Share News

Karimnagar : నిషేధిత జాబితాలో పట్టా భూములు

ABN , Publish Date - May 16 , 2026 | 12:35 AM

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌) కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని రేకుర్తి, విద్యానగర్‌, కొత్తపల్లి ప్రాంతాల్లోని వందల ఎకరాల పట్టాభూములు, నివేశన స్థలాలు, ఇళ్లు, వాణిజ్య సముదాయాలను అధికారులు 2025 జూలై మాసంలో 22/ఎ(1)(డి)నిషేధిత

Karimnagar :  నిషేధిత జాబితాలో పట్టా భూములు

- ఆందోళనలో రేకుర్తి, విద్యానగర్‌, కొత్తపల్లి వాసులు

- రాస్తారోకోలు, ఆందోళనలు చేసినా ఫలితం శూన్యం

- 22/ఏ జాబితా నుంచి తొలగించాలని బాధితుల డిమాండ్‌

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని రేకుర్తి, విద్యానగర్‌, కొత్తపల్లి ప్రాంతాల్లోని వందల ఎకరాల పట్టాభూములు, నివేశన స్థలాలు, ఇళ్లు, వాణిజ్య సముదాయాలను అధికారులు 2025 జూలై మాసంలో 22/ఎ(1)(డి)నిషేధిత సీలింగ్‌ యాక్టులో చేర్చి క్రయ, విక్రయాలను, ఇళ్ల నిర్మాణ అనుమతులను పూర్తిగా నిలిపివేశారు. దీనితో చేయని తప్పులకు ఆ ప్రాంత వాసులు శిక్ష అనుభవిస్తున్నారు. తమ ఆధీనంలోని భూములన్నీ ప్రభుత్వ ఆక్రమిత భూములు కాదని, డబ్బులు పెట్టి కొనుగోలు చేసుకొని ప్రభుత్వానికి చార్జీలు చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకున్నామని, ఈ భూము లను ఇప్పటికే చాలా మంది క్రయవిక్రయాలు జరుపడంతో ప్రభుత్వానికి లక్షల్లోనే ఆదాయం సమకూరిందని, ప్లాట్లు కొనుగోలు చేసి పర్మిషన్‌ ఫీజులు చెల్లించి గతంలో గ్రామపంచాయతీ, ఆ తర్వాత నగరపాలక సంస్థ నుంచి ఇళ్ల నిర్మాణాలకు అనుమతి తీసుకొని ఇళ్లు నిర్మించుకొని క్రమం తప్పకుండా ఆస్తిపన్నులను (ఇంటిపన్నులను), నల్లా బిల్లులను చెల్లిస్తున్నామని, విద్యుత్‌ బిల్లులు చెల్లిస్తున్నామని, ఇప్పుడు ఈ భూములను 22/ఏ జాబితాలో చేర్చి నిషేధిత భూములుగా క్రయ, విక్రయాలు నిలిపివేయడమేమిటనీ ఈ ప్రాంత ప్రజలు, 22/ఎ బాధితులు వాపోతు న్నారు. రేకుర్తి, విద్యానగర్‌కు సంబంధించిన సర్వేనెంబర్‌లోని 536 ఎకరాలు, విద్యానగర్‌లోని మరో 16 సర్వే నెంబర్లలోని 115 ఎకరాలతో పాటు కొత్తపల్లి ప్రాంతంలోని భూములు కొన్ని, వందలాది ఎకరాల పట్టాభూములు, సుమారు 10వేల ప్లాట్లు, దాదాపు 5వేల పైచిలుకు ఇండ్లు రిజిస్ట్రేషన్‌ చేయకుండా నిషేధిత చట్టమైన 22/ఎలో చేర్చడంతో అక్కడి ప్రజలు పడుతున్న కష్టాలు ఇంతా అంతా కాదు. దాదాపు ఏడాది కాలంగా భూములు, ప్లాట్లు, ఇళ్ళ క్రయ విక్రయాలను నిలిపివేయడంతో ఆడపిల్లల పెళ్ళిళ్లు, పిల్లల చదువులను కొనసాగించేందుకు అనేక ఇబ్బం దులు పడుతున్నారు. దాదాపు 30, 40 సంవత్సరాలుగా క్రయవిక్రయాలు జరుగుతుంటే మధ్యలో ఒకటిరెండు సార్లు ఇలాగే నిషేధిత జాబితాలో ఈ ప్రాంత భూములను చేర్చగా ఆనాడు న్యాయస్థానం నిషేధిత జాబితా నుంచి వీటిని తొలగించాలని ఆదేశించడంతో బ్యాంకులు, ప్రైవేట్‌ వ్యాపార, ఆర్థిక సంస్థలు ఈ భూములను, ఇళ్లను మార్టిగేజ్‌ చేసుకొని అప్పులు కూడా ఇస్తున్నాయి. బ్యాంకుల లీగల్‌ అడ్వయిజర్లు కూడా ఈ భూములకు క్లియరెన్సు ఇచ్చారు. మళ్లీ నిషేధిత జాబితాలోకి చేర్చడంతో అటు అమ్ముకోలేక, ఇటు అప్పులు తీసుకోలేక మా అవసరాల నుంచి గట్టేక్కెందుకు అష్టకష్టాలు పడుతున్నామని బాధితులు పేర్కొంటున్నారు.

