Share News

karimnagar : ఇక ప్రత్యామ్నాయమే..

ABN , Publish Date - Jul 27 , 2026 | 12:48 AM

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌) వానాకాలం సాగుపై ఆశలు సన్నగిల్లుతున్నాయి.

karimnagar :  ఇక ప్రత్యామ్నాయమే..

- రైతులకు అవగాహన కల్పించే ప్రయత్నాలు

- నేటి నుంచి మూడు రోజులు విత్తన మేళాలు

- జిల్లాలో 42 శాతం లోటు వర్షపాతం..

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

వానాకాలం సాగుపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఎల్‌నినో కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ప్రధాన పంటలైన వరి, పత్తి, మొక్కజొన్న సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల కురిసిన చెదురుముదురు వానలతో వేసిన పత్తి పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నా వరి నాట్లు మాత్రం ముందుకు సాగడం లేదు. ఇప్పటికే 42 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఇది రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు.

ఫ తక్కువ నీటితో సాగయ్యే పంటలపై దృష్టి

జిల్లావ్యాప్తంగా సాధారణంగా ప్రతి యేటా వానాకాలంలో 2.79 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తారు. ఈసారి వరి సాగయ్యే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ప్రత్యామ్నాయ సాగే దిక్కయ్యే పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం రైతులకు ప్రత్యామ్నాయ సాగుపై అవగాహన కల్పిస్తూ వారిని ఆ దిశగా ప్రోత్సహిస్తున్నది. తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలనే సాగు చేయాలని సూచిస్తున్నారు. చిరు ధాన్యాలు, పప్పుధాన్యాలు, నువ్వులు, ఆముదం, కూరగాయల పంటలు సాగుచేయాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.

ఫ రైతు వేదికల్లో అవగాహన సదస్సులు

ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సాగు చేయాల్సిన పంటలను ఎంపిక చేసుకొని నిపుణుల సలహాలను పొందేందుకు అన్ని మండల కేంద్రాలలోని రైతు వేదికలలో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. సోమ, మంగళ, బుధవారాల్లో రైతు వేదికల్లో ప్రత్యామ్నాయ పంటలుగా సాగు చేసే విత్తనాలను అందుబాటులో ఉంచి విత్తన మేళాలు నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. విత్తనాలను అందుబాటులో ఉంచడంతోపాటు ఆయా సాగు విధానాలను విత్తనాలు, ఎరువుల వినియోగం, నీటి యాజమాన్యం, తెగుళ్ల నివారణకు అవసరమయ్యే సలహాలు, సూచనలను ఇచ్చి ఈ మేళాల్లో ప్రత్యామ్నాయ సాగుపై అవగాహన కల్పించడానికి వ్యవసాయశాఖ ఏర్పాట్లు చేసింది.

ఫ 55 రోజుల్లో 187.8 మిల్లీలీటర్లే..

జిల్లాలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన తర్వాత గడిచిన 55 రోజుల్లో 325.9 మిల్లీమీటర్ల వర్షం కురువాల్సి ఉండగా 187.8 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. 55 రోజుల్లో 16 రోజుల్లో మాత్రమే అక్కడక్కడ అడపాదడపా వర్షాలు కురవడంతో ఆ కొద్దిపాటి వర్షపాతం నమోదైంది. ఇప్పటికీ జలవనరుల్లోకి, బావుల్లోకి నీరు రాలేదు. భూగర్భ జలాలు పెరుగలేదు. దీంతో వానా కాలం సాగుకు అనువైన పరిస్థితులు లేకుండా పోయాయి.

ఫ వెలవెలబోతున్న ప్రాజెక్టులు

జిల్లాకు ప్రధాన సాగునీటి వనరైన శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులో 80.5 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికిగాను 15.8 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. కనీసం 40 టీఎంసీల నీరు ఉంటే కానీ ఒక సీజన పంటలు చేతికి వచ్చే అవకాశం లేదు. అవసరమున్నపుడు వరద కాలువ ద్వారా మధ్య మానేరుకు, దాని నుంచి ఎల్‌ఎండీకి నీరందించే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో 20.17 టీఎంసీల నీటికి గాను 8.07 టీఎంసీల నీరు మాత్రమే ఉన్నది. మధ్య మానేరు రిజర్వాయర్‌లో 27.5 టీఎంసీలకు గాను 7.45 టీఎంసీల నీరు, లోయర్‌ మానేరు డ్యామ్‌లో 24.03 టీఎంసీల నీటికి గాను 5.46 టీఎంసీల నీరు మాత్రమే నిలువ ఉన్నది.

ఫ 60 వేల ఎకరాల్లోనే వరినాట్లు

వానాకాలం సీజనలో 2.79 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగాల్సి ఉండగా బావులు, బోరుబావుల కింద 60 వేల ఎకరాల్లో మాత్రమే నాట్లు వేశారు. 48 వేల ఎకరాల్లో పత్తిసాగు చేయాల్సి ఉండగా 40 వేల పైచిలుకు ఎకరాల్లో సాగు జరిగింది. అందులో నాలుగో వంతు విస్తీర్ణంలో పత్తి విత్తనాలు మొలకెత్తక పోవడం, మొలకెత్తి ఎండిపోవడంతో రైతులు మళ్లీ విత్తనాలు వేయాల్సి వచ్చింది. ఇటీవల కురిసిన ఒకటిరెండు చిన్నపాటి వానల కారణంగా పత్తి చేలకు మళ్లీ జీవం వచ్చింది. 15 రోజుల వరకు ఈ పంటకు ఎలాంటి ఇబ్బంది లేకున్నా ఇదే వర్షాభావ పరిస్థితులు నెలకొంటే పత్తి చేలు దక్కే అవకాశమే లేదని భావిస్తున్నారు. 4,500 ఎకరాల్లో మొక్కజొన్న సాగుకుగాను 2,700 ఎకరాల్లో మాత్రమే రైతులు సాగు చేశారు. బావుల కింద వీటిని కాపాడుకుంటూ వస్తున్నా అటు వరి, ఇటు మొక్కజొన్న వేసిన వారికి ఇదే వర్షాభావ పరిస్థితులు కొనసాగితే ఏదో ఒక పంటను వదిలేసుకోవలసిన పరిస్థితులు వస్తాయి. సెప్టెంబరులో ఎల్‌నినో కారణంగా వేడి మరో 3.4 డిగ్రీలు పెరిగే అవకాశాలున్నాయని, దీంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ సాగు తప్ప మార్గం లేదని అంటున్నారు.

Updated Date - Jul 27 , 2026 | 12:48 AM