Karimnagar: కొనుగోలు కేంద్రాల్లో దోపిడీని అరికట్టాలి
ABN , Publish Date - May 11 , 2026 | 11:52 PM
సుభాష్‌నగర్, మే 11 (ఆంధ్రజ్యోతి): కొనుగోలు కేంద్రాల్లో దోపిడీని అరికట్టాలని, కొనుగోళ్లు వేగవంతం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు.
- కలెక్టరేట్ ఎదుట సీపీఎం ధర్నా
సుభాష్‌నగర్, మే 11 (ఆంధ్రజ్యోతి): కొనుగోలు కేంద్రాల్లో దోపిడీని అరికట్టాలని, కొనుగోళ్లు వేగవంతం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించి అనంతరం అడిషనల్ కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేయడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. తేమ, తాలు పేరుతో క్వింటాలుకు ఎనిమిది కిలోల వరకు కోత విధిస్తున్నారన్నారు. ఏ వన్ గ్రేడ్ ధాన్యాన్ని కామన్ గ్రేడ్‌గా సెంటర్ నిర్వాహకులు రైస్ మిల్లులకు పంపుతున్నారని, దీంతో రైతులు క్వింటాలుకు 20 రూపాయలు నష్టపోతున్నారన్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైస్ మిల్లర్లు, కొందరు కిందిస్థాయి అధికారులు కుమ్మక్కై రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. అక్రమాలకు పాల్పడుతున్న రైస్ మిల్లులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను రెవెన్యూ, పోలీస్ అధికారులు పర్యవేక్షించాలన్నారు. లారీల కొరత సాకుతో కేద్రాల నిర్వాహకులు క్వింటాలుకు రైతుల దగ్గర 15 రూపాయలు అక్రమంగా వసూలు చేస్తున్నారని విమర్శిచారు. గోనె సంచులు కొరత తీవ్రంగా ఉందని, రైతులనే సంచులు తెచ్చుకోవాలని ఒత్తిడి చేస్తున్నారన్నారు. సన్నధాన్యానికి బోనస్ డబ్బులు వెంటనే రైతులు అకౌంట్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గీట్ల ముకుంద రెడ్డి, వర్ణ వెంకటరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు ఉప్పునూటి శ్రీనివాస్, సుంకర సంపత్, ఎడ్ల రమేష్, జి రాజేశం, డి నరేష్‌పటేల్, జిల్లా నాయకులు శాతరాజు భద్రయ్య, గజ్జల శ్రీకాంత్, రాయికంటి శ్రీనివాస్, పున్నం రవి, కాంపెల్లి అరవింద్, పుల్లెల మల్లయ్య, ప్రభాకర్, కండె రాజు, శివ, భోగేష్, సతీష్, కిషోర్, చక్రపాణి, కరీం పాల్గొన్నారు.