ఫ ఎనిమిది నెలలుగా మంత్రులు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు :

రేకుర్తి, విద్యానగర్‌, కొత్తపల్లి భూములను నిషేధిత జాబితాలో చేర్చడంతో ఎనిమిది నెలలుగా బాధితులు మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్‌, ఇతర అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. న్యాయమైన ఈ సమస్యకు పరిష్కారం లభించే వరకు పోరాడేందుకు బాధితుల సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. బాధిత సంఘం ఐక్యవేదిక కన్వీనర్‌గా పాశం మోహన్‌రెడ్డి, సభ్యులుగా మాజీ కార్పొరేటర్‌ ఎదుల్ల రాజశేఖర్‌, శ్యామ్‌సుందర్‌, ఆకుల కృష్ణ, పచ్చునూరి నరేందర్‌, భూపతిరవికుమార్‌, సురేందర్‌, శ్రీనివాస్‌, రవికుమార్‌, మహ్మద్‌ రహీం ఏర్పడిన ఈ సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో, ర్యాలీ, ధర్నాలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌కు తమగోడును వినిపించారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, ఎంపీ, కేంద్రమంత్రి బండి సంజయ్‌కుమార్‌, రాష్ట్రమంత్రులు పొన్నం ప్రభాకర్‌, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్‌ మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌, కమిషనర్‌ ప్రఫుల్‌దేశాయ్‌, సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డికి కార్పొరేటర్లు వరాల నర్సింగం, కాంతాల జగన్‌రెడ్డి, పర్వాత మల్లేశంతో కలిసి వెళ్లి వినతిపత్రాలు సమర్పించారు. ఎవరిని కలిసినా తమకు న్యాయం దక్కడం లేదని వాపోతున్నారు.

ఫ 22/ఏ నిషేధిత చట్టం నుంచి తొలగించకుంటే ఆత్మహత్యలే శరణ్యం

- బాధిత సంఘం ఐక్యవేదిక కన్వీనర్‌ పాశం మోహన్‌రెడ్డి

రేకుర్తి, విద్యానగర్‌, కొత్తపల్లి ప్రాంతంలోని వందలాది ఎకరాల భూములు, ప్లాట్లు, ఇళ్లపై ఉన్న 22/ఏ నిషేధిత చట్టాన్ని వెంటనే ఎత్తివేయాలి. లేనిపక్షంలో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. అధికారులు, ప్రజాప్రతినిధులను కలిస్తే పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారే తప్ప చట్టం ఎత్తివేయడం లేదు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తమ సమస్యకు వెంటనే పరిష్కారం జరిగేలా చూడాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు విన్నవించాం.

Updated Date - May 16 , 2026 | 12:35 AM