Share News

Karimnagar : మనం.. మనం.. కలిసి పంచుకుందాం..

ABN , Publish Date - Jun 01 , 2026 | 01:46 AM

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌) రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ తర్వాత ద్వితీయ శ్రేణి నగరాల్లో ఒకటిగా, స్మార్ట్‌ సిటీగా అభివృద్ధి చెందే దిశగా అడుగులు వేస్తున్న కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌

Karimnagar :  మనం.. మనం..  కలిసి పంచుకుందాం..

- యాభై కోట్ల యూడీఐఎఫ్‌ పనుల్లో రింగ్‌..

- భవిష్యత్తులో ఇదే పద్ధతి పాటిద్దామని ప్రణాళిక

- 71 పనులకు సింగిల్‌ టెండర్లు

- విమర్శలు రావడంతో బెడిసికొట్టిన కాంట్రాక్టర్ల ఎత్తుగడ

- కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మౌనంపై అనుమానాలు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ తర్వాత ద్వితీయ శ్రేణి నగరాల్లో ఒకటిగా, స్మార్ట్‌ సిటీగా అభివృద్ధి చెందే దిశగా అడుగులు వేస్తున్న కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌లో అవినీతి, అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. స్మార్ట్‌ సిటీ పనుల్లో అందినకాడికి దండుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. తాజాగా 50 కోట్ల రూపాయల విలువచేసే అభివృద్ధి పనుల టెండర్ల విషయంలో ప్రణాళికబద్ధ దోపిడీకి తెరతీశారు. కార్పొరేషన్‌ ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకోవడానికి నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డ కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఆ తర్వాత ఎవరికి మెజారిటీ రాక పోవడంతో అధికార పీఠాన్ని అందుకోవడం కోసం రకరకాల ఎత్తులు వేశాయి. ఆ క్రీడలో బీజేపీది పైచేయిగా నిలిచింది. బీఆర్‌ఎస్‌ సహకారంతోనే అధికారాన్ని చేజిక్కించుకున్నదనే విమర్శలు వచ్చాయి. ఆ సహకారమే ఇప్పటికీ కొనసాగుతుందనే ఆరోపణలు వస్తున్నాయి.

ఫ యూడీఐఎఫ్‌ పనులకు సిండికేట్‌

50 కోట్ల రూపాయల యూడీఐఎఫ్‌ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు నిర్వహించిన టెండర్లను దక్కించుకోవడానికి కాంట్రాక్టర్లు సిండికేట్‌గా మారారు. 71 పనులను సింగిల్‌ టెండర్‌తో కైవసం చేసుకున్నారు. తమ డివిజన్‌లో పనులు జరిగితే వ్యవస్థీకృతంగా తమకు వచ్చే మాముళ్ల వాటా తమకెలాగు వస్తుంది. దానికి తోడుగా తృణమో ఫణమో అదనంగా వస్తుందని రాజకీయాలు మరిచి మూడు పార్టీల కార్పోరేటర్లు ఏకమై కంట్రాక్టర్ల సిండికేట్‌కు తెరవెనుక మద్ధతుగా నిలిచారని సమాచారం. ఎవరి నుంచి ఎలాంటి అభ్యంతారలు రాకపోవడంతో 50 కోట్ల టెండర్లు కాంట్రాక్టర్లు అనుకున్న విధంగా ఖరారయ్యాయి. ప్రధాన రాజకీయపక్షాలు, కాంట్రాక్టర్లు కలిసి చేసిన ఈ వ్యవహారం గుప్పుమనడంతో ఫార్వర్డ్‌ బ్లాక్‌, సీపీఎం ఆందోళన నిర్వహించి మున్సిపల్‌ కమిషనర్‌కు టెండర్లు రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ వినతి పత్రాలు సమర్పించాయి. అప్రమత్తమైన మున్సిపల్‌ కమిషనర్‌ టెండర్లు పిలిచిన 87 పనుల్లో సింగిల్‌ టెండర్లు వచ్చిన 70 పనుల టెండర్లను రద్దు చేసి అసలే టెండరు రాని మరో పనిని వీటికి కలిపి 71 పనులకు తిరిగి టెండర్లు పిలుస్తూ నోటిఫికేషన్‌ జారీ చేశారు. దీంతో వామ పక్షాలు తలపెట్టిన ఆందోళన వాయిదా పడింది.

