Share News

Karimnagar: దుర్గాదేవీ.. నమోస్తుతే

ABN , Publish Date - Oct 12 , 2026 | 12:13 AM

కరీంనగర్‌ కల్చరల్‌, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్తులు వాహనాల్లో అమ్మవారి మూర్తులను తరలించారు.

Karimnagar:   దుర్గాదేవీ.. నమోస్తుతే

- మహాశక్తి ఆలయానికి పోటెత్తిన భక్తజనం

కరీంనగర్‌ కల్చరల్‌, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్తులు వాహనాల్లో అమ్మవారి మూర్తులను తరలించారు. మండపాలను విద్యుత్‌ దీపాలతో, పూలతో ముస్తాబు చేసి రోజుకో అలంకారంతో పాటు అభిషేక, అర్చనలు, ప్రత్యేక పూజలు, విశేష కార్యక్రమాలకు రూపకల్పన చేసుకున్నారు. చైతన్యపురి మహశక్తి ఆలయంలో బాలాత్రిపురసుందరి (శైలపుత్రి) అవతారం, సూర్యప్రభ వాహన అలంకరణ, చతుష్షష్ఠి పూజలు చేశారు. ఉదయం జరిగిన ధ్వజారోహణంలో, సాయంత్రం పూజల్లో ఆలయ నిర్వాహకుడు, కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్‌ పాల్గొన్నారు. పలు ప్రాంతాల భక్తులు, భవానీ దీక్షాపరులతో ఆలయం పోటెత్తింది. భవానీ, దుర్గామాత నామస్మరణలతో ఆలయం మార్మోగింది. సాయంత్రం అమ్మవారికి పంచామృతాభిషేకం నిర్వహించారు. జి మహేశ్వరశర్మ భాగవతంపై ప్రవచనం చేశారు. రాత్రి దాండియా నృత్యం కన్నుల పండువలా జరిగింది. యజ్ఞవరాహస్వామిక్షేత్రంలో ఽఅంకురార్పణ, నవకలశ స్నపనం, సాయంత్రం చతుష్షష్ఠి పూజలు, సామూహిక కుంకుమార్చనలు జరిగాయి. కార్యక్రమంలో సర్వవైదిక సంస్థానం ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ శ్రీభాష్యం వరప్రసాద్‌ పాల్గొన్నారు. పాతబజార్‌ గౌరీశంకరాలయంలో బాలాత్రిపురసుందరి అలంకరణ చేశారు. సప్తశతీ పారాయణం, కుంకుమార్చనలు జరిగాయి. కార్యక్రమంలో వంశపారంపర్య ధర్మకర్త ప్రొద్దుటూరి శ్రీనివాస్‌, ఈవో వుడుతల వెంకన్న పాల్గొన్నారు. భగత్‌నగర్‌ అయ్యప్ప ఆలయంలో జరిగిన పూజల్లో చైర్మన్‌ వై అనిల్‌కుమార్‌గౌడ్‌, ధర్మకర్తలు పాల్గొన్నారు.

ఫవివిధ ఆలయాలు, కూడళ్లలో..

జ్యోతినగర్‌ హనుమాన్‌ సంతోషిమాత, వావిలాలపల్లి హనుమత్‌ సహిత కనకదుర్గ, కమాన్‌రోడ్‌ రామేశ్వర, బొమ్మకల్‌రోడ్‌ అంబాభవానీ ఆలయాల్లో పూజలు జరిగాయి. టవర్‌సర్కిల్‌, ప్రకాశంగంజ్‌, రాంనగర్‌, మంకమ్మతోట, విద్యానగర్‌, గాంధీరోడ్‌, సుభాష్‌నగర్‌, జగిత్యాలరోడ్‌, శ్రీపురం కాలనీతో పాటు పలు ఆలయాల్లో, కూడళ్లలో, వస్త్ర వ్యాపార, వాణిజ్య నిలయాల్లో నెలకొల్పిన దుర్గామాత మండపాల వద్ద ప్రతిష్ఠాపన పూజలు నిర్వహించారు.

Updated Date - Oct 12 , 2026 | 12:13 AM