Karimnagar: గణేష్ మండపాల వద్ద పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలి
ABN , Publish Date - Sep 18 , 2026 | 12:37 AM
రామడుగు/చొప్పదండి, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మండపాల నిర్వాహకులకు సూచిం చారు.
- పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం
రామడుగు/చొప్పదండి, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మండపాల నిర్వాహకులకు సూచిం చారు. చొప్పదండి, రామడుగు ప్రాంతాల్లోని పలు గణేష్ మండపాలు, రానున్న గణేష్ విగ్రహాల నిమజ్జన ప్రదేశాలను సీపీ గౌస్ ఆలం మున్సిపల్, అగ్నిమాపక శాఖ అధికారు లు, పోలీస్ సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మండపాల వద్ద ప్రధాన రహదారులు, రద్దీ ప్రాంతాలు, పరిసరాలను కవర్ చేసేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలని సీపీ అధికారులను ఆదేశించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌లకు అవకాశం లేకుండా నాణ్యమైన వైరింగ్‌నే ఉపయోగించాలని, అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు ఇసుక, నీటి బకెట్లు, ఫైర్ ఎస్టింగ్విషర్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రస్తుత వర్షాల నేపథ్యంలో మండపాల్లోకి నీరు చేరకుండా వాటర్‌ప్రూఫ్ షెడ్లు, విద్యుత్ తీగలకు తగిన రక్షణ చర్యలు చేపట్టాలని నిర్వాహకులకు సూచించారు. నిమజ్జన ప్రదేశాల్లో ప్రమాదాలు జరగకుండా బారికేడ్లు, తగినంత లైటింగ్ ఏర్పాటు చేయడంతో పాటు గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. పోలీస్, మున్సిపల్, అగ్నిమాపక శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ తనిఖీల్లో కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయకుమార్, చొప్పదండి సీఐ ప్రదీప్, ఎస్సైలు నరేష్‌రెడ్డి, రాజులతో పాటు మున్సిపల్, ఫైర్ శాఖ అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రామడుగులో గణపతి మండపాన్ని యూపీకి చెందిన స్వామీజీ సంగటిత్ దాస్ మహారాజ్, విశ్వహిందూ పరిషత్ సభ్యులు సందర్శించారు. చొప్పదండి మున్సిపల్ చైర్‌పర్సన్ వడ్లూరి సరిత, వైస్ చైర్‌పర్సన్ పెరుమాండ్ల మానస తదితరులు పాల్గొన్నారు.