Karimnagar : చలో..చలో.. సర్కార్ బడికి..
ABN , Publish Date - Jun 29 , 2026 | 01:17 AM
కరీంనగర్ టౌన్, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): ప్రైవేట్ పాఠశాలల్లో మాదిరిగా చిన్నారులకు ప్రాథమిక విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అందుబాటులోకి
- ప్రీ ప్రైమరీ స్కూల్స్‌కు పెరుగుతున్న ఆదరణ
- పిల్లలను చేర్పిస్తున్న తల్లిదండ్రులు
- ఆన్‌లైన్‌లో 800 మంది పేర్ల నమోదు
- టీచర్లు, ఆయాల నియమిస్తే మరింత సంఖ్య పెరిగే అవకాశం
- జూలై 1 నుంచి పూర్తిస్థాయిలో బోధన
కరీంనగర్ టౌన్, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): ప్రైవేట్ పాఠశాలల్లో మాదిరిగా చిన్నారులకు ప్రాథమిక విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ప్రీ ప్రైమరీ స్కూల్స్‌కు తల్లిదండ్రుల నుంచి ఆదరణ పెరుగుతోంది. ప్రైవేట్ పాఠశాలల్లో అడ్డగోలుగా ఫీజులు, యూనిఫామ్, ఇతరత్రా ఖర్చులను భరించలేని పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన చాలా మంది తల్లిదండ్రులు ప్రీప్రైమరీ స్కూల్స్‌లో చిన్నారులను చేర్పిస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే 25 ప్రీప్రైమరీ స్కూల్స్ ఉండగా ఈ విద్యాసంవత్సరంలో కొత్తగా మరో 58 ప్రాథమిక పాఠశాలల్లో ప్రీప్రైమరీ విద్యను అందుబాటులోకి తెచ్చారు. దీనితో మొత్తం జిల్లాలో ప్రీప్రైమరీ స్కూల్స్ సంఖ్య 83కు పెరిగింది.
ఆకర్షణీయమైపన బొమ్మలతో..
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీప్రైమరీ విద్యాబోధన కోసం ప్రత్యేకంగా గదిని ఏర్పాటు చేసి వారికి ఆటపాటలతో విద్యాబోధన చేసేందుకు ఒక్కో స్కూల్‌కు ఒక ఇన్‌స్ట్రక్టర్ (టీచర్), ఒక ఆయాను నియమిస్తోంది. ప్రీప్రైమరీ గదిని ఆకర్షణీయమైన బొమ్మలతో పెయింటింగ్ చేసి, స్టేషనరీ, టీఎల్‌ఎం మెటీరియిల్, బొమ్మలు, యూనిఫామ్ కోసం ప్రభుత్వం లక్ష రూపాయలను విడుదల చేసింది. దీంతో ఆయా పనులు చేపడుతున్నారు. ఒక్కో స్కూల్‌లో 20 మంది చొప్పున విద్యార్థులను చేర్పించాలని లక్ష్యాన్ని నిర్దేశించగా 83 పాఠశాలల్లో ఇప్పటికే 800 మంది ఆన్‌లైన్‌లో తమ పిల్లల పేర్లను నమోదు చేయించారు. కొత్తగా ఈ విద్యాసంవత్సరం ప్రారంభించే కొన్ని స్కూల్స్‌లో ఇప్పటికే చిన్నారులను చేర్పించగా బడిబాటలో ఉపాధ్యాయులు కూడా ప్రీప్రైమరీ పాఠశాలలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించి వారి పిల్లలను చేర్చుకుంటున్నారు.
అన్ని సౌకర్యాలు కల్పిస్తే..
వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు పునః ప్రారంభమై దాదాపు 15 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ప్రీప్రైమరీ టీచర్ల (ఇన్‌స్ట్రక్టర్ల)ను, ఆయాలను ఇంకా నియమించ లేదు. చాలా స్కూల్స్‌లో పెయింటింగ్స్, ఇతర మెటీరియల్స్‌ను కూడా తీసుకురాలేదు. గతంలోని స్కూల్స్‌తోపాటు కొన్ని చోట్ల ఉపాధ్యాయులు ప్రీప్రైమరీ స్కూల్స్‌లో ప్రవేశాలపై ప్రత్యేక దృష్టిసారిస్తుండడంతో అక్కడ దాదాపు టార్గెట్ మేరకు ప్రవేశాలు పూర్తిచేసి చిన్నపిల్లలకు విద్యాబోధన కూడా చేస్తున్నారు. కాగా ప్రీప్రైమరీ టీచర్లు, ఆయాలను కాంట్రాక్టు విధానంలో నియమించేందుకు జిల్లా విద్యాశాఖ ఇప్పటికే నియామకపక్రియను దాదాపు పూర్తిచేసినప్పటికీ ఇంకా టీచర్లు, ఆయాలకు నియామక ఉత్తర్వులు ఇవ్వలేదు. టీచర్లు, ఆయాలను నియమించి, పెయింటింగ్స్, ఇతర మెటీరియల్స్‌తోపాటు చిన్నారులకు స్కూల్ యూనిఫామ్‌ను అందిస్తే దాదాపు అన్ని స్కూల్స్‌లో టార్గెట్ మేరకు అడ్మిషన్లు వస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తల్లిదండ్రులకు కూడా ఆర్థికభారం తగ్గించినట్లవుతుంది.