Karimnagar : సీనియర్లను తొక్కుకుంటూ సీఎం పదవి తెచ్చుకున్న రేవంత్
ABN , Publish Date - Mar 20 , 2026 | 12:30 AM
కరీంనగర్, మార్చి 19(ఆంధ్రజ్యోతి, ప్రతినిధి): కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లను తొక్కుకుంటూ సీఎం పదవి తెచ్చు కున్న వ్యక్తి రేవంత్‌రెడ్డి అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు.
- కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్
కరీంనగర్, మార్చి 19(ఆంధ్రజ్యోతి, ప్రతినిధి): కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లను తొక్కుకుంటూ సీఎం పదవి తెచ్చు కున్న వ్యక్తి రేవంత్‌రెడ్డి అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు. ముుఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భాషను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. బుధవారం ఉగాది పురస్కరించుకుని కరీంనగర్ లోని మహాశక్తి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పరాభవ నామ సంవత్సరం దేశానికి విజయాన్ని అందించాలని ఆకాంక్షించారు. అసమ్మతి పేరుతో మీటింగ్‌లు పెడితే తొక్కుతానన్నట్లు ఆ పార్టీ సీనియర్లకే వార్నింగ్ ఇచ్చినట్లుందన్నారు. రాహుల్‌గాంధీ సైతం రేవంత్‌రెడ్డిపైనే ఆధారపడి ఐదు రాష్ట్రాల ఎన్నికల బాధ్యతలు అప్పగించారన్నారు. ఆ ఎన్నికల్లో సర్వేల దగ్గర నుంచి డబ్బులు సమకూర్చే వరకు అన్ని బాధ్యతలు అప్పగించారన్నారు. బీఆర్‌ఎస్ నాయకుల భాష కూడా అలాగే ఉంటుందన్నారు. రెండు పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందన్నారు. ఎంఐఎం ఎమ్మెల్యేలు జాతీయ గీతాన్ని అవమానించినా మీకు పట్టదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శాసన సభా గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత స్పీకర్‌కు లేదా అని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలో ఉంటే ఎంఐఎం సభ్యులను కటకటాల్లోకి పంపే వాళ్లమన్నారు. వందేమాతరం గీతాలాపన సమయంలో అసెంబ్లీలో గవర్నర్, మండలి ఛైర్మన్, స్పీకర్, సీఎం, మంత్రుల సమక్షంలోనే మజ్లిస్ ఎమ్మెల్యేలు బహిష్కరించడం దుర్మార్గమన్నారు. అధికారిక కార్యక్రమాల్లో వందేమాతరం తప్పనిసరి చేస్తు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఆ ఉత్తర్వులను మజ్లిస్‌ఽ దిక్కరించడం ఎంత వరకు సమంజసమన్నారు. ప్రజాస్వామ్యవాదులంతా మజ్లిస్ పార్టీ తీరును ఖండించాలన్నారు. ఓవైసీ అప్పుడప్పుడు దేశభక్తుడిని అని చెప్పుకోవడం కాదు ఆచరణలో చూపాలన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 22 విడతలుగా ఇప్పటి వరకు 18,640 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారన్నారు. రైతు భరోసా పేరుతో రైతులకు రూ.41 వేల కోట్లు రేవంత్ సర్కార్ బాకీ పడిందన్నారు. మూసీ ప్రక్షాళనకు బీజేపీ అనుకూలమేనని, బాధితులకు న్యాయం చేయాలన్నారు. కరీంనగర్ ఎంపీకి ప్రాధాన్యత లేని శాఖను మోడీ కట్టబెట్టారంటూ శ్రీధర్‌బాబు చేసిన వాఖ్యలపై స్పందిస్తు హోంశాఖ కీలకమైనది కాబట్టే రాష్ట్రంలో ముఖ్యమంత్రి తన దగ్గర పెట్టుకున్నారన్నారు. కేంద్ర హోం శాఖ మంత్రిగా ఉన్న అమిత్‌షా ముఖ్యమైన విభాగాలను తనకు అప్పగించారన్నారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిది, డిప్యూటీ మేయర్ సునీల్‌రావు, పార్లమెంట్ ఇన్‌ఛార్జి బోయినపల్లి ప్రవీణ్‌రావు కార్పోరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.