పరిసర ప్రాంతాల్లో భూగర్భజలాలు తగ్గిపోతున్నాయి. వాగును ఆనుకుని 576 బోర్లు, బావుల్లో ఉన్నాయి. వీటి మీద ఆధారపడ్డి రైతులు తమ భూములు సాగు చేసుకుంటున్నారు. 1.5 మీటర్ల లోతు వరకు మాత్రమే ఇసుక తీయాలనే నిబంధన ఉంది. ఈ నిబంధనను పట్టించుకోకుకండా ఎనిమిది మీటర్లకుపైగా తవ్వి ఇసుకను, మట్టిని తీస్తున్నారు. ఇష్టారాజ్యంగా తవ్వండంతో వాగు ఒడ్డును అనుకుని ఉన్న 200 తాటిచెట్లు ఎండిపోయాయి. ఇష్టారాజ్యంగా తవ్వడంతో పైప్‌లైన్లు, నీటి సంపులు, మోటార్లు దెబ్బతిన్నాయి. ప్రతి రోజు గ్రామస్తులు ఇసుక తవ్వకాలను అడ్డుకుంటున్నారు. అధికారులు, ప్రభుత్వ పెద్దలు పునరాలోచించి ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని రామంచ గ్రామస్తులు కోరుతున్నారు.

ఫ తవ్వకాలను అడ్డుకుని తీరుతాం..

వాంటుకాల కిషన్‌రెడ్డి, రామంచ సర్పంచ్‌

నిబంధనలకు విరుద్థంగా మోయుతుమ్మెద వాగు నుంచి ఇసుకను తరలించడం సరైంది కాదు. టెండర్‌ లో ఉన్న నిబంధనల ప్రకారం ఎల్‌ఎండీ పరిధిలోనే ఇసుకను, మట్టిని తీయాలి. కాంట్రాక్టర్‌ అక్రమాలతో రైతులు, గీత కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. ఇసుక తవ్వకాలను అడ్డుకుని తీరుతాం..

ఫ వాగును నమ్ముకొని జీవిస్తున్నాం..

- దాసరి రవి, రైతు రామంచ

మోయతుమ్మెద వాగును నమ్ముకుని బోర్‌ వేసుకుని వ్యవసాయం చేసుకుంటున్నాం. వాగులో ఇసుక తీయడం వల్ల భూగర్భ జలాలు అడుగంటి పోయి బోర్లు, బావులు ఎండి పోతున్నాయి. ప్రభుత్వం స్పందించి తవ్వకాలను నిలిపివేయాలి.

ఫ 200 తాటి చెట్లు ఎండియాయి..

కోక్కిస సతీష్‌, గీత కార్మికుడు, రామంచ

వాగును అనుకొని 500 వరకు తాటిచెట్లు ఉన్నాయి. వాగులో తవ్వకాలతో 200 వరకు తాటి చెట్లు ఎండిపోయాయి. మా జీవనోపాధిపై దెబ్బపడింది. మంతి పొన్నం ప్రబాకర్‌ గౌడ్‌, అధికారులు స్పందించి తవ్వకాలను నిలిపివేయాలి.

Updated Date - May 21 , 2026 | 11:19 PM