Karimnagar : ఎల్‌నినోను ఎదుర్కొందాం..
ABN , Publish Date - Jul 20 , 2026 | 12:57 AM
కరీంనగర్, జూలై 19 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘కనీవినీ ఎరుగని కరువు పరిస్థితులు రాబోతున్నాయి..
- కనీవినీ ఎరుగని కరువు పరిస్థితులు రాబోతున్నాయి...
- రైతులు, ప్రజలను కాపాడుకోవడమే ప్రధాన లక్ష్యం
- ఆరుతడి, ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించాలి..
- వార్డు మెంబరు, సర్పంచు నుంచి ఎంపీ వరకు..
- పంచాయతీ కార్యదర్శి నుంచి కలెక్టర్ వరకు బాధ్యత తీసుకోవాలి.
- తాగునీటికి ఇబ్బందులు రాకుండా ప్రణాళికలు
- ఉమ్మడి జిల్లాస్థాయి సమీక్ష సమావేశంలో ఇనచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు
కరీంనగర్, జూలై 19 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘కనీవినీ ఎరుగని కరువు పరిస్థితులు రాబోతున్నాయి.. చాలా తక్కువగా వర్షపాతం నమోదవుతుంది.. రైతులు, ప్రజలను కాపాడుకునేందుకు అదరం సమష్టిగా కృష్టి చేద్దాం.. ఎల్‌నినోను సమర్థవంతంగా ఎదుర్కొందాం’ ఉమ్మడి జిల్లా ఇనచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు.. కరీంనగర్ కలెక్టరేట్‌లో ఎల్‌నినో ఎదుర్కొనేందుకు రూపొందించిన ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళిక అమలుపై ఉమ్మడి జిల్లా స్థాయి సమీక్ష సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇనచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణతోపాటు మహారాష్ట్ర, కర్ణాటకపై ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందన్నారు. వర్షపాతం ఆశించిన స్థాయిలో నమోదుకాకపోవచ్చని, ముందస్తు చర్యలే ప్రజలను రక్షిస్తాయన్నారు. రైతులకు ఈ విషయంపై విస్తృతంగా అవగాహన కల్పించాలని, తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్లించాలని అధికారులను ఆదేశించారు. ఆయిల్‌పామ్‌తో పాటు కందులు, నువ్వులు, వేరుశనగ, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, ఉద్యాన పంటల సాగును నేల స్వభావానికి అనుగుణంగా ప్రోత్సహించాలని సూచించారు. జలాశయాల్లో ఆశించిన స్థాయిలో నీటి నిల్వలు లేవని, భూగర్భ జలాలు రోజురోజుకూ తగ్గుతున్నాయన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తే ఈ విపత్తును సమర్థవంతంగా ఎదురోవచ్చన్నారు.
ఫ రాజకీయాలకు అతీతంగా పనిచేద్దాం..
- మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పనిచేసి రైతులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి. కలెక్టర్లు స్పష్టమైన ప్రణాళికతో రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలి. ప్రతిపక్షాలు రైతులు, ప్రజలను ఆదుకునే కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి.
ఫ ప్రజల భాగస్వామ్యమే కీలకం..
- మంత్రి పొన్నం ప్రభాకర్
ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఇంకుడు గుంతల నిర్మాణాన్ని ఉద్యమంలా చేపట్టాలి. రైతులు ఆరుతడి, తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలి. ప్రకృతి విపత్తును సమష్టిగా ఎదుర్కోవాలంటే ప్రజల సహకారం, భాగస్వామ్యం కీలకం.
ఫ కరోనా స్ఫూర్తితో ఎల్‌నినోను అధిగమిద్దాం
- మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
కరోనా మహమ్మారిని ఎదుర్కొన్నట్లే ఎల్‌నినోను సమన్వయంతో పని చేసి ఎదుర్కోవాలి. తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కలెక్టర్లు ముందస్తు ప్రణాళికలు రూపొందించాలి. తక్కువ నీటితో సాగయ్యే మొక్కజొన్న, కందులు, పప్పుధాన్యాలు, ఇతర ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలి. ఆయిల్‌పామ్ సాగు వైపు మొగ్గు చూపేలా అధికారులు చైతన్యం కల్పించాలి.
ఫప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి
- ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి. ప్రస్తుతం మార్కెట్లో కందులకు మంచి డిమాండ్ ఉన్నది. రైతులకు ఈ విషయం వివరించి కందుల సాగును ప్రోత్సహించాలి. తాగునీటి సమస్యలు తలెత్తకుండా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలి.
ఫ డిమాండ్ ఉన్న పంటలు సాగు చేయాలి
- ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు
గ్రామ సభలు, రైతు వేదికల ద్వారా ఎల్‌నినో ప్రభావం, ప్రత్యామ్నాయ పంటల ప్రాధాన్యాన్ని రైతులకు వివరించాలి. ఆగస్టు వరకు ప్రత్యామ్నాయ పంటల సాగుకు అవకాశం ఉంది. కందులు, నువ్వులకు మంచి మద్దతు ధర లభిస్తోంది. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేస్తే రైతులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుంది.
ఫ నియోజకవర్గానికి రూ.కోటి కేటాయించాలి
- కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్
ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి కోటి రూపాయల చొప్పున డీఎంఎఫ్‌టీ కేటాయించాలి. ఈ మేరకు కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలి. రైతులకు ప్రభుత్వం పంటల బీమా ప్రీమియం చెల్లించి, సబ్సిడీపై విత్తనాలు, డ్రిప్ ఇరిగేషన సౌకర్యాలు కల్పించాలి.
