Karimnagar: నేటి నుంచి మండలాల్లో ప్రజావాణి
ABN , Publish Date - Aug 17 , 2026 | 12:06 AM
తిమ్మాపూర్, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం నుంచి ఎంపీడీవో కార్యాలయాల్లో నిర్వహించనున్నారు.
తిమ్మాపూర్, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం నుంచి ఎంపీడీవో కార్యాలయాల్లో నిర్వహించనున్నారు. ప్రజలు కలెక్టరేట్లకు వెళ్లి క్యూలో నిలుచునే అవసరం లేకుండా మండలస్థాయిలోనే సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మండల స్థాయిలో సంబంధిత అన్ని విభాగాల అధికారులు ఒకే వేదికపైన ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించనున్నారు.
ఫ అధికారుల హాజరు తప్పనిసరి
ప్రతి సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణిలో అధికారులు తప్పని సరిగా హాజరు కావాల్సిందే. ప్రతి సోమవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు ప్రజావాణి నిర్వహించనున్నారు. ఈ ప్రజావాణి కార్యక్రమానికి ఎంపీడీవో, తహసీల్దార్, మండల పంచాయితీ అధికారి, వ్యవసాయ అధికారి, విద్యుత్ శాఖ ఏఈ, మిషన్ భగీరథ, ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీర్లు, మండల విద్యాధికారి పంచాయతీ కార్యదర్శులు కచ్చితంగా హజరు కావాలి.
సోమవారం ప్రారంభమయ్యే ప్రజావాణి కార్యక్రమం కోసం తిమ్మాపూర్ ఎంపీడీవో కార్యాలయంలో సిబ్బంది అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వచ్చిన ప్రతి అర్జీని కంప్యూటర్‌లో నమోదు చేసి, ఆర్జీదారుడికి ఎకనాలెడ్జ్‌మెంట్ ఇస్తారు. సమస్య తీవ్రతను బట్టి 7 నుంచి 15 రోజుల్లోపు సమస్యలను పరిష్కరించి, ఆ వివరాలను అర్జీదారుడికి పంపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.