Share News

Karimnagar: సుజల స్రవంతి పైప్‌లైన్‌కు మరమ్మతులు

ABN , Publish Date - Jan 03 , 2026 | 11:16 PM

మానకొండూర్‌, జనవరి 3 (ఆంధ్రజ్యోతి) : హైదరాబాద్‌ నగరవాసులకు తాగు నీరందించే అబ్దుల్‌ కలాం సుజల స్రవంతి గోదావరి నది పైప్‌లైన్‌కు శుక్రవారం భారీ లీకేజీ ఏర్పడి నీరంతా వృథాగా పోయింది.

Karimnagar:  సుజల స్రవంతి పైప్‌లైన్‌కు మరమ్మతులు

- పరిశీలించిన మెట్రో వాటర్‌వర్క్స్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ కిరణ్‌కుమార్‌

మానకొండూర్‌, జనవరి 3 (ఆంధ్రజ్యోతి) : హైదరాబాద్‌ నగరవాసులకు తాగు నీరందించే అబ్దుల్‌ కలాం సుజల స్రవంతి గోదావరి నది పైప్‌లైన్‌కు శుక్రవారం భారీ లీకేజీ ఏర్పడి నీరంతా వృథాగా పోయింది. శనివారం హైదరాబాద్‌ మెట్రో వాటర్‌వర్క్స్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ కిరణ్‌కుమార్‌, సిబ్బంది మండలంలోని జగ్గయ్యపల్లి గ్రామ శివారులో లీకైన ప్రదేశాన్ని పరిశీలించి మరమ్మతు పనులు చేపట్టారు. ఎక్స్‌కావేటర్‌ సహాయంతో గుంత తవ్వి పైప్‌లో నిల్వ ఉన్న నీటిని మోటార్ల ద్వారా బయటికి తోడేశారు. అనంతరం పైప్‌లైన్‌ మరమ్మతు పనులు సాయంత్రం వరకు పూర్తి చేశారు. ఈ సందర్భంగా చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ జగ్గయ్యపల్లి గ్రామ శివారులో సుజల స్రవంతి పైప్‌లైన్‌ లీక్‌ కావడంతో గోదావరి నది నుంచి హైదరాబాద్‌కు సరఫరా చేస్తున్న నీరంతా వృధాగా పోయిందన్నారు. పైపులో ఉన్న నీరు సాయంత్రం వరకు ఖాళీ అయిందన్నారు. త్వరితగతిన మరమ్మతు పనులు పూర్తి చేసి హైదరాబాద్‌ నగరవాసులకు తాగునీరు అందిస్తామని తెలిపారు. జనరల్‌ మేనేజర్లు రాజశేఖర్‌, శశాంక్‌ సిబ్బంది ఉన్నారు.

Updated Date - Jan 03 , 2026 | 11:16 PM