Share News

Karimnagar: చొప్పదండిలో రికార్డు స్థాయిలో మక్కల కొనుగోళ్లు

ABN , Publish Date - Jun 05 , 2026 | 12:15 AM

చొప్పదండి, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): చొప్పదండి వ్యవసాయ మార్కెట్‌లో ఈ యాసంగికి రికార్డు స్థాయిలో మక్కలను కొనుగోలు చేశారు.

 Karimnagar:   చొప్పదండిలో రికార్డు స్థాయిలో మక్కల కొనుగోళ్లు

- 52,292 క్వింటాళ్ల సేకరణ

చొప్పదండి, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): చొప్పదండి వ్యవసాయ మార్కెట్‌లో ఈ యాసంగికి రికార్డు స్థాయిలో మక్కలను కొనుగోలు చేశారు. గతంలో ఎన్నడూ లేనంతగా రైతులు మార్కెట్‌కు మక్కలు తీసుకొచ్చారు. అన్ని సమస్యలను అధిగమించి మక్కల కొనుగోళ్లను పూర్తి చేశారు. చొప్పదండి, రామడుగు, గంగాధర మండలాల రైతుల కోసం మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో చొప్పదండి ప్రాథమిక సహకార సంఘం మక్కల కొనుగోళ్లను ప్రారంభించింది. వారం రోజులకే మార్కెట్‌ యార్డు మొత్తం మక్కలతో నిండిపోయింది. ప్రారంభంలొ సమస్యలు ఎదురైనా అధిగమించి 1,122 మంది రైతుల నుంచి 52,292 క్వింటాళ్ల మక్కలను సేకరించారు.

ఫ గోదాముల్లో నిల్వ

వ్యవసాయ మార్కెట్‌లో ఖాళీగా ఉన్న రెండు గోదాముల్లో కొనుగోలు చేసిన మక్కలను నిల్వ చేశారు. ప్యాక్స్‌ చైర్మన్‌ వెల్మ మల్లారెడ్డి, సీఈవో తిరుపతి రెడ్డి మార్కెటింగ్‌ అధికారులతో మాట్లాడి గోదాములకు మరమ్మతు చేయించారు. రెండు గోదాముల్లో 40 వేల మక్కల బస్తాలను నిల్వ చేశారు. ప్యాక్స్‌ సిబ్బంది పగలు, రాత్రి తేడా లేకండా కాంటాలు వేయించి కొనుగోళ్లు పూర్తి చేశారు. సహకార సంఘం తరపున 13 వేల సంచులను 28 రూపాయలకు ఒకటి చొప్పున కొన్నారు. ఇందులో ఆరు రూపాయలను రైతులు భరించారు. రెండు నెలలపాటు ప్రతీరోజు వెయ్యి క్వింటాళ్ల వరకు కొనుగోలు చేసి తరలించారు.

ఫ వెన్కేపల్లి సహకార పరపతి సంఘం కేంద్రాల్లో ముగిసిన ధాన్యం కొనుగోళ్లు

సైదాపూర్‌: మండలంలోని వెన్కేపల్లి విశాల సహకార పరపతి సంఘం ఆద్వర్యంలో నిర్వహించిన కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేశామని చైర్మన్‌ కొత్త తిరుపతిరెడ్డి తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సంఘం ఆధ్వర్యంలో 13 ఽ కొనుగోలు కేంద్రాలు నిర్వహించగా 2,474 మంది రైతుల నుంచి 1,42,757.6 క్వింటాళ్ల ధాన్యం కొన్నామన్నారు. ధాన్యం డబ్బులు 33,82,34,842 రూపాయలు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసిందని తెలిపారు.

Updated Date - Jun 05 , 2026 | 12:15 AM