ఫ సిండికేట్‌ కోసం వసూళ్లు

కాంట్రాక్టర్ల సంఘం యూడీఐఎఫ్‌ పనులు దక్కించుకోవడానికి 50 లక్షల రూపాయలు వసూలు చేసుకుని వాటిని వారికి సహకరిస్తూ అండగా నిలిచిన వివిధ పార్టీల నేతలకు, ప్రజాప్రతినిధులకు ఇవ్వడానికి వెచ్చించారని ప్రచారం జరుగుతున్నది. ప్రస్తుతం 50 కోట్ల రూపాయల పనులకు సంబఽంధించిన టెండర్లలోనే కాంట్రాక్టర్లు సిండికేట్‌గా మారి పెద్ద మొత్తంలో లాభాలు దండుకోవాలని మాత్రమే అనుకోలేదని, త్వరలో రానున్న 850 కోట్ల అర్బన్‌ చాలెంజ్‌ ఫండ్‌తో చేపట్టే పనుల విషయంలోనూ వారు ఆలోచించారని తెలుస్తున్నది. రాజకీయ పార్టీల నేతల మధ్య ఆయా పార్టీల కార్పోరేటర్ల మధ్య సఖ్యత కుదిర్చి తమకు అనుకూలంగా మార్చుకుని వచ్చే పనులను కూడా సిండికేట్‌గా దక్కించుకుంటే కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చనే పథకంతోనే ఈ ప్రయత్నాలు ప్రారంభించారని అనుమానిస్తున్నారు. ఇందుకు అన్ని పార్టీల నాయకులు కిమ్మనకుండా ఉండడమే దానికి బలం చేకూరుస్తున్నది.

ఫ స్పందించని ప్రతిపక్షాలు

మున్సిపల్‌ కార్పొరేషన్‌లో బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలకు చెందిన పలువురు కార్పొరేటర్లు తరుచూ విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌, బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు చల్ల హరిశంకర్‌, కాంగ్రెస్‌ కార్పొరేషన్‌ అధ్యక్షుడు, కార్పొరేటర్‌ వైద్యుల అంజన్‌కుమార్‌ సహా పలువురు విపక్షాల నేతలు బీజేపీపై, కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్‌పై విమర్శలు చేస్తూ కార్పొరేషన్‌లో తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ వచ్చారు. యూడీఐఎఫ్‌ టెండర్లలో కాంట్రాక్టర్లు సిండికేట్‌ అయ్యారన్న విషయంలో మాత్రం పెదవి విప్పకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. కాంట్రాక్టర్ల సంఘం ముందే నేతలను మేనేజ్‌ చేయడం వల్లనే ఏ నాయకుడు మాట్లాడడం లేదనే విమర్శలు వస్తున్నాయి. కార్పొరేషన్‌లో అధికారం చేపట్టిన సందర్భంలో ఆ తర్వాత కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్‌ అవినీతికి తావు లేదని, పనుల నాణ్యత విషయంలో రాజీపడేది లేదంటూ తేల్చి చెప్పారు. అలాంటి వ్యవహారాలపై కఠినంగా వ్యవహరిస్తామని కార్పొరేటర్లను హెచ్చరించారు. బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత అతి స్వల్ప కాలంలోనే కాంట్రాక్టర్లు సిండికేట్‌ అయిన వ్యవహారం వెలుగులోకి వచ్చి టెండర్ల రద్దుకు దారి తీయడం బీజేపీ పాలక వర్గాన్ని ఇరుకున పెట్టే అంశంగా మారింది. కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్‌ ఈ వ్యవహారంలో ఎలా స్పందిస్తారని నగరవాసులు ఎదురు చూస్తున్నారు.

Updated Date - Jun 01 , 2026 | 01:46 AM