Share News

Karimnagar: టీటీడీ ‘శ్రీవారి’ ఆలయ నిర్మాణానికి ముహూర్తం ఖరారు

ABN , Publish Date - Oct 12 , 2026 | 12:09 AM

కరీంనగర్‌ టౌన్‌, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని పద్మనగర్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో నిర్మించనున్న వేంకటేశ్వరస్వామి ఆలయ పనులకు ముహూర్తం ఖరారైంది.

 Karimnagar: టీటీడీ ‘శ్రీవారి’ ఆలయ నిర్మాణానికి ముహూర్తం ఖరారు

- 17న మూల నక్షత్రం రోజున పనులు ప్రారంభం

- టీటీడీ అధికారులతో కలిసి స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే గంగుల

కరీంనగర్‌ టౌన్‌, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని పద్మనగర్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో నిర్మించనున్న వేంకటేశ్వరస్వామి ఆలయ పనులకు ముహూర్తం ఖరారైంది. స్వామివారి జన్మనక్షత్రం మూల నక్షత్రం రోజున ఈనెల 17న పనులను ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించారు. దీంతో ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ టీటీడీ అధికారులతో కలిసి ఆదివారం ఆలయ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి ఆలయాన్ని నిర్మించాలనే సంకల్పంతో తాను మంత్రిగా ఉన్న సమయంలో టీటీడీ అనుమతులు పొందామన్నారు. 10 ఎకరాల ప్రభుత్వ భూమిని టీటీడీ పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించామని తెలిపారు. 2023 మే 31న ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేశామని గుర్తుచేశారు. ఆ వెంటనే టెండర్లు నిర్వహించి పనులు ప్రారంభించాల్సి ఉండగా సార్వత్రిక ఎన్నికలు రావడంతో పనులు నిలిచిపోయాయన్నారు. ప్రస్తుతం నిర్మాణ పనులు ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తవుతున్నాయన్నారు. ఈనెల 17న ఉదయం 9 గంటలలోపు పనులకు శ్రీకారం చుడతామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ మేయర్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్‌, బీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షుడు హరిశంకర్‌, నాయకులు పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్‌, కార్పొరేటర్లు, పలువురు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

-

Updated Date - Oct 12 , 2026 | 12:09 AM