Share News

Karimnagar: స్థానికంగా ఉండి విధులు నిర్వహించాలి

ABN , Publish Date - Apr 24 , 2026 | 12:33 AM

కరీంనగర్‌ టౌన్‌, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): వేసవి దృష్ట్యా నగరంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ఈఈ, డీఈ, ఏఈ, నీటి సరఫరా విభాగంలో పని చేసే ఉద్యోగులంతా స్థానికంగా ఉండి విధులు నిర్వహించాలని

Karimnagar:  స్థానికంగా ఉండి విధులు నిర్వహించాలి

- మంచినీటి సరఫరా విషయంలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు

- మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌

కరీంనగర్‌ టౌన్‌, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): వేసవి దృష్ట్యా నగరంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ఈఈ, డీఈ, ఏఈ, నీటి సరఫరా విభాగంలో పని చేసే ఉద్యోగులంతా స్థానికంగా ఉండి విధులు నిర్వహించాలని మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ ఆదేశించారు. స్థానికంగా ఉండి విధులను నిర్వహించని ఉద్యోగులను సరెండర్‌ చేస్తామని, నీటి సరఫరా విషయంలో నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. గురువారం కోర్టు రిజర్వాయర్‌ ఆవరణలో హైలెవల్‌ జోన్‌ పరిధిలోని కార్పొరేటర్లు, ఇంజనీరింగ్‌ అధికారులు, నీటి నిర్వహణ విభాగం ఉద్యోగులతో మంచినీటి సరఫరాపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ జూన్‌, జూలై వరకు మంచినీటి సరఫరాపై ప్రత్యేక దృష్టిసారించాలని అన్నారు. పాలకవర్గసభ్యులు తెలిపిన సమస్యలన్నింటిని పరిష్కరించాలని ఆదేశించారు. సమయపాలనతో నీటి సరఫరా చేయాలన్నారు. ప్రజలు, కార్పొరేటర్ల నుంచి ఎలాంటి ఫిర్యాదు వచ్చినా వెంటనే పరిశీలించి పరిష్కరించాలని మేయర్‌ ఆదేశించారు. లైన్‌మెన్లు, ఫిట్టర్లు, ఇంజనీర్లు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ప్రజలతో దురుసుగా మాట్లాడినట్లు తమ దృష్టికి వస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కోర్టు నుంచి సుభాష్‌నగర్‌ వరకు నూతన పనులకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. 60 మందిని తాత్కాలిక విధులను నిర్వహించేందుకు విధుల్లోకి తీసుకున్నామని, ఎక్కడ లీకేజీలు ఉన్నా వెంటనే వాటిని గుర్తించి మరమ్మతులు చేయించాలని అన్నారు. సమావేశంలో కార్పొరేటర్లు బోయినపల్లి ప్రవీణ్‌రావు, వైద్యుల అంజన్‌కుమార్‌, గంట శ్రీనివాస్‌, బండ రమణారెడ్డి, ఒంటెల సత్యనారాయణరెడ్డి, చాడగొండ కవిత బుచ్చిరెడ్డి, సరిళ్ల రాజకుమారిప్రసాద్‌, గాజ రమశివరాం, ఎన్నం లక్ష్మిప్రకాశ్‌, పెద్దపల్లి శ్రీలేఖజితేందర్‌, ఎస్‌ఈ రాజ్‌కుమార్‌, ఈఈ సంజీవ్‌కుమార్‌, డీఈలు, ఏఈలు, లైన్‌మెన్లు, ఫిట్టర్లు పాల్గొన్నారు.

Updated Date - Apr 24 , 2026 | 12:33 AM