Karimnagar: డంపింగ్ యార్డుగా ఎల్‌ఎండీ
ABN , Publish Date - Feb 27 , 2026 | 12:21 AM
తిమ్మాపూర్, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): దిగువ మానేరు జలాశయం కలుషితమవుతోంది.
- డ్యాంలో నీటి నిల్వలు తగ్గడంతో ఎక్కడ పడితే అక్కడ చెత్తాచెదారం
- నీరు కలుషితమయ్యే అవకాశం
- మట్టి తవ్వకాలతో భారి గుంతలు
- భారీ వృక్షాలను నరికి తీసుకువెళుతున్నా పట్టించుకోని అధికారులు
తిమ్మాపూర్, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): దిగువ మానేరు జలాశయం కలుషితమవుతోంది. ప్రస్తుతం జలాశయంలో నీటి నిల్వలు తగ్గాయి. మండలంలోని మహాత్మానగర్ గ్రామంతోపాటు చుట్టపక్కల ప్రాంతాల నుంచి వ్యర్థాలు, చెత్తాచెదారం తీసుకువచ్చి డ్యాం పరిసరాల ప్రాంతాల్లో వేస్తున్నారు. దీంతో జలాశయం డంపింగ్ యార్డును తలపిస్తోంది. చికెన్ సెంటర్ నిర్వహకులు వ్యర్థాలను, దుకాణాల వారు చెత్త వేస్తున్నారు. కొందరు పడేసిన చెత్తను అక్కడే కాల్చేస్తున్నారు. దీంతో గాలి దుమారం వచ్చినప్పుడు, వర్షం పడినప్పుడు చెత్త, వ్యర్ధాలు సమీపంలో ఉన్న ఎల్‌ఎండీలో ఉన్న నీటిలోకి కొట్టుకుపోయి నీరు కలుషితమయ్యే అవకాశం ఉంది. ఎల్‌ఎండీలో నీరు తగ్గుముఖం పడుతుండడంతో డ్యాంలో ఉన్న మట్టిని తవ్వి అక్రమంగా తరలిస్తారు. ప్రస్తుతం నీరు తగ్గడంతో భారీ గుంతలు బయటపడుతున్నాయి. ఎల్‌ఎండీ పరిసరాల్లో భారీగా చెట్లు ఉన్నాయి. ఈ వృక్షాలపై కొందరి కన్నుపడింది. ఇష్టారాజ్యంగా వాటిని నరికి అక్రమంగా తరలిస్తున్నారు. ఇదంతా బహిరంగంగా జరిగినా అధికారులు పట్టించుకోవడం లేదు. స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.