Karimnagar: ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలి
ABN , Publish Date - Jul 09 , 2026 | 11:59 PM
కరీంనగర్ టౌన్, జూలై 9 (ఆంధ్రజ్యోతి): గ్రామాల సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తూ ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషిచేయాలని
కరీంనగర్ టౌన్, జూలై 9 (ఆంధ్రజ్యోతి): గ్రామాల సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తూ ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషిచేయాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అశ్విని తానాజీ వాఖడే సర్పంచులు, కార్యదర్శులకు సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక గ్రామపంచాయతీల సమగ్ర అభివృద్ధి ప్రణాళికపై సర్పంచులు, కార్యదర్శులకు అవగాహన శిక్షణ కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ గ్రామ పంచాయతీలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులపైనే ఆధారపడకుండా సొంత ఆదాయ వనరులను అభివృద్ధి చేసుకునే దిశగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. గ్రామాల ఆర్థిక స్వావలంబన పెరిగితేనే స్థిరమైన అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రభుత్వాలు మంజూరు చేస్తున్న నిధులతో గ్రామాలను అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన వీబీ జీరామ్‌జీ పథకం ద్వారా 318 రకాల అభివృద్ధి పనులు చేపట్టే అవకాశముందన్నారు. ఈ అవకాశాన్ని సర్పంచులు, కార్యదర్శులు వినియోగించుకొని గ్రామాల్లో మౌలిక వసతులు, ప్రజా సౌకర్యాలను మెరుగుపరచాలని సూచించారు. పంచాయతీరాజ్ చట్టం, గ్రామ పంచాయతీల విధులు, బాధ్యతలపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలన్నారు. గ్రామ పంచాయతీ ప్రొఫైల్ తయారీ, ఆదాయ వనరుల గుర్తింపు, రానున్న మూడు సంవత్సరాలకు సమగ్ర అభివృద్ధి ప్రణాళిక రూపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. నిబద్ధతతో పనిచేస్తే ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దవచ్చన్నారు. పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ అనిల్‌కుమార్ మాట్లాడుతూ ఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద అమలు చేస్తున్న వీబీజీ రామ్‌జీ పథకం ద్వారా గ్రామాల్లో అనేక అభివృద్ధి పనులు చేపట్టవచ్చని అన్నారు. ప్రభుత్వ నిధులతోపాటు గ్రామాల ఆదాయాన్ని పెంచుకునే చర్యలు తీసుకోవాలని చెప్పారు. జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్ మాట్లాడుతూ సర్పంచులు, కార్యదర్శులు సమన్వయంతో పనిచేస్తే గ్రామాల అభివృదిఽ్ద వేగవంతమవుతుందని అన్నారు. కార్యక్రమంలో పంచాయతీ రాజ్ డిప్యూటీ కమిషనర్ కె అనిల్‌కుమార్, జడ్పీ సీఈవో పవన్‌కుమార్, డీఆర్‌డీవో గీత, పంచాయతీరాజ్ డీఈ జనార్దన్ పాల్గొన్నారు.