Share News

Karimnagar: కొనసాగిన ఆర్టీసీ సమ్మె

ABN , Publish Date - Apr 24 , 2026 | 11:57 PM

భగత్‌నగర్‌, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో కార్మికుల సమ్మె మూడో రోజు ఉదృతంగా జరిగింది.

Karimnagar:   కొనసాగిన ఆర్టీసీ సమ్మె

- మూడో రోజు కార్మికుల నిరసన

భగత్‌నగర్‌, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో కార్మికుల సమ్మె మూడో రోజు ఉదృతంగా జరిగింది. కరీంనగర్‌లో ఆర్టీసీ జేఏసీ నాయకులు నర్సంపేట డిపోలో డ్రైవర్‌ ఆత్మహత్య చేసుకుని మరణించగా ఆయన మృతికి సంతాపంగా డిపో ముందు నివాళులు అర్పించి, మౌనం పాటించారు. కరీంనగర్‌-1 డిపో ఎదుట జేఏసీ నాయకులు, కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ గేట్‌ ధర్నా నిర్వహించారు. కరీంనగర్‌ నగరపాలక సంస్థ మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ ఆర్టీసీ సమ్మెకు మద్ధతు తెలుపుతూ సంఘీ భావం ప్రకటించారు. ఆర్టీసీ సమ్మెలో భాగంగా కార్మికులు బస్టాండ్‌ ఆవరణలో పెద్ద ఎత్తున శాంతి ర్యాలీ నిర్వహించారు. కరీంనగర్‌లోని అమరవీరుల స్థూపం వద్దకు కార్మికులు నాయకు లు చేరుకుని అమరవీరులకు నిరసన తెలిపి అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ పాల్గొని ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం ప్రకటించారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ ఆర్టీసీ కార్మికుల సమ్మె న్యాయబద్ధమైనదని బీజేపీ పక్షాన మద్ధతు ప్రకటిస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్‌ ఆత్మహత్య చేసుకుని మరణించడంతో కరీంనగర్‌ నుంచి బయలుదేరి వెళ్లారు. కరీంనగర్‌ ఆర్టీసీ బస్టాండ్‌లో నర్సంపేట్‌లో డ్రైవర్‌ మృతికి సంతాపంగా కరీంనగర్‌ ఆర్టీసీ కార్మికులు సాయంత్రం వేళలో కొవ్వత్తులతో నివాళులు అర్పించారు. కరీంనగర్‌ రీజియన్‌ వ్యాప్తంగా అన్ని డిపోల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు, ధర్నాలతో కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. కరీంనగర్‌ రీజి యన్‌ వ్యాప్తంగా ప్రైవేట్‌ హైర్‌ బస్సులు, జేబీఎం ఎలక్ట్రిక్‌ బస్సులు యథావిధిగా నడిచాయి. కరీంనగర్‌ రీజియన్‌ వ్యాప్తంగా 550 బస్సులను 65 శాతం మేర బస్సులను నడిపించినట్లు అధికారులు తెలిపారు.

హుజూరాబాద్‌ : హుజూరాబాద్‌ పట్టణంలో ఆర్టీసీ కార్మికులు శుక్రవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డిపో నుంచి అంబేద్కర్‌ చౌరస్తా వరకు అమరుడైన ఆర్టీసీ కార్మికుడు శంకర్‌ ఫ్లెక్సీతో ర్యాలీ చేపట్టారు. అనంతరం కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం, మానవ హక్కుల వేదిక నాయకులు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికులు, పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Apr 24 , 2026 | 11:57 PM