Share News

Karimnagar: సహజ ప్రసవమే శ్రేయస్కరం...

ABN , Publish Date - Nov 22 , 2026 | 11:52 PM

సుభాష్‌నగర్‌, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): సహజ ప్రసవమే శ్రేయస్కరమని...తల్లిబిడ్డలకు ఆరోగ్యకరమని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ రాజగోపాల్‌ అన్నారు.

Karimnagar: సహజ ప్రసవమే శ్రేయస్కరం...
జెండా ఊపి ర్యాలీని ప్రారంభిస్తున్న డీఎంహెచ్‌వో డాక్టర్‌ రాజగోపాల్‌రావు

- డీఎంహెచ్‌వో డాక్టర్‌ రాజగోపాల్‌

సుభాష్‌నగర్‌, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): సహజ ప్రసవమే శ్రేయస్కరమని...తల్లిబిడ్డలకు ఆరోగ్యకరమని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ రాజగోపాల్‌ అన్నారు. కోతిరాంపూర్‌ ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాలలో సొసైటీ ఆఫ్‌ మిడ్‌వైవ్స్‌ ఇండియా(సోమీ) ఆధ్వర్యంలో జాతీయస్థాయిలో నిర్వహించిన వాక్‌ఫర్‌ నేచురల్‌ బర్తింగ్‌ సహజ ప్రసవ అవగాహన కార్యక్రమాన్ని డీఎంహెచ్‌వో ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహజ ప్రసవాలను ప్రోత్సహించడం ద్వారా తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని కాపాడవచ్చని అన్నారు. వైద్యపరంగా అవసరంలేని సిజేరియన్లను నివారించాలని సూచించారు. సహజ ప్రసవాలపై గర్భిణులు, ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా మిడ్‌వైవ్స్‌ కీలకపాత్ర పోషించాలన్నారు. పుట్టిన బిడ్డకు తల్లిపాలను త్వరగా పట్టేందుకు సహజ ప్రసవం దోహదపడతుందన్నారు. వైద్యపరంగా సిజేరియన్‌ అవసరమైన సందర్భాల్లో ఆ విధానాన్ని అనుసరించడం తప్పనిసరి అని, అవసరం లేనపుడు అనవసరమైన శస్త్రచికిత్సలను నివారించాలని సూచించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్‌, సోమీ కో ఆర్డినేటర్‌ లిల్లీమేరి మాట్లాడుతూ గర్భిణులకు సహజ ప్రసవంపై అవగాహన కల్పించడం ఎంతో అవసరమన్నారు. నర్సింగ్‌ విద్యార్థినులు భవిష్యత్‌లో వైద్యసేవల్లో భాగంగా తల్లులకు సరైన మార్గదర్శత్వం, మానసిక దైర్యం అందించాలని సూచించారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ ఉమామహేశ్వరి, సోమీ టీమ్‌ సభ్యురాలు సుజాత, ఎన్‌ఎస్‌ఎస్‌ బృందం, నర్సింగ్‌ విద్యార్థినులు పాల్గొన్నారు.

Updated Date - Nov 22 , 2026 | 11:52 PM