Share News

Karimnagar : మోదం.. ఖేదం

ABN , Publish Date - Feb 02 , 2026 | 02:01 AM

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌) కేంద్ర ఆర్థికశాఖమంత్రి నిర్మలాసీతారామన ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై జిల్లాలో మిశ్రమ స్పందన వ్యక్తమయ్యింది.

 Karimnagar :   మోదం.. ఖేదం

- టైర్‌-2, టైర్‌-3 నగరాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు

- కేంద్ర బడ్జెట్‌పై మిశ్రమ స్పందన

- హర్షం వ్యక్తం చేస్తున్న బీజేపీ

- పెదవి విరిచిన విపక్షాలు, వివిధ సంఘాలు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

కేంద్ర ఆర్థికశాఖమంత్రి నిర్మలాసీతారామన ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై జిల్లాలో మిశ్రమ స్పందన వ్యక్తమయ్యింది. కేంద్ర బడ్జెట్‌ ప్రగతిశీలంగా ఉందని, పేద మధ్యతరగతి వారికే కాకుండా అన్నివర్గాల వారికి ఆమోదయోగ్యంగా వారి శ్రేయస్సు కోరే బడ్జెట్‌గా ఉందని బీజేపీ పక్ష నేతలు అన్నారు. ఈ బడ్జెట్‌ ఆశాజనకంగా లేదని ప్రతిపక్షాలతోపాటు వివిధ సంఘాల నాయకులు పెదవి విరిచారు. పన్ను విధానం కూడా మధ్యతరగతి వారికి, ఉద్యోగులకు ఆశానజకంగా లేదనే అభిప్రాయం వ్యక్తమైంది. గతంలో కంటే ఆదాయపన్ను పరిమితి పెంచుతారని, టాక్సు రేట్లను తగ్గిస్తారని ఆశించినవారికి నిరాశే మిగిలింది. ఎలక్ర్టిక్‌ వాహనాల వినియోగం పెరుగుతున్న ప్రస్తుత దశలో ఈవీ బ్యాటరీలపై సుంకం తగ్గించడంతో వాహనాలు తక్కువ ధరలోనే అందుబాటులోకి రానున్నాయి. స్మార్ట్‌ ఫోన్లు, ఈవీకార్లు, లాబ్‌ట్యాప్‌లు, స్కూటర్ల ధరలు, ఎలక్ర్టానిక్‌ పరికరాలు, సోలార్‌, లెదర్‌ ఉత్పత్తులు, సీఎనజీ, బయోగ్యాస్‌ ధరలు తగ్గనున్నాయి.

ఫ తగ్గనున్న క్యాన్సర్‌ ఔషధాల ధరలు

క్యాన్సర్‌, మధుమేహ వ్యాధుల మందుల ధరలను తగ్గించడంపై అన్నివర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్‌లో మద్యం, విదేశీ మద్యం, లగ్జరీ వాచల ధరలు పెరుగనున్నారు. సిగిరేట్లు, పొగాకు ఉత్పత్తులు, గుట్కాల వంటి ధరలు పెరుగుతాయి. టైర్‌-2, టైర్‌-3 నగరాలను అభివృద్ధి చేసేందుకు కేంద్రం ప్రత్యేకంగా నిధులు అందించడానికి ఈ బడ్జెట్‌లో ప్రతిపాదించడంతో కరీంనగర్‌ లాంటి జిల్లాలకు ప్రత్యేక గ్రాంట్లు అందనున్నాయి. దేవాలయాలున్న పట్టణాలకు కూడా నిధులు లభించనున్నాయి.

ఫ విద్యారంగానికి నామమాత్రపు కేటాయింపులు

కేంద్ర మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో విద్యారంగానికి తిరిగి అన్యాయమే జరిగింది. 53.47 లక్షలకోట్లతో ప్రవేశపెట్టిన మొత్తం బడ్జెట్‌లో విద్యకు కేటాయించింది కేవలం 1,39,289 కోట్లు. మొత్తం బడ్జెట్‌లో 2.6శాతం మాత్రమే. దేశ జీడీపీలో 6శాతం కేటాయించాలని, కేంద్ర వార్షిక బడ్జెట్‌లో 10శాతం కేటాయించాలని కొఠారి కమిషన సిఫారుసులు సూచిస్తుండగా కేవలం విద్యకు 2.6శాతం నిధులు కేటాయించడం చూస్తుంటే విద్యారంగంపట్ల కేంద్రపాలకుల నిర్లక్ష్యాన్ని, పట్టింపులేని దోరణి తెలియజేస్తుందని చెబుతున్నారు. 50 లక్షల కేంద్ర ప్రభుత్వోద్యోగులు, 70 లక్షల మంది పెన్షనర్లకు కేంద్రమంత్రి నిరాశకు గురిచేశారు. ఈ బడ్జెట్‌లో కనీసం 30శాతం ఇంటరియమ్‌ రిలీఫ్‌ ఇస్తారని వారు ఎదురు చూశారు కాని ఎలాంటి ప్రకటన చేయలేదు.

Updated Date - Feb 02 , 2026 | 02:01 AM