Karimnagar: మున్సిపోల్స్‌లో బీజేపీని గెలిపించండి..
ABN , Publish Date - Jan 07 , 2026 | 11:31 PM
జమ్మికుంట, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలను బీజేపీకి అప్పగిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు.
- అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం..
- ఎయిర్‌పోర్ట్ తరహాలో జమ్మికుంట రైల్వే స్టేషన్‌ను ఆధునీకరిస్తాం
- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్
జమ్మికుంట, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలను బీజేపీకి అప్పగిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం జమ్మికుంట డిగ్రీ, పీజీ కళాశాల మైదానంలో సింథటిక్ ట్రాక్ నిర్మాణానికి 6.5 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ కళాశాలను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో, మున్సిపాలిటీల్లో బీజేపీ అధికారంలో లేకపోయినా కేంద్రం నుంచి ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే జమ్మికుంట రైల్వే స్టేషన్‌ను అమృత్ పథకంలో చేర్చి కరీంనగర్ తరహాలో అభివృద్ధి చేయబోతున్నామని తెలిపారు. సింథటిక్ ట్రాక్ నిర్మాణానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై కళాశాల ప్రిన్సిపాల్, సిబ్బందితో సమావేశమయ్యారు. వారి సూచనలను తీసుకున్నారు. కళాశాలకు సబంధిచిన కొంత స్థలం కబ్జాకు గురైందని, ఆ స్థలాన్ని తిరిగి అప్పగించాలని ప్రిన్సిపాల్, సిబ్బంది కోరారు. అనంతరం బండి సంజయ్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ జమ్మికుంటలో సింథటిక్ ట్రాక్ నిర్మించాలని గతంలో అనేక ప్రతిపాదనలు వచ్చాయని, దీంతో కేంద్ర మంత్రి మన్సుక్ మాండవీయను కలిసి ఆ ప్రతిపాదనలు అందజేశామన్నారు. ఆయన 6.5 కోట్ల రూపాయలు మంజూరు చేశారన్నారు. అవసరమైతే మరిన్ని నిధులు కేటాయిస్తామనపి తెలిపారు. వెంటనే టెండర్ నిర్వహించి పనులు ప్రారంభిస్తామన్నారు. ప్రభుత్వ, పైవ్రేట్ వ్యక్తుల స్థలాల జోలికి ఎవరైనా వస్తే ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. జమ్మికుంట, హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రులకు మూడు కోట్ల విలువైన పరికరాలు అందజేశామన్నారు. వీటితోపాటు నియోజకవర్గంలో అనేక కుల సంఘాలకు, గుడి కోసం, బడి కోసం నిధులిచ్చామని తెలిపారు. జమ్మికుంట పేరుకే మున్సిపాలిటీగా ఉందని, ఎటువంటి అభివృద్ధి జరగలేదని, వర్షాలొస్తే పలు కాలనీలు మునిగిపోతున్నాయన్నారు. అభివృద్ధికి సహకరించే వారు లేరని, కనీసం ప్రతిపాదనలు పంపే వారు కూడా లేరని అన్నారు. జమ్మికుంట మున్సిపాలిటీని బీజేపీకి అప్పగిస్తే అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. కేంద్ర మంత్రిగా కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నానని తెలిపారు. కరీంనగర్ తరహాలో జమ్మికుంట రైల్వే స్టేషన్‌ను అమృత్ పథకంలో చేర్చి ఎయిర్ పోర్టు తరహాలో తీర్చిదిద్దుతామన్నారు. నాయిని చెరువును పర్యాటక ప్రాంతంగా మారుస్తామని హామీ ఇచ్చారు. అద్దెకు ఉండేవారి కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే.. యజమానులు ఇంట్లోకి రానివ్వడం లేదని, దీంతో వాళ్లు చాలా ఇబ్బంది పడుతున్నారన్నారు. ఈ అంశంపై కలెక్టర్, ఆర్డీవోతో మాట్లాడుతానని, వారు స్థలం ఇస్తే ఎంపీ నిధులతో భవన సముదాయాన్ని నిర్మిస్తానని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, నాయకులు ఆకుల రాజేందర్, రఘు పాల్గొన్నారు.