Share News

Karimnagar: పెండింగ్‌ కేసులు పరిష్కరించాలి...

ABN , Publish Date - May 21 , 2026 | 11:17 PM

కరీంనగర్‌ క్రైం, మే 21 (ఆంధ్రజ్యోతి): పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో పెండింగ్‌ కేసులను సత్వరమే పరిష్కరించాలని పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలం ఆదేశించారు.

Karimnagar:   పెండింగ్‌ కేసులు పరిష్కరించాలి...

- నేర సమీక్షా సమావేశంలో సీపీ గౌస్‌ ఆలం

కరీంనగర్‌ క్రైం, మే 21 (ఆంధ్రజ్యోతి): పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో పెండింగ్‌ కేసులను సత్వరమే పరిష్కరించాలని పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలం ఆదేశించారు. కమిషనరేట్‌ కేంద్రంలోని కాన్ఫరెన్స్‌ హాలులో సీపీ గౌస్‌ ఆలం అధ్యక్షతన నెలవారీ నేర సమీక్షా సమావేశం గురువారం నిర్వహించారు. సమావేశంలో పోలీసు అధికారులు తమ పరిధిలోని పెండింగ్‌ కేసుల డైరీలను సమర్పించి, కేసుల పురోగతిని వివరించారు. 2024 వరకు పెండింగ్‌లో ఉన్న పాత కేసులు, ఈ ఏడాది నమోదైన తీవ్రమైన నేరాల స్థితిగతులను సమీక్షించారు. ఈ సందర్భంగా సీపీ గౌస్‌ ఆలం మాట్లాడుతూ ఆస్తి సంబంధిత నేరాలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, పోక్సో చట్టం కింద నమోదైన కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేయాలన్నారు. వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల వద్ద రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. నగరంలో విజిబుల్‌ పోలీసింగ్‌ స్పష్టంగా కనిపించాలని, రాత్రి పగలు తేడా లేకుండా పెట్రోలింగ్‌ మరింత సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. కమిషనరేట్‌ వ్యాప్తంగా వివిధ రంగాల్లో పనిచేస్తున్న వెయ్యి మందికి పైగా ఉన్న నేపాలీల వివరాలను పోలీస్‌ స్టేషన్ల వారీగా రిజిస్టర్లలో నమోదు చేయాలన్నారు. కమ్యూనిటీ కాంటాక్ట్‌ ప్రోగ్రాం ద్వారా గ్రామాలు, వార్డులను సందర్శించి ప్రజలతో మమేకం కావాలని, సైబర్‌ నేరాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. మహిళా పోలీస్‌ సిబ్బందికి బ్లూ కోల్ట్స్‌ విధులను కేటాయించాలని అధికారులను సీపీ ఆదేశించారు. సమావేశంలో ట్రైనీ ఐపీఎస్‌ సోహం సునీల్‌, అదనపు డీసీపీ వెంకటరమణ, ఏసీపీలు శ్రీనివాస్‌, వేణుగోపాల్‌, శ్రీనివాస్‌ జి, విజయకుమార్‌, వెంకటస్వామి, మాధవి, సతీష్‌, ప్రతాప్‌, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Updated Date - May 21 , 2026 | 11:17 PM