Share News

Karimnagar: కొనసాగిన వైద్య విద్యార్థుల నిరసనలు

ABN , Publish Date - Nov 22 , 2026 | 11:54 PM

భగత్‌నగర్‌, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): కొత్తపల్లిలోని ప్రభుత్వ వైద్య విద్యార్థుల నిరసనలు రెండో రోజు ఆదివారం కొనసాగాయి. కళాశాల గేటు ఎదుట ప్లకార్డులు ప్రదర్శించి తమ సమస్యలు పరిష్కారించాలని కోరారు.

 Karimnagar:  కొనసాగిన వైద్య విద్యార్థుల నిరసనలు
కొత్తపల్లి ప్రభుత్వ మెడికల్‌ కళాశాల వద్ద ధర్నా చేస్తున్న మెడికల్‌ విద్యార్థులు

భగత్‌నగర్‌, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): కొత్తపల్లిలోని ప్రభుత్వ వైద్య విద్యార్థుల నిరసనలు రెండో రోజు ఆదివారం కొనసాగాయి. కళాశాల గేటు ఎదుట ప్లకార్డులు ప్రదర్శించి తమ సమస్యలు పరిష్కారించాలని కోరారు. హాస్టల్‌ వసతితో పాటు, మౌలిక వసతులు లేక నానా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. హాస్టల్‌ దూరంగా ఉండడంతో రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

- ఆర్డీవో కళాశాల సందర్శన

కొత్తపల్లిలోని వైద్య కళాశాలను ఆర్డీవో, ప్రిన్సిపాల్‌తో కలిసి సందర్శించారు. విద్యార్థుల అవసరాలు, వసతుల కల్పనపై వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలకు టీఎస్‌ఎంఐడీసీ ఈఈ ద్వారా ఎన్పీడీసీఎల్‌కు .11.4 లక్షల రూపాయల నిధులుమంజూరు చేశారు. కరీంనగర్‌ కార్పొరేషన్‌ నుంచి మంచినీటి వసతి కల్పించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. రెండు వారాల్లో హాస్టల్‌ భవనాలను అప్పగించేందుకు అధికారులు, కాంట్రాక్టర్‌ చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా లిఫ్ట్‌ సదుపాయంతోపాటు, అవసరమైన సామగ్రి ఏర్పాటు చేసి, ఇన్వర్టర్లు, ఏసీలను సమకూర్చేందుకు నిధులు మంజూరు చేస్తామన్నారు.

- నేడు మంత్రి రాజనర్సింహ సమీక్ష

కరీంనగర్‌, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కరీంనగర్‌ ప్రభుత్వ ఆసుపత్రి, ప్రభుత్వ వైద్య కళాశాలలో హాస్టల్‌ వసతి సౌకర్యాలు, మౌళిక సదుపాయాలకల్పనపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష నిర్వహించనున్నారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి సమక్షంలో జరిగే ఈ సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌, కలెక్టర్‌ చిత్రామిశ్రా, వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పాల్గొంటారని మంత్రి కార్యాలయవర్గాలు తెలిపాయి. వైద్య కళాశాల, హాస్టల్‌ భవన నిర్మాణ పనులు, ఇతర మౌలిక సదుపాయాలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. నిరంతర విద్యుత్‌ సరఫరా కల్పించేందుకు ఎన్‌పీడీసీఎల్‌కు 19 లక్షలు మంజూరు చేశారని, ఈ పనులను సోమవారం ప్రారంభిస్తారని అన్నారు.

Updated Date - Nov 22 , 2026 | 11:54 PM