Karimnagar: తెగుళ్లబారిన వరి పంట
ABN , Publish Date - Feb 21 , 2026 | 12:06 AM
చిగురుమామిడి, ఫిబ్రవరి 20 (ఆంద్రజ్యోతి): యాసంగి వరిలో తెగుళ్లు సోకి పంట ఎండిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- ఎదుగుదల లేక ఎండిపోతున్న మొక్కలు
- ఆందోళనలో రైతులు
- అవగాహన కల్పించని అధికారులు
చిగురుమామిడి, ఫిబ్రవరి 20 (ఆంద్రజ్యోతి): యాసంగి వరిలో తెగుళ్లు సోకి పంట ఎండిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎరువులు, పురుగు మందులు చల్లినా లాభం ఉండటం లేదని ఆందోళన చెందుతున్నారు. సాగునీరు ఉన్నా పంటకు తెగుళ్లు సోకి ఎండిపోతుండటంతో చేసేదేం లేక రైతులు దిగాలు పడుతున్నారు. సాగునీరు అందుబాటులోకి రావడంతో చిగురుమామిడి మండలంలోని 17 గ్రామాల్లో వరి పంట వేశారు. దాదాపు రెండు నెలలు గడిచినా వెసిన పంట ఎదగడం లేదు. గ్రామాల్లో వ్యవసాయశాఖ అధికారులు పర్యటించి ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాల్సి ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. మండల వ్యాప్తంగా 29 వేల ఎకరాల్లో సాగు భూములు ఉండగా 22 వేల ఎకరాల్లో యాసంగి వరి వేశారు. గత డిసెంబరులో వేసిన వరి పంటకు ఎర్రబొమ్మిడి, కాండం తొలిచే పురుగు, అగ్గి తెగుళ్ల లాంటివి రావడంతో పంట ఎదగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్‌లో ప్రతి సంవత్సరం తెగుళ్లు సోకి నష్టపోతున్నా వ్యవసాయశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పంటలకు తెగుళ్లు సోకకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
పంటలు పరిశీలించాలి
చీముర్తి మల్లయ్య, ఉల్లంపల్లి
వ్యవసాయశాఖ అధికారులు పంటలను పరిశీలించి ఎలాంటి మందులు వాడాలో రైతులకు అవగాహన కల్పించాలి. అధికారులు, సిబ్బంది కేవలం రైతు వేదికలో సమావేశాలు ఏర్పాటు చేయకుండా గ్రామాల్లోకి వచ్చి రైతులతో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించాలి. భూసార పరీక్షలు ఏర్పాటు చేసి ఎలాంటి ఎరువులు వాడాలనే అవగాహన కల్పించాలి.
రైతులకు ఎలాంటి సమస్య ఉన్నా సంప్రదించాలి
ముత్యాల మల్లేశం, ఏవో, చిగురుమామిడి
రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏ సమస్య ఉన్నా రైతు వేదికలో సంప్రదించాలి. పంటలను పరిశీలించి అవగహన కల్పిస్తాం. ఈ సీజన్‌లో వచ్చే తెగుళ్లకు జింక్ లోపం ప్రధానంగా ఉంటుంది. దీంతో ఎర్రబొమ్మిడి, కాండం తొలిచే పురుగు, అగ్గి తెగుళ్లు సోకుతాయి. దీని నివారణకు ఒక ఎకరానికి 200 లీటర్ల నీళ్లు, అందులో 400 గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి పిచికారి చేయాలి. మొగి పురుగు నివారణకు కెల్డాన్ ఎస్‌పి గుళికలు వేయాలి.