Karimnagar : విద్యుత శాఖలో నిలిచిన పెన్షన్లు
ABN , Publish Date - Jun 08 , 2026 | 01:10 AM
గణేశనగర్, జూన 7 (ఆంధ్రజ్యోతి): విద్యుత శాఖలో సాధారణంగా ప్రతి నెల ప్రారంభంలోనే జీతాలు, పెన్షన్లు చెల్లిస్తారు. ఈ నెలలో 6వ తేదీ వచ్చినా పెన్షన నిధులు జమ కాకపోవడం పెన్షనర్లు తీవ్ర ఆందోళనకు గురి ఆవుతున్నారు.
- ఆందోళనలో వేలాది మంది పెన్షనర్లు
- మందులు, నిత్యావసరాల కోసం ఇబ్బందులు
- తక్షణమే విడుదల చేయాలని డిమాండ్
గణేశనగర్, జూన 7 (ఆంధ్రజ్యోతి): విద్యుత శాఖలో సాధారణంగా ప్రతి నెల ప్రారంభంలోనే జీతాలు, పెన్షన్లు చెల్లిస్తారు. ఈ నెలలో 6వ తేదీ వచ్చినా పెన్షన నిధులు జమ కాకపోవడం పెన్షనర్లు తీవ్ర ఆందోళనకు గురి ఆవుతున్నారు. విద్యుత శాఖ చరిత్రలో ఎన్నడూ లేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీజీఎస్పీడీసీఎల్, టీజీఎన్పీడీసీఎల్, ట్రాన్సకో, జెనకో సంస్థల పరిధిలోని పెన్షనర్లు ఎనిమిది రోజులుగా పెన్షన్లు రాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెన్షన్లపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వృద్ధులు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు మందులు కొనలేక, నిత్యావసర ఖర్చులు డబ్బులు లేక కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెన్షన్లు ఆలస్యమవడంతోతీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.
ఫ ఉద్యోగులకు జీతం ఇచ్చి.. పెన్షనర్లకు ఆపివేసి..
విద్యుత శాఖలో సాధారణంగా పెన్షనర్లకు ప్రాధాన్యమిస్తూ చెల్లింపులు జరిపే విధానం ఉండగా, ఈసారి పరిస్థితి భిన్నంగా కనిపిస్తోందని ఉద్యోగ, పెన్షనర్ల వర్గాలు పేర్కొంటున్నాయి. ఉద్యోగులకు జీతాలు చెల్లించినప్పటికీ పెన్షనర్లకు నిధులు విడుదల కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ అంశంపై కరీంనగర్ విద్యుత శాఖ పెన్షనర్ల సంక్షేమ సంఘం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సంఘం అధ్యక్షుడు చీటి ప్రకాశరావు, ప్రధాన కార్యదర్శి మహ్మద్ మక్బూల్ హుస్సేన మాట్లాడుతూ, విద్యుత శాఖ చరిత్రలో ఇంతటి ఆలస్యం ఎప్పుడూ జరగలేదన్నారు. వృద్ధుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పెన్షన నిధులను అత్యవసర ప్రాతిపదికన వెంటనే విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. పెన్షనర్ల సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత శాఖ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి పరిష్కారం చూపాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సంఘం డిమాండ్ చేసింది.