ఫ కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీటిని విడుదల చేయాలి
- కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్
జిల్లాలోని జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గిపోయాయి. రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుుర్కొంటున్నారు. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి వెంటనే నీటిని విడుదల చేయాలి. వరద కాలువ, కాకతీయ కెనాల్‌లో నీటి ప్రవాహాన్ని పునరుద్ధరించి రైతులకు సాగునీటిని అందించాలి.
ఫ ఆరుతడి పంటలపై దృష్టి పెట్టాలి:
- మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ
లోటు వర్షపాతం కారణంగా రైతులు వరికి బదులుగా నువ్వులు, ఇతర ఆరుతడి పంటల సాగు వైపు మళ్లాలి. ఇందుకోసం అధికారులు గ్రామస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలి. మానేరు రివర్ ఫ్రంట్ పనులను వేగంగా పూర్తి చేయాలని కోరారు.
ఫ రాజకీయాలకు అతీతంగా రైతులను ఆదుకుందాం
- చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
రైతులను ఆదుకోవడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. రాజకీయాలకు తావు లేకుండా రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపడదాం. ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలి.
ఫ తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలి
- రామగుండం ఎమ్మెల్యే మక్కాన సింగ్
రామగుండం నియోజకవర్గంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం రైతులు, ప్రజలను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటోంది.
ఫ ఎల్‌ఎండీకి నీటిని విడుదల చేయాలి
- కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్
ఎల్‌ఎండీలో నీటిమట్టం డెడ్ స్టోరేజీకి చేరింది. కరీంనగర్‌లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ప్రస్తుతం ఎల్‌ఎండీలో 5.5 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఎల్లంపల్లి నుంచి రెండు టీఎంసీల నీటిని ఎల్‌ఎండీకి తరలించాలి. అమృత వాటర్ పైప్‌లైన పనులను వేగవంతం చేయాలి.
ఫ ప్రత్యేక నిధులతో బోర్లు వేయించాలి:
- రామగుండం మేయర్ మహంకాళి స్వామి
రామగుండంలో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక నిధులు కేటాయించి అవసరమైన చోట్ల బోర్లు వేయించాలి. ముందస్తు చర్యలతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి.
ఫ జిల్లాను ఆదర్శంగా నిలుపుతాం..
- కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా
ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఇప్పటికే వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాము. పంటల మార్పిడి విధానం, ఆరుతడి పంటల సాగుపై రైతు వేదికల ద్వారా గ్రామ గ్రామాన విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. తక్కువ నీటితో సాగయ్యే పంటలను ప్రోత్సహిస్తూ జిల్లాను రాషా్ట్రనికి ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశాం. అవసరమైన చోట యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటాం.
ఫ యాక్షన ప్లాన సిద్ధం చేశాం..
- రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గరిమ అగ్రవాల్
జిల్లాలో ఇప్పటికే ప్రత్యేక యాక్షన ప్లాన రూపొందించి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం. ఆరుతడి పంటల సాగుపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. తక్కువ వర్షపాత పరిస్థితులపై ఎప్పటికప్పుడు రైతులను అప్రమత్తం చేస్తున్నాం.
ఫ పంటల మార్పిడిపై అవగాహన కల్పిస్తున్నాం..
- జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్
పంటల మార్పిడి, ఆరుతడి పంటల సాగుపై ప్రతి రైతుకు అవగాహన కల్పిస్తున్నాం. విపత్కర పరిస్థితులను రైతులకు వివరించి ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లేలా చైతన్యం కల్పిస్తున్నాం. జిల్లాలో ఈసారి రైతులు వరి సాగు తగ్గించి ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపుతున్నారు.
ఫ ఆరుతడి పంటలకు ప్రాధాన్యం:
- పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష
ఎల్‌నినో ప్రభావంతో ప్రజలు, రైతులు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నాం. కంది, నువ్వులు, వేరుశనగ, మొక్కజొన్న వంటి ఆరుతడి పంటల సాగును ప్రోత్సహిస్తున్నాం. ఆయిల్‌పామ్ సాగుపై కూడా ప్రత్యేక దృష్టి సారించాం.
ఫ యుద్ధ ప్రాతిపదికన కార్యాచరణ అమలు చేయండి..
- ఉమ్మడి ప్రత్యేకాధికారి మహేశదత ఎక్కా
ఎల్‌నినో ఎదుర్కొనేందుకు రూపొందించిన కార్యాచరణను యుద్ధ ప్రాతిపదికన అధికారులు అమలు చేయాలి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలి. వరికి బదులు ఆరుతడి, ప్రత్యామ్నాయ పంటల సాగు చేసేలా రైతులను ఒప్పించాలి. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, రైతులకు అందిస్తున్న భరోసాను ప్రతి గ్రామానికి చేరవేయాలి.
ఫ నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నాం..
- వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సురేంద్ర మోహన
ఎల్‌నినో ప్రభావం, కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉంది. వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణుల సూచనల మేరకు రైతులకు అవగాహన కల్పిస్తూ, ఆరుతడి పంటల సాగును ప్రోత్సహిస్తున్నాం. భూగర్భ జలాల పరిస్థితి, వర్షపాతం, జలాశయాల్లో నీటి నిల్వలు, విద్యుత సరఫరా వంటి అంశాలపై ఎప్పటికప్పుడు రైతులకు సమాచారం అందిస్తున్నాం.
సమావేశంలో కరీంనగర్ డిప్యూటీ మేయర్ సునీల్‌రావు, కమిషనర్ ప్రపుల్ దేశాయ్, కరీంనగర్ అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాఖడే, శ్రీనివాస్‌రెడ్డి, కరీంనగర్ సీపీ గౌస్ ఆలం, జగిత్యాల ఎస్పీ అశోక్, సిరిసిల్ల ఎస్పీమహేష్ బి గీతే పాల్గొన్నారు.