Share News

Karimnagar: మా వాళ్లు గుణవంతులు.. వాళ్లు ధనవంతులు

ABN , Publish Date - Feb 05 , 2026 | 12:04 AM

భగత్‌నగర్‌, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): బీజేపీ తరుపున పోటీ చేసే అభ్యర్థులు గుణవంతులైతే, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులు ధనవంతులని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు.

 Karimnagar:  మా వాళ్లు గుణవంతులు.. వాళ్లు ధనవంతులు

- కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌

భగత్‌నగర్‌, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): బీజేపీ తరుపున పోటీ చేసే అభ్యర్థులు గుణవంతులైతే, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులు ధనవంతులని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. నగరంలోని రాంనగర్‌, కమాన్‌ చౌరస్తా వద్ద ఎన్నికల ప్రచారంలో భాగంగా స్ట్రీట్‌ కార్నర్‌ మీటింగ్‌లు బుధవారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ వాళ్లు సమస్యలపై పోరాటం చేసి జైలుకు పోతే, ఆ పార్టీల నాయకులు కబ్జాలు, దోపిడీలు చేసి జైలు కెళ్లారని, బోత్‌ ఆర్‌ నాట్‌ సేమ్‌ అని అన్నారు. కరీంనగర్‌ లో మేయర్‌ పీఠాన్ని బీజేపీకి అప్పగిస్తే నిధులు వరదల్లా తెచ్చే బాధ్యత తనదన్నారు. కరీంనగర్‌లో జరిగిన అభివృద్ధి పనులన్నీ స్మార్ట్‌ సిటీ నిధులతో చేసినవేనన్నారు. కరీంనగర్‌ మేయర్‌ పీఠాన్ని బీజేపీకి అప్పగిస్తే ప్రతినిత్యం తాగునీరు అందిస్తామన్నారు. 46 డివిజన్‌లో అఖిల్‌గౌడ్‌, 47వ డివిజన్‌లో గాజ రమను, 38వ డివిజన్‌లో దేవసాని సరస్వతి, 56వ డివిజన్‌లో తాటి ప్రభావతి, 57వ డివిజన్‌లో కొలిపాక రమ్యశ్రీలను భారీ మెజారిటీతో గెలిపిస్తే పెండింగ్‌ పనులన్నీ పూర్తి చేయిస్తామన్నారు. సత్యనారాయణ స్వామి ఆలయంలో అన్నీ రాజకీయాలే నడుస్తున్నాయన్నారు. బీజేపీకి మేయర్‌ పీఠాన్ని అప్పగిస్తే సత్యానారాయణ స్వామి ఆలయం వద్ద ధ్వజ స్తంభం ఏర్పాటు చేస్తామన్నారు. మోదీ ప్రభుత్వం ఇచ్చిన 26 కోట్లతోనే అంబేద్కర్‌ స్టేడియాన్ని ఆధునీకరించామన్నారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో ఎంత దోచుకున్నరో రెండేళ్ల కాంగ్రెస్‌ పాలనలో అంతకంటే ఎక్కువ దోచుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ ను గెలిపిస్తే ఇంటి పన్నులు పెంచుతారన్నారు. బీఆర్‌ఎస్‌ గెలిచినా ప్రయోజనం లేదని తెలిపారు. కార్యక్రమంలో మాజీ మేయర్‌ సునీల్‌రావు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జె సంగప్ప, సీనియర్‌ నాయకులు నల్లాల ఓదెలు, ప్రమోద్‌రావు, యువక్రాంతి, రవీందర్‌, డివిజన్‌ అభ్యర్థులు అఖిల్‌గౌడ్‌, గాజె రమాశివరాం, దేవసాని సరస్వతి, తాటి ప్రభావతి, కొలిపాక రమ్యశ్రీ పాల్గొన్నారు.

Updated Date - Feb 05 , 2026 | 12:04 AM