Karimnagar: పట్టణ పోరుకు సిద్ధం
ABN , Publish Date - Jan 07 , 2026 | 11:30 PM
హుజూరాబాద్, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికలకు ఆశావహులు సిద్ధమవుతున్నారు.
- మున్సిపల్ ఎన్నికల కోలాహలం
హుజూరాబాద్, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికలకు ఆశావహులు సిద్ధమవుతున్నారు. ఏ క్షణంలో నోటిఫికేషన్ వెలువడుతుందోనని బరిలో ఉండే అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాపై అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. వారం రోజులుగా హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల్లో కోలాహలం కనబడుతోంది. హుజూరాబాద్ 1950 నుంచి 1964వరకు మున్సిపాలిటీగా ఉంది. ఆ తర్వాత మేజర్ గ్రామపంచాయతీగా, 2011లో నగర పంచాయతీగా మారింది. 2019లో గ్రేడ్-3 మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయ్యింది. హుజూరాబాద్‌ను అనుకొని ఉన్న ఇప్పల్‌నర్సింగాపూర్, బోర్నపల్లి, దమ్మక్కపేట, కొత్తపల్లి గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేశారు. ప్రస్తుతం హుజూరాబాద్‌లో 30 వార్డులు ఉన్నాయి. ఓటరు జాబితా ప్రకారం 29,599మంది ఓటర్లు ఉండగా, అందులో పురుషులు 14,395, మహిళలు 15,200, నలుగురు ఇతరులు ఉన్నారు. 2014లో రిజర్వేషన్లలో భాగంగా జనరల్ కాగా, 2019లో జనరల్ మహిళకు కేటాయించారు.
ఫ మున్సిపాలిటీలో ఎన్నికల వాతావరణం...
హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల్లో ఎన్నికల వాతావరణం నెలకొంది. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు ఎవరికి వారే తమ కార్యకర్తలను పోటీలో నిలిపేందుకు సిద్ధం చేస్తున్నారు. 2014 నుంచి బీఆర్‌ఎస్ పార్టీ చైర్మన్ పదవిని కైవసం చేసుకుంది. ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారాయి. హుజూరాబాద్ బీజేపీలో ఒక వైపు ఈటల, మరోవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్ వర్గాలు తయారయ్యాయి. కాంగ్రెస్ అధికారంలో ఉండగా, తమ అభ్యర్థులను గెలిపించేందుకు నియోజకవర్గ ఇన్‌చార్జీ వొడితెల ప్రణవ్ ఎప్పటికప్పుడు కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి బీఆర్‌ఎస్ కార్యకర్తలను పోటల్లో నిలిపేందుకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడితే రాజకీయం మరింత వేడెక్కనుంది.
ఫ టికెట్ కోసం ఆశావహుల ప్రయత్నాలు
హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల్లో బరిలో నిలిచేందుకు వివిధ పార్టీలకు చెందిన ఆశావహులు తమకు టికెట్ కేటాయించాలని నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ సారి ఎలాగైనా తమకే టికెట్ కేటాయించాలని, పార్టీ కోసం కష్టపడ్డామని కోరుతున్నారు. ఈ ఎన్నికలు జరిగితే బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల అభ్యర్థులు మాత్రం రంగంలో ఉండనున్నట్లు తెలిసింది. వీరితోపాటు టికెట్ రాని వారు రెబల్ అభ్యర్థులుగా బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నారు. పోటీ చేసే అభ్యర్థులు ఆయా వార్డుల్లో ఇప్పటికే ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేసుకుంటున్నారు. తాము గెలిస్తే పనులు చేస్తామని నమ్మ బలుకుతున్నారు.