Karimnagar: ‘ఆపరేషన్ స్మైల్-12’ విజయవంతం
ABN , Publish Date - Jan 31 , 2026 | 11:58 PM
కరీంనగర్ క్రైం, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆపరేషన్ స్మైల్-12 కార్యక్రమం విజయవంతమైందని జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యుసీ) చైర్ పర్సన్ ధనలక్ష్మి తెలిపారు.
- జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) చైర్‌పర్సన్ ధనలక్ష్మి
కరీంనగర్ క్రైం, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆపరేషన్ స్మైల్-12 కార్యక్రమం విజయవంతమైందని జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యుసీ) చైర్ పర్సన్ ధనలక్ష్మి తెలిపారు. శనివారం కరీంనగర్ బాలరక్ష భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ... పోలీసు, లేబర్, ఛైల్డ్‌హెల్ప్‌లైన్-1098, సమగ్ర బాలల పరిరక్షణ పథకం(ఐసీపీఎస్), స్వచ్ఛంద సంస్థల సహకారంతో జనవరి 1 నుండి 31వ తేదీ వరకు ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. నెల రోజులు తనిఖీలు నిర్వహించిన వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్న 117 మంది బాలబాలికలను చేరదీసి, వారి తల్లిదండ్రులకు అప్పగించామని చెప్పారు. చిన్నారుల జీవితాల్లో వెలుగు నింపుతూ, బాల కార్మికులు లేని జిల్లాగా మార్చడమే లక్ష్యంగా ఆపరేషన్ స్మైల్ నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో నాలుగు బృందాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి టీంలో ఒక ఎస్సై, ఏఎస్సై, నలుగురు కానిస్టేబుళ్లు, సమగ్ర బాలల పరిరక్షణ పథకం సిబ్బంది, చైల్డ్ హెల్ప్‌లైన్-1098 ప్రతినిధి, లేబర్ ఆఫీసర్ సంయుక్తంగా తనిఖీలను నిర్వహించారన్నారు. జిల్లాలో 117 మంది పిల్లలను రెస్క్యూ చేశామని తెలిపారు. ఇందులో బాలురు-109, బాలికలు ఎనిమిది మందిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ప్రవేశపెట్టినట్లు ఛైర్‌పర్సన్ తెలిపారు. వారికి కౌన్సెలింగ్ నిర్వహించి 18 సంవత్సరాలలోపు పిల్లలు పని చేయడం చట్టరీత్యా నేరమని తెలియజేసి, పిల్లలను బంధువులతో, వారి తల్లిదండ్రులతో స్వస్థలాలకు పంపించామన్నారు. బాల బాలికలను పనిలోపెట్టుకున్న సంబంధిత యాజమాన్యాలపై అధికారులకు ఫిర్యాదు చేయగా పోలీసులు 30 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారని తెలిపరు. లేబర్ అదికారులు 98 మంది పిల్లలకు యజమానుల నుంచి కనీస వేతనాలు ఇప్పించారని తెలిపారు. సమావేశంలో కమిటీ సభ్యులు రేండ్ల కళింగశేఖర్, కే విజయ్ కుమార్, రాధ, అర్చనరెడ్డి పాల్గొన్నారు.